Begin typing your search above and press return to search.

పాపం వైసీపీ ఎమ్మెల్యేలు : ఎమ్మెల్సీలకు ఓకే

వైసీపీ ఎమ్మెల్యేలు పాపం చేసుకున్నారా. అందుకే అయ్యో పాపం అనాల్సి వస్తోందా అంటే అవునేమో అనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   19 March 2025 8:35 AM IST
పాపం వైసీపీ ఎమ్మెల్యేలు : ఎమ్మెల్సీలకు ఓకే
X

వైసీపీ ఎమ్మెల్యేలు పాపం చేసుకున్నారా. అందుకే అయ్యో పాపం అనాల్సి వస్తోందా అంటే అవునేమో అనిపిస్తోంది. ఎందుకంటే రెండు లక్షలకు పైగా ఓటర్లు ఉండే చోట భారీ పోటీలో అది కూడా టీడీపీ కూటమి ప్రభంజనంలో ఎమ్మెల్యేలుగా గెలిచి వచ్చిన వారు వైసీపీ ఎమ్మెల్యేలు. ప్రత్యక్ష పోరాటంలో ప్రజా క్షేత్రంలో అన్ని ఎత్తులు జిత్తులను దాటుకుంటూ అసెంబ్లీలోకి రావడం అన్నది చిన్న విషయం కాదు.

అయితే ఇంతలా గెలిచినా ఇంతలా నిలిచినా అసెంబ్లీ గేటుని మాత్రమే తాకగలిగారు. లోపలికి పోలేకపోతున్నారు. దానికి కారణం వైసీపీ అధినేత జగన్ తీసుకున్న నిర్ణయం. వైసీపీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కాలని ఆయన పట్టుబడుతున్నారు. దాంతో అసెంబ్లీకి ఎమ్మెల్యేలు వెళ్ళకుండా బాయ్ కాట్ చేస్తున్నారు.

అధికార కూటమి ప్రభుత్వం రూల్స్ చెబుతోంది. అలా కాదు మాకు దక్కాల్సిందే అని వైసీపీ అంటోంది. ఇది తెగని పోరాటం. దాంతో ఎమ్మెల్యేలుగా గెలిచి కూడా సంతోషంగా వైసీపీ నేతలు ఉండలేకపోతున్నారు. అసెంబ్లీ సెషన్ అంటే వారికి బాయ్ కాట్ అన్న మాటే వినిపిస్తోంది.

అటు సభకు ఇటు జనానికి కూడా చెడి వారు అయోమయంలో గడుపుతున్నారు. అయితే వైసీపీ ఎమ్మెల్సీలకు మాత్రం ఫుల్ ఫ్రీడం ఉంది. వారు పెద్దల సభలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. ప్రతీ రోజూ సభకు హాజరవుతున్నారు ఆఖరుకు బడ్జెట్ సెషన్ చివరి రోజున ఫోటో సెషన్ కి కూడా హాజరయ్యారు ఆ మీదట ప్రజా ప్రతినిధులకు క్రీడా పోటీలు పెడితే అందులో కూడా వైసీపీ ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఆటపాటలతో సరదాగా గడిపారు.

కానీ ఎమ్మెల్యేల పరిస్థితే అలా అయిపోయింది అని అంటున్నారు. ఈ విధంగా వైసీపీ అధినాయకత్వం తాజా బడ్జెట్ సెషన్ లో విచిత్రమైన స్టాండ్ తీసుకుందని అంటున్నారు. ఎమ్మెల్యేలు బాయ్ కాట్ చేస్తే ఎమ్మెల్సీలు అటెండ్ అవుతున్నారు.

ఇక మూడు రోజుల పాటు విజయవాడ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగే క్రీడా పోటీలలో కూడా ఎమ్మెల్సీలు ఉత్సాహంగా వైసీపీ నుంచి పాల్గొన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు అయితే అన్నీ బాయ్ కాట్ చేస్తూ దూరంగా ఉండిపోయారు. మరి ఈ రకంగా దిగువ సభలో ఒకలా ఎగువ సభలో మరోలా వైసీపీ తీసుకున్న స్టాండ్ తో జనాలకు ఏ రకమైన సందేశం ఇస్తున్నట్లు అన్న చర్చ అయితే సాగుతోంది.