వైఎస్సార్... ప్రాంతీయ పార్టీ ముచ్చట !
వైఎస్సార్ లోని నాయకత్వ లక్షణాలు అద్భుతంగా ఉండేవి. ఆయన ప్రజల నాడిని పసిగట్టి రాజకీయాలు చేసిన నేత
By: Tupaki Desk | 8 July 2024 3:42 AM GMTవైఎస్సార్ లోని నాయకత్వ లక్షణాలు అద్భుతంగా ఉండేవి. ఆయన ప్రజల నాడిని పసిగట్టి రాజకీయాలు చేసిన నేత. ఆయన గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ ని చూసి ఎదిగి వచ్చిన వారు. అందుకే ఆయనకు సాదర జనాల అభిమానమూ తెలుసు. వారి ఆదరణ కూడా తెలుసు. ప్రజలకు ఏమి చేస్తే వారు సంతోషంగా ఉంటారో బాగా తెలిసిన రాజకీయ వైద్యుడు వైఎస్సార్.
ఇదిలా ఉంటే వైఎస్సార్ కరడు కట్టిన కాంగ్రెస్ అభిమాని. ఆయన రాజకీయ జీవితం మొత్తం కాంగ్రెస్ లోనే సాగిపోయింది. అయితే వైఎస్సార్ కి కాంగ్రెస్ లో ఒకప్పుడు నిత్య అసమ్మతివాది అన్న పేరు ఉండేది. ఆయన 1983 నుంచి 1989 దాకా ఏకంగా ఏడేళ్ళ పాటు ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. తెలుగుదేశం హయాంలో 1985 నుంచి 1989 దాకా ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించారు.
అలా అసెంబ్లీ లోపలా బయటా ఎన్నో పోరాటాలు చేసిన వైఎస్సార్ కి ఆ సమయంలోనే ముఖ్యమంత్రి కావాలన్న కోరిక బలంగా కలిగింది. ప్రతిపక్ష నాయకుడు అంటే వెయింటింగ్ చీఫ్ మినిస్టర్ అని చెబుతారు. అలా ఆయన అనుకున్నా విధి మరోలా తలచింది. 1988 ప్రాంతంలో మర్రి చెన్నారెడ్డి పీసీసీ చీఫ్ కావడంతో రేసులో ఆయన ముందుకు వచ్చేశారు.
ఆ తరువాత 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని వైఎస్సార్ భావించినప్పటికీ కేంద్ర కాంగ్రెస్ పెద్దల ఆదేశానుసారం ఆయన ఎంపీగా కడప నుంచి తొలిసారి పోటీ చేయాల్సి వచ్చింది.
అది లగాయితూ ఆయన నాలుగు సార్లు కడప నుంచే ఎంపీగా పోటీ చేస్తూ వచ్చారు. ఆయన ఈ మధ్యలో ముఖ్యమంత్రి కావాలని చూసినా ఏ మాత్రం కుదరలేదు. ఆ సమయంలో అంటే 1989 నుంచి 1994 మధ్యలో ముగ్గురు కాంగ్రెస్ సీఎంలు మారారు. తొలిగా సీఎం గా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి ఏడాది పాటు పనిచేయగా. ఆయన తరువాత నేదురుమల్లి జనార్ధనరెడ్డి, ఆ తరువాత కోట్ల విజయభాస్కరరెడ్డి చెరి రెండేళ్ల పాటు సీఎంలుగా పనిచేశారు.
ఈ ముగ్గురు సీఎంల పాలనలో స్వపక్షంలోనే విపక్షం అన్నట్లుగా వైఎస్సార్ వ్యవహరించారు అని ప్రచారం సాగింది. ఆయన పార్టీ విధానాల మీద మాట్లాడినా అసమ్మతి ముద్ర వేశారు. అలా వైఎస్సార్ అంటే నిత్య అసమ్మతివాది అన్న పేరుని ప్రత్యర్ధులు పెట్టారు.
ఇక వైఎస్సార్ కాంగ్రెస్ లో తనకు సీఎం అయ్యే యోగం ఉండదని భావించి ఒక దశలో విసిగి వేసారి ప్రాంతీయ పార్టీ పెట్టాలని అనుకున్నారు అని ప్రచారం కూడా జరిగింది. ఆ పార్టీ పేరు రాజీవ్ కాంగ్రెస్ అని కూడా 90 దశకంలో ప్రచారం అయితే సాగింది. అవి రాజీవ్ గాంధీ మరణించిన రోజులు. దాంతో రాజీవ్ గాంధీ తరువాత తనకు పార్టీలో గాడ్ ఫాదర్ ఎవరూ లేరని భావించి వైఎస్సార్ అలా ఆలోచించారు అని అంటారు.
అయితే 1998 ప్రాంతంలో సోనియా గాంధీ కాంగ్రెస్ జాతీయ పగ్గాలు చేపట్టడంతో వైఎస్సార్ దశ తిరిగింది. ఆమెకు అత్యంత విశ్వాసపాత్రునిగా ఉన్న వైఎస్సార్ ని ఆమె ప్రోత్సహించడం జరిగింది. అలా మొదట పీసీసీ చీఫ్ ఆ తరువాత 1999 నుంచి 2004 మధ్యలో అసెంబ్లీలో విపక్ష నేతగా వైఎస్సార్ ఆరేళ్ల పాటు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం మీద సాగించిన పోరాటం ఫలితంగా 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అలా తన సీఎం కోరికను వైఎస్సార్ చివరికి నెరవేర్చుకున్నారు. ఆయన మొత్తం అయిదుంపావు ఏళ్ళ పాటు ఉమ్మడి ఏపీకి సీఎం గా పనిచేశారు.