Begin typing your search above and press return to search.

జగన్ మళ్ళీ గెలిస్తే క్రెడిట్ వారికేనా ..!?

ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ కూటమి పోరులో వైసీపీ బెటర్ అనుకునే వారు ఆ పార్టీనే గెలిపిస్తారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   18 April 2024 12:30 AM GMT
జగన్ మళ్ళీ గెలిస్తే క్రెడిట్  వారికేనా ..!?
X

ఏపీలో వైసీపీ గెలుస్తుందని అనేక సర్వేలు చెబుతున్నాయి. వైసీపీ నేతలు కూడా అదే ధీమాతో ఉన్నారు. ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ కూటమి పోరులో వైసీపీ బెటర్ అనుకునే వారు ఆ పార్టీనే గెలిపిస్తారు అని అంటున్నారు. అనేక కారణాలు కూడా వైసీపీ గెలుపునకు కారణం అవుతాయని అంటున్నారు.

అదేంటి అంటే టీడీపీ కూటమి ఏర్పాటు కావడం పట్ల ప్రజలలో వ్యతిరేకత ఉందని అంటున్నారు. 2014 నాటి పరిస్థితులు వేరు ఇపుడు వేరు అంటున్న వారు ఉన్నారు. నాడు కలసి మూడు పార్టీలు ఏపీకి ఒరగబెట్టింది ఏంటి అన్న చర్చ కూడా సాగుతోంది.

మరోవైపు చూస్తే నాడు ఎందుకు పొత్తులు పెట్టుకుని విడిపోయారు. నేడు ఎందుకు కలసి వస్తున్నారు అన్న సగటు ప్రజల ప్రశ్నలకు జవాబు అయితే లేదు అంటున్నారు. అదే విధంగా చూస్తే కూటమి సొంతంగా అజెండా ఏమిటి సిద్ధం చేసుకుంది అన్న చర్చ కూడా వస్తోంది. ఎంతసేపూ వైసీపీ కంటే రెట్టింపు ఇస్తామని చెప్పడం తాము తిట్టిన వాలంటీర్ల వ్యవస్థను నెత్తికెత్తుకోవడం అన్నింటా యూ టర్న్ తీసుకోవడాన్ని కూడా తప్పుపడుతున్నారు.

రాష్ట్ర ప్రయోజనాలు అని కూటమి పెద్దలు చెబుతున్నా ఏ ప్రయోజనాల కోసం బీజేపీ నుంచి హామీలు తీసుకున్నారని చెప్పాల్సిన అవసరం లేదా అంటున్నారు. ప్రత్యేక హోదా సహా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు అలాగే పోలవరం పూర్తికి నిధులు, రాజధాని నిర్మాణానికి కేంద్ర సాయం ఇలాంటి విషయాల్లో కేంద్ర పెద్దలతో బహిరంగ సభలలో మాట్లాడించి హామీలు ఇప్పిస్తే ఎంతో కొంత నమ్మకం కలుగుతుందని అలాంటివి ఏమీ లేకుండా ఏపీ అభివృద్ధి కోసం అంటే నమ్మెదెట్లా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

ఇలా కూటమి రెండవసారి ఏర్పాటు మీద సవాలక్ష సందేహాలు జనంలో ఉన్నాయి. వేటికీ జవాబు చెప్పకుండా జగన్ ని తిడుతూ తమకే ఓటు వేయాలని జనాల వద్దకు బాబు పవన్ వెళ్తే ప్రయోజనం ఏమి ఉంటుందని అంటున్నారు. ఇక కూటమిలో లుకలుకలు చేసిన అనేక తప్పులు అభ్యర్ధుల విషయంలో చేసిన తప్పులు అదే విధంగా కూటమిలో జనసేనకు ఇచ్చిన తక్కువ సీట్లు ఆ సీట్లలో టీడీపీ నుంచి వైసీపీ నుంచి వచ్చిన వారికి సీట్లు ఇవ్వన్నీ కూటమి విజయం మీద తీవ్ర ప్రభావం చూపిస్తాయని అంటున్నారు.

అదే విధంగా చూస్తే కనుక కేంద్ర సాయం కోసం బీజేపీ పొత్తు అని బాబు భావించినా ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయా అన్నది సందేహంగా ఉందని అంటున్నారు. అలాగే బలమైన సామాజిక వర్గం మద్దతు కోసం జనసేనతో పొత్తు అన్నా అది కూడా నెరవేరే చాన్స్ ఎంతవరకూ అన్న డౌట్లు ఉన్నాయి.

మొత్తంగా చూసుకుంటే కూటమి పేరుతో గతంలో ఎన్నడూ పోనన్ని పోకడలు చంద్రబాబు పోయారు. అలాగే ఆయన కొన్ని చోట్ల కొత్త ముఖాలు అంటూ పాతవారికి సీనియర్లకు సీట్లు నిరాకరించారు. ఈ పరిణామం కూడా ఎంత మేరకు విజయావకాశాల మీద దెబ్బ తీస్తుంది అన్న సందేహాలు ఉన్నాయని అంటున్నారు.

ఇక వైసీపీకి చూస్తే రూరల్ లో ఆదరణ ఉంది. అర్బన్ లో వ్యతిరేకత ఉంది. కానీ వైసీపీకి ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడంలో కూటమి విఫలం అవుతోందని వేస్తున్న తప్పటడుగులే చెబుతున్నాయని అంటున్నారు. అలాగే కూటమి నేతలు అయిన చంద్రబాబు పవన్ చేస్తున్న ప్రసంగాలు కూడా జగన్ మీద తిట్లు తప్ప తాము వస్తే ఫలనాది చేస్తామని చెప్పలేని నిస్సహాయత ఇవన్నీ వైసీపీకే మేలు చేస్తున్నాయని అంటున్నారు.

ఏతా వాతా తేలేది ఏంటి అంటే కూటమి వ్యూహాలు పేలవంగా ఉండడమే జగన్ ని మరోసారి గద్దెనెక్కించేలా చేస్తాయని అంటున్నారు. జగన్ రెండోసారి గెలిస్తే అందుకు గానూ ఆయన వ్యూహాలు ఆయన రాజకీయ చాతుర్యం ఆయన అద్భుతమైన ఎత్తులు పై ఎత్తులు ఇవేమీ కాదు కానీ బంగారు పళ్ళెంలో అధికారాన్ని మరోమారు జగన్ కి అప్పగించేందుకు కూటమి పెద్దలే చేస్తున్న పొరపాట్లు అని అంటున్నారు. సో జగన్ గెలిస్తే ఆయనకు ఉన్న పాజిటివిటీ సగం అయితే మిగిలిన సగం మాత్రం కూటమి తప్పులతో ఇచ్చిన బలమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి చూడాలి ఏమి జరుగుతుందో.