సచివాలయాలలో జగన్ ముద్ర చెరిగిపోతుందా ?
ఇక ఏపీలో చూసుకుంటే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో భారీ ఎత్తున ప్రక్షాళనను టీడీపీ కూటమి సర్కార్ చేపట్టనున్నట్లుగా తెలుస్తోంది.
By: Tupaki Desk | 9 Aug 2024 12:30 AM GMTఏపీలో అయిదేళ్ల వైఎస్ జగన్ పాలనలో కొన్ని పాలనా సంస్కరణలు అమలు చేసారు. అయితే అవి ఆచరణలో బాగానే ఉన్నా కొన్ని అనవసరంగా ఉన్నాయన్నది ఉంది. ఉదాహరణకు గ్రామ వార్డు సచివాలయాలలో పది మంది సిబ్బందిని పెట్టి పోషించడం అంటే అది దండుగ మారి వ్యవహారమే అని కూడా ఆనాడు విమర్శలు వచ్చాయి.
కేవలం రెండు వేల జనాభాకు పది మంది స్టాఫ్ అందులో కూడా చాలా మందికి పని ఉండేది కాదు. ఈ విధంగా దాదాపుగా అయిదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం నడిపింది. ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవడానికో లేక ప్రజలకు బాగా దగ్గరగా పాలన తీసుకుని వస్తున్నామన్న అతి ఉత్సాహంలో తెలియదు కానీ స్టాఫ్ ఎక్కువ అయిపోయారు పని లేదు అన్న విమర్శలు మొదటి నుంచి ఉన్నాయి.
ఇక ఏపీలో చూసుకుంటే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో భారీ ఎత్తున ప్రక్షాళనను టీడీపీ కూటమి సర్కార్ చేపట్టనున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఏపీలో 10 వేల 960 గ్రామ సచివాలయాలు అలాగే నాలుగు వేల 44 వార్డు సచివాలయాలు ఉన్నాయి. ఇలా గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వారు 1.61 లక్షల మంది సిబ్బంది ఉన్నారు.
వీరి విషయంలో ఏమి చేయాలని గడచిన రెండు నెలలుగా కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఏపీలో పలు ప్రభుత్వ ఆఫీసులలో ఖాళీలు ఉన్నాయి. అక్కడ పని అవసరం ఉంది. అలాంటి చోటకు ఈ సిబ్బందిని తీసుకుని వెళ్తారా అన్న చర్చ సాగుతోంది.
అదే విధంగా కేవలం రెండు వేల మందికి కాకుండా ప్రతీ పది వేల మందికి ఒక వార్డు లేదా గ్రామ సచివాలయం ఉంచితే ఎలా ఉంటుంది అన్న ప్రతిపాదనను కూడా సీరియస్ గానే పరిశీలిస్తున్నారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఇపుడు అత్యధికంగా కనిపిస్తున్న గ్రామ, వార్డు సెక్రటరీలను ప్రభుత్వం తమ అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవాలని చూస్తోంది.
అలా గ్రామ, వార్డు సెక్రటరీలను వినియోగించుకునేలా కసరత్తు అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. అంతే కాదు గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల్లో రేషనలైజేషన్ పాటించేలా ప్రతిపాదనలను కూడా సిద్ధం చేస్తున్నారు. ఇక వీటికి పేర్లు కూడా కొత్తవి పెడతారని సచివాలయాలు అని కాకుండా కొత్త రూపులో కొత్త విధానంలో తీసుకుని వచ్చి పౌర సేవలను మరింత సమర్ధంగా ఉండేలా చూస్తారని అంటున్నారు.
అయితే అసలు విషయం ఏమిటి అంటే జగన్ ముద్ర ఎక్కడా లేకుండా మొత్తం డిజైన్ చేస్తారు అని అంటున్నారు. మరి సచివాలయాలలో జగన్ మార్క్ లేకుండా కూటమి ఏ రకంగా వీటిని రీ డిజైన్ చేస్తుంది అన్నది ఆసక్తికరంగా ఉంది.