Begin typing your search above and press return to search.

"న్యాయం జరగడమే కాదు.. జరిగినట్లు కనిపించాలి".. జగన్ ట్వీట్ వైరల్!

ఇటీవల వచ్చిన ఫలితాలపై వైసీపీ శ్రేణులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో... వైఎస్ జగన్ తన ఎక్స్ ఖాతాల్లో ఒక సంచలన పోస్ట్ చేశారు.

By:  Tupaki Desk   |   18 Jun 2024 4:57 AM GMT
న్యాయం జరగడమే కాదు.. జరిగినట్లు కనిపించాలి.. జగన్  ట్వీట్  వైరల్!
X

ఏపీలో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఈవీఎం లపై గతంలో ఎన్నడూ లేనిస్థాయిలో తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈవీఎం ట్యాపరింగ్, హ్యాకింగ్ మొదలైన విషయాలపై తీవ్ర చర్చ జరుగుతుంది. ఇటీవల వచ్చిన ఫలితాలపై వైసీపీ శ్రేణులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో... వైఎస్ జగన్ తన ఎక్స్ ఖాతాల్లో ఒక సంచలన పోస్ట్ చేశారు.

అవును... ఏపీలో ఇటీవల వచ్చిన ఎన్నికల ఫలితాలపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ స్థాయిలో ఫలితాలు రావడానికి ఈవీఎం లు ఒక కారణం అనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి. పలు చోట్ల పోలైన ఓట్లకు, లెక్కింపు ఓట్లకూ భారీ వ్యత్యాసం ఉందనే విషయాలు ఇటీవల సాక్ష్యాలతో సహా తెరపైకి వచ్చిన పరిస్థితి! అయినప్పటికీ ఎన్నికలు చాలా సజావుగా సాగాయంటూ సంబరాలకు సంబంధించిన వార్తలు తెరపైకి వచ్చాయని అంటున్నారు.

ఈ నేపథ్యంలో... "న్యాయం జరగడం మాత్రమే ముఖ్యం కాదు.. జరిగినట్లు కనిపించాలి కూడా! అదేవిధంగా... ప్రజాస్వామ్యం గెలవడంతోపాటు నిస్సందేహంగా గెలిచినట్లు కనిపించాలి. ప్రపంచం మొత్తంమీద ప్రజాస్వామ్యం కొనసాగుతున్న దాదాపు ప్రతీ దేశంలో ఎన్నికల ప్రక్రియ కోసం పేపర్ బ్యాలెట్లు వాడుతున్నారు. ఈవీఎంలు కాదు. ప్రజాస్వామ్యం అసలైన స్పూర్తిని కొనసాగించేందుకు మనం కూడా ఇదే దిశగా ముందుకు కదలాలి" అని ట్వీట్ చేశారు జగన్.

కాగా... 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం దేశంలో ఈవీఎంల ట్యాంపరింగ్, హ్యాకింగ్ లపై భారీ చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకోవాలంటే ఈవీఎంలపై నిషేధం అవసరమని ఎలాన్ మస్క్ స్వయంగా పేర్కొన్నారు. అయితే... మస్క్ వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. ఇందులో భాగంగా ఆ వ్యాఖ్యలను ఖండించారు.

అయితే... రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యలపైనా తిరిగి మస్క్ స్పందించారు. ఈ సందర్భంగా... "ఎనీథింగ్ కెన్ బీ హ్యాక్డ్" అని స్పందించడం గమనార్హం. ఇదే సమయంలో.. సీ-డాక్ వ్యవస్థాపకుడు శ్యాం పిట్రోడా సైతం ఈ చర్చలో పాల్గొంటూ ఈవీఎంల హ్యాకింగ్ సాధ్యమేనని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్.. ఈవీఎంలపై సంచలన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారింది.