Begin typing your search above and press return to search.

ప్రెస్ మీట్ పెట్టలేకపోవడం వల్లనే జగన్ ఓడిపోయారా ?

మీడియా అంటే కిటికీ లాంటిది. ఆ తలుపులు మూసుకుని గదిలో చీకటిలో ఉంటే ఏమి అర్ధం అవుతుంది

By:  Tupaki Desk   |   5 Jun 2024 12:37 PM GMT
ప్రెస్ మీట్ పెట్టలేకపోవడం వల్లనే  జగన్ ఓడిపోయారా ?
X

ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధి మీడియా. ఆ మీడియాను రాజకీయ నాయకులు ప్రజా ప్రతినిధులు చక్కగా వినియోగించుకుంటే అంతకంటే మేలు మరొకటి ఉండదు. ప్రజలు ఏమి అనుకుంటున్నారు అన్న ఫీడ్ బ్యాక్ మీడియా ద్వారానే ప్రభుత్వానికి నేరుగా తెలుస్తుంది.

మీడియా అంటే కిటికీ లాంటిది. ఆ తలుపులు మూసుకుని గదిలో చీకటిలో ఉంటే ఏమి అర్ధం అవుతుంది. అంతా బాగుంది అని కళ్ళకు గంతలు కట్టుకుని ఉన్నట్లు అవుతుంది. అదే వైసీపీ ఘోర పరాజయం వెనక బలమైన కారణమా అని కూడా చర్చిస్తున్నారు.

జగన్ విషయం చూస్తే ఆయన మీడియాకు మామూలుగా దూరంగా ఉంటారు. మొదటి నుంచి ఎందుకో ఆయన తత్వం అంతా అని అనుకున్నా పార్టీ నేతగా ఉన్నపుడు వేరు కానీ కోట్లాది మంది ప్రజలకు బాధ్యుడిగా కీలకమైన పదవిలో ఉన్న వారికి మీడియాతో మంచి సంబంధాలు ఉండాలి. ఏ విషయం అయినా ప్రజలకు చెప్పాలంటే మీడియానే ఆధారం.

అటువంటి మీడియాను జగన్ దూరం చేసుకున్నారు. చిత్రమేంటి అంటే ఆయన స్వయంగా మీడియా అధిపతి. సొంత పేపర్ చానల్ ఉన్న జగన్ మీడియాను దూరం పెట్టడంలో ఆంతర్యం ఏమిటి అన్నది అర్ధం కాదనే అంటున్నారు. గత అయిదేళ్ళలో జగన్ ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు అన్నది వాస్తవం.

ప్రభుత్వ అధినేతగా జగన్ తాను చేసిన మంచి పనులను చెప్పుకునేందుకు కూడా మీడియాను ఎక్కడా ఉపయోగించుకోలేదు. మీడియా ముఖంగా అయితే జనాలకు చేరాల్సిన విషయం చేరుతుంది. మరి ముఖ్యమంత్రి మీడియాను అడ్రస్ చేయకపోతే ఎవరు చేస్తారు, ప్రభుత్వం గురించి పాజిటివ్ గా ఎవరు చెబుతారు అన్నది ఇక్కడ ప్రశ్న.

పై స్థాయిలో జగన్ చెబితే దిగువ స్థాయిలో క్యాడర్ కూడా చెబుతారు. మరి జగన్ చెప్పక క్యాడర్ కూడా నోరు విప్పకపోతే పరిస్థితి ఇలాగే ఉంటుంది అని అంటున్నారు. అసలు పాలనలో భాగం కానీ ఎన్నడూ ఎక్కడా లేని ఒక కొత్త వ్యవస్థ వాలంటీర్లను తీసుకుని వచ్చారు. వారి మీదనే జగన్ పూర్తిగా ఆధారపడి పోయారు.

కానీ జీతానికి పనిచేసే వాలంటీర్లకు ప్రభుత్వం చేసే మంచి గురించి చెప్పాల్సిన అవసరం ఏమి ఉంటుంది అన్నదే కీలకమైన ప్రశ్న. ముఖ్యమంత్రిగా జగన్ కనీసం నెలలో ఒకసారి అయినా మీడియాను పిలిచి ప్రభుత్వం ఏమి చేస్తుందో ఎలా పనిచేస్తుందో ఏ కార్యక్రమాలను తీసుకుంటుందో చెబితే అది కొంతలో కొంత జనాలకు వెళ్తుంది.

ఆయన ఆ పని చేయలేదు. ఇక వాలంటీర్లు కూడా ఎక్కడా చేయలేదు. క్యాడర్ మాత్రం ఎందుకు పట్టించుకుంటుంది వారు గత పదేళ్ళుగా పనిచేసి ప్రభుత్వాన్ని తీసుకుని వచ్చారు. కానీ వారికి ఏ మాత్రం గుర్తింపు లేకుండా తొక్కేశారు. మధ్యలో వాలంటీర్లను పెట్టి మరీ అంతా వారితోనే అని అమలు చేశారు.

దాంతో ప్రభుత్వం చేసే మంచి అన్నది జనాలకు చేరుకోకుండా పోయింది. అదే సమయంలో విపక్షాలు చేసే వ్యతిరేక ప్రచారం మాత్రం జనాలలోకి బాగా వెళ్ళింది. దాన్ని కౌంటర్ చేయాల్సిన మంత్రులు అసలు సబ్జెక్ట్ వదిలేసి తీవ్ర విమర్శలు చేయడం, విపక్ష నేతల మీద వ్యక్తిగతంగా ఎటాక్ చేయడం వంటి వాటితో మరింత డ్యామేజ్ జరిగింది.

ప్రభుత్వం ఏమీ చేయలేదు కాబట్టే చెప్పుకోవడానికి లేదు అన్న భావన కూడా జనంలోకి వెళ్ళింది. చివరి రోజులలో జగన్ సభల్లో ఎంతో కొంత చెప్పినా అప్పటికే ఎన్నికల మూడ్ వచ్చేసింది. జనాలకు ప్రభుత్వం మీద ఒక వ్యతిరేక భావన పూర్తిగా స్థిరపడిపోయింది. ప్రభుత్వాన్ని ఎలాగైనా ఓడించాలని డెసిషన్ తీసుకున్నాక చేతులు కాలక ఆకులు పట్టుకున్న చందం అయింది.

మీడియాను పట్టించుకోకుండా దూరం పెట్టిన వారు ఓడిపోయిన సంఘటలు దేశంలో కొన్ని ఉన్నాయి. అవి కూడా ఎక్కడో లేవు పొరుగు రాష్ట్రం తమిళనాడులో ఉన్నాయి. తమిళనాడులో జయలలిత తొలిసారి సీఎం అయినపుడు మీడియాకు దగ్గరకు రానీయలేదని ప్రచారం సాగింది. అదే సమయంలో డీఎంకే విపక్షంలో ఉంటూ ప్రభుత్వాన్ని విమర్శించేది. అది జనాల్లోకి వెళ్ళి ఆమె 1996లో ఓటమి పాలు అయ్యారని అంటారు. ఆ తరువాత ఆమె మార్పు చేసుకుని మళ్ళీ రెండు సార్లు అధికారంలోకి వచ్చిన నేపధ్యం కూడా ఉంది. కాబట్టి మీడియాకు దూరంగా ఉంటూ ఏ విషయం చెప్పకుండా చేయడం కూడా జగన్ చేసిన అతి పెద్ద తప్పులలో ముందు వరసలో ఉంటుందని అంటున్నారు.