చరిత్రలో తొలిసారి... "నా" అని పిలుచుకునే వారికి "న్యాయం" చేసిన జగన్!
అదే విషయాన్ని చేతల్లో కూడా చూపించడం అంత ఈజీ కాదు! అందుకు చాలా నిబద్ధత ఉండాలి! తాజాగా జగన్ చేసింది అదే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు!
By: Tupaki Desk | 16 March 2024 10:12 AM GMTరాజకీయాల్లో మాటలు చెప్పడం చాలా సులువు! పైగా ఎన్నికల వేళ హామీలు ఇవ్వడం, ఓటర్లను అందలం ఎక్కించేలా మాట్లాడటం మరీ సులువు! ఎన్నికలు అయిన తర్వాత ఆ హామీలను గాలికి వదిలేయడం, తోకలు కత్తిరిస్తాననడం ఇంకా సులువు! కానీ... మాటల్లో ఏమి చెబుతున్నామో.. ఎవరి కోసం తపనపడుతున్నామని అంటున్నామో.. అదే విషయాన్ని చేతల్లో కూడా చూపించడం అంత ఈజీ కాదు! అందుకు చాలా నిబద్ధత ఉండాలి! తాజాగా జగన్ చేసింది అదే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు!
అవును... తాజాగా ఇడుపులపాయలో, వైఎస్సార్ ఘాట్ వేదికగా, వైసీపీ అధినేత జగన్ సమక్షంలో.. ఎంపీ నందిగామ సురేష్.. ఎంపీ అభ్యర్థుల జాబితాను, మంత్రి ధర్మాన ప్రసాదరావు.. ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితానూ ప్రకటించారు. ఈ సందర్భంగా స్పందించిన సురేష్... తనకు ఎంపీ టిక్కెట్ ఇవ్వడం కంటే.. తన పక్కన కుర్చోబెట్టుకుని ఎంపీ అభ్యర్థుల జాబితాను చదివే అవకాశం కల్పించడమే ఇంకా ఆనందంగా ఉందని అన్నారు. బడుగు, బలహీనవర్గాల కోసం పుట్టిన వ్యక్తి జగన్ అని కొనియాడారు.
అనంతరం మైకందుకున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు.. ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను వెల్లడించారు. అంతకముందు... రాష్ట్ర చరిత్రలో ఎసీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50శాతం సీట్లు ఇవ్వడం ఇదే ప్రథమమని తెలిపారు. స్వాతంత్ర భారతదేశంలో మరే రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో.. ఉన్న 200 సీట్లలోనూ 100 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చిన ఘనత ఒక జగన్ కే దక్కుతుందని అన్నారు. ఈ సందర్భంగా తొలుత తన పేరు చదువుకుని, అనంతరం మిగిలిన జాబితాను వెళ్లడించారు. దీంతో ఈ సారి షెడ్యూల్ కు ముందే వైసీపీ జాబితా వెలువడించినట్లయ్యింది.
చేతల్లో సామాజిక న్యాయం:
తాజాగా ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల జాబితాలో... 25 సీట్లకు గాను ఎస్సీలకు 4, ఎస్టీలకు 1, బీసీలకు 11, ఓసీలకు 9 సీట్లను కేటాయించారు. అంటే... 2019లో ఎస్సీ (4), ఎస్టీ (1), బీసీ (7)లకు 12 సీట్లు కేటాయించిన జగన్... 2024కి వచ్చేసరికి వాటి సంఖ్యను 16 కు పెంచారన్నమాట. వీరిలో 5 గురు మహిళలు ఉన్నారు.
ఇదే క్రమంలో 2019లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 89 సీట్లు కేటాయించిన జగన్... 2024కి వచ్చేసరికి మరో 11 సీట్లు పెంచి మొత్తం 100 స్థానాలను కేటాయించారు. అదేవిధంగా... 2019లో మహిళలు 15 సీట్లు ఇవ్వగా.. 2024లో నాలుగు పెంచి 19 సీట్లు కేటాయించారు.
ఇక మైనారిటీల విషయానికొస్తే... 2019లో వారికి 5 స్థానాలు కేటాయించగా.. 2024కి వాటి సంఖ్య 7కి పెంచారు. ఇక 2019లో ప్రత్యేకంగా బీసీలకు 41 స్థానాలు కేటాయించిన వైసీపీ.. ఈసారి 48 సీట్లు కేటాయించింది. మొత్తంగా ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలైన 200 సీట్లలో ఎస్సీలకు 33, ఎస్టీలకు 8, బీసీలకు 59, ఓసీలకు 100 సీట్లు కేటాయించగా... వారిలో 14 ఎమ్మెల్యే టిక్కెట్లు కార్యకర్తలకు కేటాయించడం గమనార్హం.
మెజారిటీ అభ్యర్థులు ఉన్నత విద్యావంతులే!:
జగన్ కు మిగిలిన నాయకులతో వేరు చేసే విషయాల్లో విద్యకు, విద్యావంతులకు ఆయన ఇచ్చే ప్రధాన్యత కూడా ఒకటి! కేవలం విద్య ద్వారా మాత్రమే సమాజంలో మార్పు వస్తుందని, పేదరికం పోతుందని, బడుగు బలహీనవర్గాలు వివక్షకు దూరంగా ఉంటారని, వారి అభ్యున్నతికి విద్యయే ఏకైక మార్గం అని బలంగా నమ్మే వ్యక్తిగా జగన్ కి పేరుంది!
ప్రభుత్వ పాఠశాలల్లో జగన్ చేసిన మార్పులు, అక్కడ చదువుకునే విద్యార్థుల విషయంలో ఆయన చూపించిన శ్రద్ధ, ఆయనకున్న కమిట్మెంట్ ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ క్రమంలోనే తన పార్టీ నుంచి ప్రజాప్రతినిధులుగా పోటీచేసే అభ్యర్థులలో ఉన్నత విద్యావంతులకే పెద్దపీట వేశారు జగన్!
ఇందులో భాగంగా.. తాజాగా ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల్లో 88 శాతం, ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 77శాతం టిక్కెట్లు ఉన్నత విద్యావంతులకే కేటాయించడం గమనార్హం. ఇందులో మళ్లీ... ఎంపీ అభ్యర్థుల విషయానికొస్తే... 25 మందిలో 22 మంది డిగ్రీ, ఆపై చదువులు చదివినవారే కాగా... వారిలో 5గురు డాక్టర్లు, 4గురు లాయర్లు, ఒక సీఏ, ఒక మెడికల్ ప్రాక్టీషనర్ ఉన్నారు.
ఇక ఎమ్మెల్యే అభ్యర్థుల విషయానికొస్తే... 175 మందిలోనూ 131 మంది విద్యావంతులు ఉండగా... వారిలో 34 మంది ఇంజినీర్లు, 18 మంది డాక్టర్లు, 15మంది అడ్వకేట్లు, ఐదుగురు టీచర్లు, ఇద్దరు సివిల్ సర్వెంట్లు, రక్షణ శాఖ మాజీ ఉద్యోగి ఒకరు, జర్నలిస్టు ఒకరు ఉన్నారు. అంటే... సుమారు 77 శాతం మంది ఉన్నత విద్యావంతులకే సీట్లు కేటాయించారన్నమాట.
రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా సామాజిక న్యాయం!:
ఈ సందర్భంగా స్పందించిన జగన్... ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగని రీతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50శాతం స్థానాలు కల్పించినట్లు తెలిపారు. ఇదే సమయంలో సుమారు 99 స్థానాల్లో మార్పులు చేసినట్లు వెల్లడించారు. ఇది ధైర్యం వైసీపీ మాత్రమే చేయగలదని తెలిపారు. ఇక, టిక్కెట్ రానివారికి రాబోయే రోజుల్లో కచ్చితంగా సముచిత స్థానం ఇస్తానని జగన్ భరోసా ఇచ్చారు.
ఇదే క్రమంలో... ఈ ఐదేళ్లూ విప్లవాత్మక మార్పులతో పాలన అందించామని.. లంచానికి తావు లేకుండా సంక్షేమ ఫలాలు ప్రజలకు అందాయని.. సంక్షేమ పథకాల అమలు విషయంలో ఎక్కడా లంచాలు కానీ, ఎలాంటి వివక్షకు కానీ తావివ్వలేదని అన్నారు. మహిళా సాధికారత, సామాజిక న్యాయం చేతల్లో చూపించామని వెల్లడించారు. ఇదే సమయంలో.. రానున్న రోజుల్లో మరింతగా సామాజిక న్యాయం అందిస్తామని తెలిపారు!