Begin typing your search above and press return to search.

జగన్ రిస్క్ చేశారా...!?

చాలా మంది మంత్రుల మీద వ్యతిరేకత ఉన్నా జగన్ తిరిగి వారికే టికెట్లు ఇచ్చారు. ఉదాహరణకు అంబటి రాంబాబు, ఆర్కే రోజా, సీదరి అప్పలరాజు వంటి వారు.

By:  Tupaki Desk   |   17 March 2024 12:30 AM GMT
జగన్ రిస్క్ చేశారా...!?
X

అధికార వైసీపీ ఏకమొత్తంగా రిలీజ్ చేసిన వైసీపీ అభ్యర్ధుల జాబితా చూస్తే చాలా విషయాల మీద ఆసక్తి కనిపిస్తోంది. అదే టైం లో కొన్ని సీట్ల దగ్గర చూసుకుంటే ఆలోచించేలా ఉంది అని అంటున్నారు. జగన్ గత నాలుగు నెలలుగా కసరత్తుని తీవ్ర స్థాయిలో చేస్తూ వస్తున్నారు. అలా ఏకంగా 88 మంది అసెంబ్లీ అభ్యర్ధులను ఆయన మార్చేశారు.

ఇక మిగిలినవి చూస్తే 90 మంది దాకా అభ్యర్ధులు సిట్టింగులు. వారికే తిరిగి టికెట్లు ఇచ్చారు. ఇపుడు మార్చేసిన అభ్యర్థుల విషయంలో జరిగిన చర్చ ఒక ఎత్తు అయితే మార్చకుండా సీట్లు ఇవ్వడం మీద చర్చ సాగడం మరో ఎత్తు అని అంటున్నారు.

చాలా మంది మంత్రుల మీద వ్యతిరేకత ఉన్నా జగన్ తిరిగి వారికే టికెట్లు ఇచ్చారు. ఉదాహరణకు అంబటి రాంబాబు, ఆర్కే రోజా, సీదరి అప్పలరాజు వంటి వారు. అదే విధంగా స్పీకర్ డిప్యూటీ స్పీకర్ తమ్మినేని సీతారాం కోలగట్ల వీరభద్రస్వామి ఇద్దరి మీద వ్యతిరేకత ఉందని ప్రచారం సాగింది. కానీ వారికే టికెట్లు ఇచ్చారు.

పాతపట్నంలో రెడ్డి శాంతి వద్దు అని ఏకంగా వీధులలోకి వచ్చి వైసీపీ నేతలే ఆందోళన చేశారు. ఆమెకే టికెట్ ఖరారు అయింది. ఎచ్చెర్లలో గొర్లె కిరణ్ కుమార్ పరిస్థితి అలాగే ఉంది అని అంటున్నారు. అయితే వైసీపీ చేసిన సర్వేలలో వీరి మీద వ్యతిరేకత తగ్గి అనుకూలత పెరిగిందని అందుకే టికెట్లు ఇచ్చారని అంటున్నారు.

ఇదిలా ఉంటే సిట్టింగులకు టికెట్లు ఇవ్వడం మీద విపక్ష నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయిదేళ్లుగా వారి పనితీరు మీద ప్రజలకు ఒక అంచనా ఉందని ఇపుడు ఆ ప్రజలే వారి విషయంలో తీర్పు చెబుతారు అని అంటున్నారు. అయితే వారి పట్ల ఎంతో కొంత వ్యతిరేకత ఉన్నా జగన్ నే మొత్తం 175 సీట్లకు అభ్యర్ధిగా ప్రజలు చూస్తారు అని వైసీపీ నేతలు అంటున్నారు.

అందువల్ల అలాంటి ఇబ్బంది ఏదీ తమకు లేదని వారు అంటున్నారు. మరి ఆ ధీమా ఉంటే ఆ లెక్కలే ఉంటే 88 మంది సిట్టింగులను ఎందుకు మార్చాల్సి వచ్చింది అని కూడా విపక్షాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. అయితే వారిని మార్చడం ద్వారా సామాజిక న్యాయాన్ని తాము చేసి చూపించామని ఓసీ సీట్లలో బీసీలకు ఇతర వర్గాలకు సీట్లు ఇచ్చామని చెబుతున్నారు.

మొత్తానికి విపక్షం అధికారం పక్షం నేతల మాటలు ఎలా ఉన్నా వ్యతిరేకత సిట్టింగుల మీద ఎంతో కొంత ఉంటుందన్నది అంతా అంగీకరిస్తున్నారు. మరి జగన్ అనే ఫ్యాక్టర్ తో వీరంతా గెలిచి వస్తారనే వైసీపీ నమ్ముతోంది. ఏది ఏమైనా 88 సీట్లలో మార్పు చేర్పులతో సాహసం చేయడం కాదు, అసలైన సాహసం అయినా రిస్క్ అయినా జగన్ చేశారూ అంటే సిట్టింగులకు సీట్లు పెద్ద ఎత్తున ఇవ్వడం ద్వారానే అని అంటున్నారు. దీని మీద ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాల్సి ఉంది.