Begin typing your search above and press return to search.

ద్వితీయ విఘ్నం గురించి ఎవరూ చెప్పలేదా జగన్?

ప్రతిపక్ష నేత (నిజానికి ఇప్పుడు సభలో ప్రధాన ప్రతిపక్ష నేత అన్నది ఎవరూ లేరనుకోండి) గా ఉన్న జగన్మోహన్ రెడ్డి.. అనధికారికంగా అయినా హాజరు కావాల్సింది.

By:  Tupaki Desk   |   24 Jun 2024 6:30 AM GMT
ద్వితీయ విఘ్నం గురించి ఎవరూ చెప్పలేదా జగన్?
X

ఏదైనా కొత్త పనిని షురూ చేసినప్పుడు ద్వితీయ విఘ్నం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవటం కనిపిస్తుంది. అది చిన్న పని అయినా.. పెద్ద పని అయినా మొదటి రోజు మాదిరే రెండో రోజు కూడా కంటిన్యూ చేయటం ఖాయమన్నట్లుగా వ్యవహరిస్తారు. మరేం జరిగిందో తెలీదు కానీ.. తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మొదటి రోజున ఎమ్మెల్యే ప్రమాణస్వీకారం చేసేందుకు సభకు వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తన ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని పోటీ జరుగుతున్న వేళలోపూర్తి చేశారు. అనంతరం సభ నుంచి నేరుగా పార్టీ నేతలతో కలిసి ఆ వెంటనే తాడేపల్లికి వెళ్లిపోయారు.

తర్వాతి రోజు అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు హాజరు కాని జగన్.. పులివెందుల పర్యటనకు వెళ్లిపోయారు. సభా సంప్రదాయం ప్రకారం అధికార పక్ష నేత.. ప్రతిపక్ష నేత (నిజానికి ఇప్పుడు సభలో ప్రధాన ప్రతిపక్ష నేత అన్నది ఎవరూ లేరనుకోండి) గా ఉన్న జగన్మోహన్ రెడ్డి.. అనధికారికంగా అయినా హాజరు కావాల్సింది. కారణం.. అధికారికంగా ఆయన ప్రతిపక్ష నాయకుడి హోదా లేని వేళ.. ఒక ప్రతిపక్ష టీంకు నాయకుడిగా ఉన్న ఆయన సభకు వచ్చి.. స్పీకర్ ఎన్నిక ప్రక్రియలో పాలు పంచుకోవాల్సిందన్న మాట వినిపించింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ద్వితీయ విఘ్నాన్ని కూడా జగన్ లెక్క చేయకపోవటమా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఎన్నికల ఫలితాలు ఇప్పటికే ప్రతికూలంగా ఉన్న వేళ.. సెంటిమెంట్లకు అనుగుణంగా అధినేతలు ఫాలో కావటం కనిపిస్తుంది.

అందుకు భిన్నంగా జగన్ అలాంటివేమీ పట్టించుకోకుండా ద్వితీయ విఘ్నం సెంటిమెంట్ ను తుంగలోకి తొక్కేయటాన్ని పార్టీకి చెందిన పలువురు సంప్రదాయవాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలే టైం బాగోలేదన్న వేళ.. ఇలాంటి సెంటిమెంట్లను ఫాలో కాకపోవటం సరికాదన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. జగన్ కు ఇలాంటి వాటిపై నమ్మకం ఉన్నా లేకున్నా క్యాడర్ కోసం కొన్నింటిని ఫాలో కావటం మంచిదన్న మాట వినిపిస్తోంది.