లండన్ నుంచి రాగానే జగన్ తీసుకునే సంచలన నిర్ణయాలు ఇవే!
ఈ నేపథ్యంలో లండన్ లో ఉన్న తన కుమార్తెలను చూడటానికి వెళ్లిన వైఎస్ జగన్ సెప్టెంబర్ 11న తిరిగి రాష్ట్రానికి రానున్నారు.
By: Tupaki Desk | 8 Sep 2023 8:12 AM GMTఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిచి అధికారంలోకి రావాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ కృతనిశ్చయంతో ఉన్నారు. వైనాట్ 175 అంటూ ఆయన తమ పార్టీ నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. 175 సీట్లకు 175 గెలవాలని ఉద్భోదిస్తున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే ‘గడప గడపకు మన ప్రభుత్వం’ పేరుతో వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జులు రాష్ట్రమంతా ఇంటి ఇంటికీ తిరిగారు. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారాలకు ఆదేశాలిచ్చారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ముగియగానే మా భవిష్యత్ నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్ పేరుతో ఇంటింటికీ స్టిక్కర్లు అంటించే కార్యక్రమానికి కూడా వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జులు శ్రీకారం చుట్టారు. అలాగే జగనన్న సురక్ష పేరుతో వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలకు కావాల్సిన వివిధ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.
ఈ నేపథ్యంలో లండన్ లో ఉన్న తన కుమార్తెలను చూడటానికి వెళ్లిన వైఎస్ జగన్ సెప్టెంబర్ 11న తిరిగి రాష్ట్రానికి రానున్నారు. రాగానే ఆయన సంచలన నిర్ణయాలు తీసుకుంటారని టాక్ నడుస్తోంది.
ప్రస్తుతం వచ్చే ఎన్నికల కోసం వైసీపీకి ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని ఐప్యాక్ టీమ్ సేవలందిస్తోంది. ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహించడంతోపాటు నివేదికలు అందజేస్తోంది. ఈ నివేదికల ఆధారంగా వైఎస్ జగన్.. వెనకంజలో ఉన్న నేతలను హెచ్చరించారు. ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జులతో ఆయన సమావేశాలు నిర్వహించారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సరిగా నిర్వహించనివారికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వబోనని ప్రకటించారు. సరిగా కార్యక్రమం నిర్వహించనివారి పేర్లను జగన్ పలుమార్లు చదివి వినిపించారు. ఇప్పటికైనా వారు ఆయా నియోజకవర్గాల్లో పర్యటించాలని.. పర్యటించకపోతే మాత్రం సీట్లు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో లండన్ నుంచి సెప్టెంబర్ 11న సీఎం జగన్ రాష్ట్రానికి రాగానే ఇక పార్టీ కార్యక్రమాల్లో వేగం పెంచుతారని చెబుతున్నారు. సరిగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించనివారిని, ప్రజల్లో వ్యతిరేకత ఉన్నవారిని పక్కనపెడతారని తెలుస్తోంది. వారి స్థానాల్లో కొత్త అభ్యర్థులను ప్రకటిస్తారని చెబుతున్నారు. ఇప్పటికే నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి స్థానాల్లో కొత్త అభ్యర్థులను జగన్ ప్రకటించారు.
అలాగే లండన్ నుంచి వచ్చాక ఐప్యాక్ బృందంతో సమావేశమై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నవారిని, బలహీనమైన అభ్యర్థులు ఉన్నచోట మారుస్తారని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జులతో మరోసారి సమావేశమవుతారని అంటున్నారు. సీట్లు ఖాయమైనవారిని పనిచేసుకోమని చెబుతారని తెలుస్తోంది. అలాగే సెప్టెంబర్ 15న మంత్రివర్గ సమావేశం, 20 నుంచి శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరుగుతాయని.. ఈ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారని టాక్ నడుస్తోంది.