ఎన్టీఅర్ విజయవాడ జిల్లా ఎందుకు చేయరాదు ?
ఏపీలో రాజకీయాలు స్థానంలో పగలు ప్రతీకారాలూ పీక్స్ కి చేరుకున్నాయని చెప్పక తప్పదు.
By: Tupaki Desk | 19 March 2025 9:24 AM ISTఏపీలో రాజకీయాలు స్థానంలో పగలు ప్రతీకారాలూ పీక్స్ కి చేరుకున్నాయని చెప్పక తప్పదు. ఎవరు పవర్ లో ఉంటే ప్రత్యర్ధుల విషయంలో జోక్యం చేసుకోవడం సహజమైంది. టీడీపీ కాంగ్రెస్ ల మధ్య దశాబ్దాల రాజకీయ వైరం ఉన్నా అది అక్కడికే పరిమితం అయ్యేది.
కానీ వైసీపీ వర్సెస్ టీడీపీ అంటే రాజకీయాల్లో ప్రత్యర్థులుగా పోయి శత్రువులు వస్తున్నారని విమర్శలూ ఉన్నాయి. ఇదిలా ఉంటే వైఎస్సార్ పేరు మీద ఉన్న జిల్లాని వైఎస్సార్ కడపగా మార్చడం పట్ల చర్చ సాగుతోంది. ఇది మంచి నిర్ణయం అని కూటమి నేతలు అంటూంటే వైసీపీ మీద ద్వేషంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
ఇదిలా ఉంటే వైఎస్సార్ తనయ, ఏపీ పీసీసీ చీఫ్ అయిన వైఎస్ షర్మిల ఈ నిర్ణయం మీద ఫైర్ అయ్యారు. జగన్ మీద కోపంతో వైఎస్సార్ జిల్లా పేరుని మార్చారని చంద్రబాబు మీద ద్వజమెత్తారు. వైఎస్సార్ జిల్లా పేరుని ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఇపుడు ఆ అవసరం ఏమిటి అని ఆమె ప్రశ్నిస్తున్నారు.
జగన్ హయాంలో ఎన్టీఅర్ పేరుతో ఉన్న విశ్వవిద్యాలయాన్ని మార్చేశారు కాబట్టే బాబు ఈ నిర్ణయం ప్రతిగా తీసుకున్నట్లుగా అనిపిస్తోంది అని ఆమె అన్నారు. అలా ఒక నాయకుడి పేరు మీద జిల్లాలు ఉండకూడదు అన్నపుడు అన్నింటికీ అదే రూల్ వర్తింపచేయాలి కదా అని ఆమె ప్రశ్నించారు.
ఎన్టీఆర్ జిల్లా ఎందుకు దానికి కూడా ఎన్టీఅర్ విజయవాడ అనో ఎన్టీఅర్ క్రిష్ణా జిల్లా అనో పేరు తగిలించవచ్చు కదా అపుడు రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అన్నట్లుగా ఉంటుందని షర్మిల అంటున్నారు. ఇదే క్రిష్ణా జిల్లాలో ఉన్న వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీలో వైఎస్సార్ పేరుని ఎందుకు తీసేశారు అని ఆమె మండిపడ్డారు.
వైఎస్సార్ ఎన్నో సంక్షేమ పధకాలను అమలు చేసిన వారని, ఆయన ప్రజల గుండెలలో నిలిచిన నాయకుడని ఆమె అన్నారు. ఆయన ఒక పార్టీకి చెందిన వారు కానే కాదని ఆయన అందరి వారు అని ఆమె అన్నారు. దివంగత నాయకులతో రాజకీయాలు చేయడం తగదని ఆమె అన్నారు.
మొత్తానికి వైసీపీ నేతలు వైఎస్సార్ జిల్లా విషయంలో పెద్దగా రియాక్టు కాకపోయినా షర్మిల మాత్రం ఘాటుగా రియాక్టు అయ్యారని అంటున్నారు. ఇక పోతే నెటిజన్లు ఈ జిల్లాల పేర్ల మీద నాయకుల పేర్ల మీద తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకు నాయకుల పేర్లతో జిల్లాలు ఉండాలని అడిగే వారూ ఉన్నారు. ఇంకా గొప్ప వారు పుడతారు. అపుడు వారి పేర్లతో జిల్లాలు పెడతారా అలా చేసుకుంటూ పోతే ఏదో నాటికి ఆయా ప్రాంతాల విశిష్టత కానీ చరిత్ర కానీ తెలిసే అవకాశం ఉండదు కదా అని అంటున్నారు.
ఇకనైనా నాయకుల పేర్లను జిల్లాలకు కానీ ఇతర కీలక ప్రాంతాలకు కానీ పెట్టడం అన్నది తగ్గించాలని వీలైతే మానుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. వైఎస్సార్ కడప జిల్లా అన్నది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని దానిని అలాగే టీడీపీ కూటమి ఉంచుతూ సరిచేసిందని ఇందులో తప్పేముందని అన్న వారూ ఉన్నారు.