Begin typing your search above and press return to search.

పిన్నెల్లితో ములాఖాత్ కు హెలికాఫ్టర్ లో జగన్ వెళ్లకుండా ఉండాల్సిందా?

కీలక సందర్భాల్లో తీసుకునే నిర్ణయాలు ఆచితూచి అన్నట్లుగా తీసుకోవాల్సి ఉంటుంది.

By:  Tupaki Desk   |   6 July 2024 5:21 AM GMT
పిన్నెల్లితో ములాఖాత్ కు హెలికాఫ్టర్ లో జగన్ వెళ్లకుండా ఉండాల్సిందా?
X

కీలక సందర్భాల్లో తీసుకునే నిర్ణయాలు ఆచితూచి అన్నట్లుగా తీసుకోవాల్సి ఉంటుంది. అందునా ప్రజాజీవితంలో ఉన్న వారు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. పార్టీకి బలమైన నేతగా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి ఉండటం తెలిసిందే.అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వేళ ఈవీఎంను ధ్వంసం చేసిన పిన్నెల్లి వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ కావటం తెలిసిందే.

ఈ ఉదంతంలో అరెస్టు కాకుండా కోర్టు నుంచి ఆదేశాలు పొందిన పిన్నెల్లి.. ఎన్నికల ఫలితాలు వెలువడిన కొంతకాలానికి కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన అరెస్టు కాక తప్పలేదు. ప్రస్తుతం ఆయన నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ విషయాలన్ని అందరికి తెలిసినవే. అయితే.. పిన్నెల్లిని పరామర్శించేందుకు నెల్లూరుజైలుకు వెళ్లిన సందర్భంగా తన ప్రయాణానికి అనువుగా మాజీ ముఖ్యమంత్రి జగన్.. హెలికాఫ్టర్ ను వినియోగించటం హాట్ టాపిక్ గా మారింది.

ఈ అంశంపై ఏపీ హోంమంత్రి మొదలుకొని ఏపీ అధికార పార్టీకి చెందిన పలువురు తప్పు పట్టారు. ఈవీఎంను పగుల కొట్టిన ఉదంతంలో అరెస్టు అయిన పిన్నెల్లిని పరామర్శించేందుకు జగన్ వెళ్లటం తప్పు కానప్పటికి.. ఈ పర్యటనతో తనపై వచ్చే విమర్శలకు బలమైన వాదన ఉండాలన్న విషయాన్ని మర్చిపోవటం ఒకటైతే.. సొంత బాబాయ్ వివేకానంద దారుణ హత్య కేసులో ఇప్పుడు ప్రదర్శించిన ఉత్సాహాన్ని ఎందుకు ప్రదర్శించలేదన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

పోలింగ్ వేళ.. అప్పటి ఎమ్మెల్యే హోదాలో ఉన్న పిన్నెల్లి ఎంతటి అరాచకానికి పాల్పడ్డారన్నది వీడియోల ద్వారా లోకానికి తెలిసిన పరిస్థితి. ఇలాంటి కేసుల్లో అరెస్టు అయిన నేతల్ని పరామర్శించే విషయంలో జగన్ కాసింత ఆలోచన చేయాల్సి ఉండిందన్న మాట వినిపిస్తోంది. పార్టీకి బలంగా నిలబడిన వ్యక్తికి అండగా ఉంటానన్న భరోసాను కల్పించాల్సిన బాధ్యత తనపై ఉందన్న విషయాన్ని జగన్ నమ్మి ఉండొచ్చు. దాన్ని తప్పు పట్టలేం. జగన్ తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం.. హత్య కేసులో నిందతుడిగా ఉన్న గౌరు వెంకటరెడ్డిని పరామర్శించేందుకు జైలుకు వెళ్లటం అప్పట్లో సంచలనంగా మారింది.

తాను నమ్మిన వారిని.. నమ్మకున్న వారిని పరామర్శించేందుకు జైలుకు వెళ్లటం తప్పు కానప్పటికీ.. వెళ్లే క్రమంలో వ్యవహరించిన తీరు.. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ముక్తసరిగా మాట్లాడటం.. లేదంటే మాట్లాడకుండా మౌనంగా వెళ్లటం చేసి ఉంటే బాగుండేది. అందుకు భిన్నంగా జైలు బయట జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎంతటి విమర్శలకు కారణమయ్యాయన్న విషయం తెలిసిందే. కొన్ని అంశాల మీద మాట్లాడేటప్పడు పక్కాగా కసరత్తు చేసి.. అందరికి ఆమోదయోగ్యమైన లాజిక్ ను తెర మీదకు తీసుకురావాల్సి ఉంటుంది.

అదేమీ చేయకుండా ఏదో ఒకటి చెప్పి వెళ్లాలన్న ఆలోచన ఉండి ఉంటే.. మైకు ముందుకే రాకూడదు. ఈ విషయంలో జగన్ తప్పు చేశారన్న భావన వ్యక్తమవుతోంది. ఇక.. హెలికాఫ్టర్ లో రాకుండా సాదాసీదాగా వచ్చి ఉంటే ప్రజలను మరింత ఆకట్టుకొని ఉండేదన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇకనుంచైనా ఏదైనా పని చేస్తున్నప్పుడు ముందు వెనుకా కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. మరి.. ఈ సూచన మీద జగన్ దృష్టి పెడితే మంచిది.