Begin typing your search above and press return to search.

అదే జ‌రిగితే.. వైసీపీ 'పేటెంట్' పోయిన‌ట్టే.. !

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుంద‌న్న‌ది ఎవ‌రూ చెప్ప‌లేరు. అయితే.. విధాన‌ప‌రంగా మాత్రం.. పార్టీ లు జాగ్ర‌త్త‌గా అడుగులు వేయాలి.

By:  Tupaki Desk   |   6 March 2025 8:00 PM IST
అదే జ‌రిగితే.. వైసీపీ పేటెంట్ పోయిన‌ట్టే.. !
X

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుంద‌న్న‌ది ఎవ‌రూ చెప్ప‌లేరు. అయితే.. విధాన‌ప‌రంగా మాత్రం.. పార్టీ లు జాగ్ర‌త్త‌గా అడుగులు వేయాలి. లేక‌పోతే.. ఇబ్బందులు త‌ప్ప‌వు అని చెప్ప‌డానికి ప్ర‌బ‌ల ఉదాహ‌ర‌ణ వైసీపీనే. `మాట‌త‌ప్ప‌ను - మ‌డ‌మ తిప్ప‌ను` అనే వైసీపీకి ఉన్న పేటెంట్ హ‌క్కుగా చెబుతారు. ఆ పార్టీ నాయ‌కులు త‌రచుగా ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తారు. మా నాయ‌కుడు మాట‌త‌ప్ప‌డు-మ‌డ‌మ తిప్ప‌డ‌ని కూడా వ్యాఖ్యానించిన సంద‌ర్భాలు ఉన్నాయి.

అయితే.. ఇలాంటి వ్యాఖ్య‌లు, స్టేట్‌మెంట్లు ఇచ్చే స‌య‌మంలోనే కొంత ఆరామ్‌గా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. కానీ, ఇలాంటి విష‌యాల్లో వైసీపీ చేస్తున్న పొర‌పాట్ల‌తో పేటెంట్ ప‌రువు పోతోంది. గ‌తంలో అధికారంలో ఉన్నప్పుడు.. సీపీఎస్ ర‌ద్దు వ్య‌వ‌హారం చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ ఇచ్చిన హామీతో సీపీఎస్ ర‌ద్ద‌వుతుంద‌ని ఉద్యోగులు భావించారు. కానీ, త‌ర్వాత‌.. అధికారం పూర్త‌య్యే వ‌ర‌కు కూడా ఈ హామీని నెర‌వేర్చ‌లేకపోయారు.

దీనిపై అప్ప‌ట్లో స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణ‌రెడ్డి.. జ‌గ‌న్‌కు తెలియ‌క‌.. హామీ ఇచ్చార‌ని, ఇది పెద్ద భారం గా ప‌రిణ‌మిస్తుంద‌ని అందుకే.. సీపీఎస్ స్థానంలో జీపీఎస్ తీసుకువ‌చ్చామ‌ని వివ‌రించారు. దీంతో జ‌గ‌న్ `మాట‌త‌ప్ప‌డు` అనే మాట కొట్టుకుపోయింది. క‌ట్ చేస్తే.. ఇప్పుడు కూడా ఇదే పంథాలో వైసీపీ ముందుకు సాగుతోంది. అధికారం కోల్పోయిన‌ప్ప‌టికీ.. వైసీపీకి ఉండే ప్రాధాన్యం వైసీపీకి ఉంది. దీంతో వైసీపీ చేసే ప్ర‌క‌ట‌న‌లు, ఆ పార్టీ విధానాలు చ‌ర్చ‌కు వ‌స్తూనే ఉన్నాయి.

తాజాగా ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై వైసీపీ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంద‌న్న చ‌ర్చ అయితే.. జోరుగా సాగుతోంది. ఇటీవ‌ల శాస‌న మండ‌లిలో వైసీపీ స‌భ్యుడు మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ.. మూడు రాజ‌ధానులు అనేది అప్ప‌ట్లో త‌మ విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌య‌మ‌న్నారు. అప్ప‌టికి అమ‌రావ‌తి లేదు కాబ‌ట్టి.. అలా ప్ర‌క‌టించామ‌ని చెప్పారు. త్వ‌ర‌లోనే త‌మ విధానం ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పారు. అయితే.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అనేది ఆస‌క్తిక‌రం.

రాజ‌ధానిగా అమ‌రావ‌తినే గుర్తిస్తామ‌ని ప్ర‌క‌టిస్తే.. అప్ప‌టి వ‌ర‌కు చెప్పిన మూడు రాజ‌ధానుల వ్య‌వ‌హారం హుళ‌క్కే అవుతుంది. అలాకాకుండా.. మూడు రాజ‌ధానుల‌కే క‌ట్టుబ‌డ్డామ‌ని అంటారా? ఒక‌వైపు అమ‌రావ‌తి ప‌రుగులు పెడుతున్న నేప‌థ్యంలో మ‌ళ్లీ మూడు రాజ‌ధానుల వ్య‌వ‌హారం తెస్తే.. మ‌రింత మోస‌మేన‌న్న వాద‌న కూడా ఉంటుంది. సో.. ఎలా చూసుకున్నా.. ఈ వివాదంతో వైసీపీకి ఉన్న పేటెంట్ హ‌క్కుపోయేలా ఉంద‌న్న చ‌ర్చ ఉంది.