Begin typing your search above and press return to search.

వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పబోతున్న జగన్...?

ఇక వాలంటీర్లకు గౌరవ వేతనాన్ని అయిదు వేల నుంచి పది వేల దాకా పెంచేందుకు వైసీపీ ప్రభుత్వం సుముఖంగా ఉందని అంటున్నారు

By:  Tupaki Desk   |   3 Aug 2023 3:11 PM GMT
వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పబోతున్న జగన్...?
X

వాలంటీర్లు ఇపుడు ఏపీలో అత్యంత కీలకంగా మారిపోయారు. వారి చుట్టూనే పాలిటిక్స్ సాగుతోంది. ఏపీలో వాలంటీర్లను అడ్డం పెట్టుకుని అధికార పార్టీ గెలవాలని చూస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే వాలంటీర్ల మీద తీవ్రమైన కామెంట్స్ చేశారు. వాలంటీర్లు ప్రతీ ఇంట్లోకి చేరి వ్యక్తిగత డేటా కలెక్ట్ చేస్తున్నారు అని ఆయన హాట్ కామెంట్స్ చేసారు.

అది కాస్తా అతి పెద్ద వివాదంగా మారడంతో పవన్ కళ్యాణ్ ఆ తరువాత మాట మార్చి అయిదు వేల జీతానికి వాలంటీర్లు పనిచేస్తున్నారు అని వారి చేత వెట్టి చాకిరి చేయించుకుంటున్నారు అని కూడా మండిపడ్డారు. ఇక వాలంటీర్లకు పది వేలు అయినా జీతం ఉండాలని విపక్షాలు అంటున్నాయి. ఇక విపక్షాలు తమ ఎన్నికల అజెండాలో వాలంటీర్ల గౌరవ వేతనం పెంచే ఆలోచనలో ఉన్నాయని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీ అయితే వాలంటీర్ల వ్యవస్థను తాము రద్దు చేయబోమని అదే విధంగా వారిని మొత్తం స్ట్రీం లైన్ చేసి సమాజ హితానికి వాడుకుంటామని చెప్పారు. ఇపుడు చూస్తే వైసీపీకి వాలంటీర్లు ఒక సైన్యంగా ఉన్నారని అంటున్నారు. అలాంటి వారిని వైసీపీ వదులుకునే సమస్య లేదు. పైగా వారి పట్ల విపక్షాలు చూపిస్తున్న ప్రేమ నిజమో కాదో తెలియదు అని వైసీపీ అంటున్నారు. దాంతో వాలంటీర్ల వ్యవస్థ సృష్టించిన జగనే వారికి పూర్తి న్యాయం చేస్తారు అని అంటున్నారు.

ఇక వాలంటీర్లకు గౌరవ వేతనాన్ని అయిదు వేల నుంచి పది వేల దాకా పెంచేందుకు వైసీపీ ప్రభుత్వం సుముఖంగా ఉందని అంటున్నారు. ఈ శుభ వార్త జగన్ పుట్టిన రోజు అయిన డిసెంబర్ 21న జగన్ స్వయంగా ప్రకటిస్తారు అని అంటున్నారు. ఆ విధంగా 2019లో ఆగస్టు 15న ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థను నాలుగేళ్ళ తరువాత జగనే మరింతగా ముందుకు తీసుకుని వెళ్తారని ఆ పార్టీ అంటోంది.

అలాగే వారికి గౌరవ వేతనం పది వేల రూపాయల దాకా చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది అన్న వార్త అయితే ఇపుడు చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే వాలంటీర్లకు ప్రతీ నెలా ఒకటవ తేదీకే క్రమం తప్పకుండా జీతం చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇక జీతం డబుల్ చేస్తే మాత్రం వాలంటీర్లు వైసీపీ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో రుణపడిపోతారని అంటున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు రెండున్నర లక్షల మంది దాకా పనిచేస్తున్నారు. వీరు గ్రామలో ప్రతీ యాభై మందికి ఒకరు వంతున అయితే పట్టణాలలో వందకు ఒకరు వంతున పనిచేస్తున్నారు. ప్రతీ సంక్షేమ పధకాన్ని ఇంటికి స్వయంగా తీసుకుని వెళ్లి అందిస్తున్నారు.

వాలంటీర్ల విషయంలో వస్తున్న రాజకీయ విమర్శలకు చెక్ పెట్టడంతో పాటు వారి జీవితాలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అదే విధనా వాలంటీర్లకు పెరిగిన జీతాలను 2024 జనవరి 1న చెల్లిస్తారు అని అంటున్నారు. సో రెండున్నర లక్షల మంది వాలంటీర్లు వారి ఫ్యామిలీ మెంబర్స్ అంటే పది లక్షల మంది దాకా వైసీపీకి అనుకూల ఓటు బ్యాంక్ రెడీ అయినట్లే అని అంటున్నారు.