వైఎస్సార్ బతికి ఉంటే అదే జరిగేదా ?
ఉమ్మడి ఏపీని అత్యధికాలం పాలించిన సీఎంలలో ఆయనకు నాలుగో ప్లేస్ దక్కుతుంది.
By: Tupaki Desk | 14 Jan 2025 3:44 AM GMTవైఎస్సార్ విషయంలో చాలా చెప్పాల్సినవి ఉన్నాయి. ఆయన 2004 నుంచి 2009 సెప్టెంబర్ రెండవ తేదీ వరకూ ముఖ్యమంత్రిగా పనిచేసారు. ఆయన కరెక్ట్ గా చూస్తే అయిదుంపావు ఏళ్ళ పాటు సీఎం గా వ్యవహరించారు. ఉమ్మడి ఏపీని అత్యధికాలం పాలించిన సీఎంలలో ఆయనకు నాలుగో ప్లేస్ దక్కుతుంది.
ఇక వైఎస్సార్ ఏలుబడి ఒక స్వర్ణ యుగంగా చెబుతారు. ఆయన హయాంలో ఒక వైపు అభివృద్ధి మరో వైపు సంక్షేమం రెండూ పరుగులు పెట్టించారు అని అంటారు. అయితే దానికి కారణం ఆనాటి రాజకీయ ఆర్ధిక పరిస్థితులు అని చెప్పాలి. కేంద్రంలో కూడా యూపీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఉమ్మడి ఏపీ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఎంపీలు గెలిచి వెళ్లారు.
అలా కేంద్ర ప్రభుత్వంలో ఏపీ పాత్ర రాజకీయంగా బాగా పెరిగింది. దాంతో వైఎస్సార్ కేంద్రం నుంచి పెద్ద ఎత్తున ఆర్ధిక సహాయం పొందారు. అలా తాను అనుకున్న వాటిని ఏ ఇబ్బంది లేకుండా నెరవేర్చుకో గలిగారు అని అంటున్నారు. ఆయన చేతికి ఎముక లేదు అన్న మాట కూడా అలాగే వచ్చింది.
ఇక కేంద్ర ప్రభుత్వం ఆనాడు ఏ సీఎం కి ఇవ్వని విలువ గౌరవం వైఎస్సార్ ఇచ్చింది అని చెబుతారు. ఆయన మీద ఉమ్మడి ఏపీ భారం పూర్తి స్థాయిలో వదిలేసింది అంటారు. ఒక విధంగా ఆయన ఒక ప్రాంతీయ పార్టీ అధినేతగా వ్యవహరించారు. అంతలా ఆయన ఫ్రీ హ్యాండ్ తో పాలించారు అంటే దానికి కారణం ఆనాటి పరిస్థితులు అని చెప్పాలి.
అయితే అదే వైఎస్సార్ 2009లో మరణించడంతో దేవుడిగా ప్రజల గుండెలలో నిలిచిపోయారు. ఆయనలా ఆయన కుమారుడు జగన్ కూడా పాలన చేయలేదని ప్రజలు అనుకున్నారు. అంతవరకూ ఎందుకు జగన్ సొంత చెల్లెమ్మ కూడ జగన్ తన తండ్రిలా పాలించలేదని విమర్శలు గుప్పించారు.
అయితే వైఎస్సార్ పాలనలో జరిగినవి తరువాత జరగలేదు. అందుకే ఆయన ఒక గోల్డెన్ పీరియడ్ ని చూశారు అని అంటారు ఆయనతో అప్పట్లో అత్యంత సన్నిహితులుగా మెలిగిన వారు. ఇక వైఎస్సార్ విషయంలో ఈ రోజుకీ సగటు జనాలు అనుకునేది ఏంటి అంటే వైఎస్సార్ ఉంటే అనుకున్నవన్నీ జరిగేవి అని. నిజంగా అలా జరిగేవా అంటే ఏమో అది 2009 సెప్టెంబర్ దాకానే జరిగి ఆగింది. ఆ తరువాత కాంగ్రెస్ సీఎంలే ఇద్దరు పాలించినా కూడా అలాంటివి జరగలేదు.
ఎందువల్ల అంటే అప్పటికే పరిస్థితుల్లో మార్పులు వచ్చాయని అంటారు. ఇదే విషయాన్ని ఇటీవల మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా చెప్పారు. ఏపీ ప్రజలు ఈ రోజుకీ అనుకునేది ఒకటి ఉంది. అది వారి బలమైన నమ్మకం కూడా. అదేంటి అంటే వైఎస్సార్ జీవించి ఉంటే ఉమ్మడి ఏపీ రెండు ముక్కలు అయ్యేది కాదు అని. నిజంగా అలా జరుగుతుందా అంటే దానికి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినది చిత్రంగానే కాదు ఆసక్తిగా ఉంది.
వైఎస్సార్ జీవించి ఉన్నా ఉమ్మడి ఏపీ విభజనను ఆపలేరని కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలే చేసారు. 2009లోనే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ అత్యంత కీలకమైన డెసిషన్ ని తీసుకుందని ఏపీని రెండుగా చేయాలన్నది ఆ పార్టీ విధాన నిర్ణయమని తెలంగాణాను ఇవ్వాలని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని దానిని పూర్తి చేయడంలో కచ్చితంగా వ్యవహరిస్తుందని చెప్పేశారు.
అందువల్ల వైఎస్సార్ ఉన్నా ఎవరు ఉన్నా ఏపీ రెండుగా మరడం ఖాయమని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. మరి ఆయన అభిప్రాయాలతో ఏకీభవించే వారు ఎంత మంది అంటే అది ఎవరికి వారే ఆలోచించుకోవాలి. అయితే కొంతమంది విషయంలో ఆయన బతికి ఉంటేనా అన్నది ఎపుడూ చర్చగానే ఉంటుంది. అలాగే వైఎస్సార్ అంటే ఒక స్వర్ణ యుగం పాలన అన్నది మెజారిటీ జనం అంటారు. విభజన విషయంలో ఆయన అడ్డు పడతారు అని నమ్మే వారూ ఎక్కువగానే ఉంటారు అని అంటున్నారు.