అంబటిని అలా దించేశారా ?
వైసీపీలో పెద్ద నోరు కలిగిన నేతగా అంబటి రాంబాబుని చూడాలి.
By: Tupaki Desk | 5 Oct 2024 3:55 AM GMTవైసీపీలో పెద్ద నోరు కలిగిన నేతగా అంబటి రాంబాబుని చూడాలి. ఆయన ఒక ఫైర్ బ్రాండ్. ఆయన మీడియా ముందుకు వస్తే తనదైన బాడీ లాంగ్వేజ్ తో తన మాటకారితనంతో ప్రత్యర్ధులను చెడుగుడు ఆడుకుంటారు. అంబటి దూకుడు తత్వమే ఆయన్ని ఇంతదాకా తీసుకుని వచ్చింది.
ఎపుడో మూడున్నర దశాబ్దల ముందు రాజకీయ అరంగేట్రం చెసిన అంబటికి 2022లో మంత్రి కాగలిగారు. ఇక ఆయన అనేక ఎన్నికల్లో పోటీ చేసినా రెండు సార్లు మాత్రమే గెలిచారు. అయితే అంబటిని రాజకీయంగా ఇప్పటిదాకా నిలబెట్టినవి ఆయన నోటి ధాటి, వెనక బలమైన సామాజిక వర్గం. దాంతో పాటు విధేయత.
వైఎస్సార్ కుటుంబాన్ని నమ్ముకుని రాజకీయం చేస్తూ వచ్చిన ఆయన జగన్ కి వెన్ను దన్నుగా ఉంటూ వస్తున్నారు. జగన్ సైతం ఆయనకు తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే రాష్ట్ర స్థాయి నేతగా ఉన్న అంబటిని ఒక్కసారిగా వైసీపీ హై కమాండ్ దించేసిందా అన్న చర్చ సాగుతోంది
అంబటి అంటేనే ఏపీ పాలిటిక్స్ లో హాట్ కామెంట్స్ కి పెట్టింది పేరు. అటువంటి ఆయనను రాష్ట్ర స్థాయిలో ఉపయోగించుకుంటే మేలు కదా అని అంటున్నారు. ఆయనకు రాష్ట్ర అధికార ప్రతినిధిగా పదవి ఇస్తే టీడీపీ కూటమి మీద పెద్ద ఎత్తున విరుచుకుని పడే వారు అని అంటున్నారు.
అయితే ఆయన సేవలను కేవలం ఒక జిల్లాకు ఎందుకు పరిమితం చేశారు అన్నది వైసీపీ లోపలా బయటా హాట్ డిస్కషన్ సాగుతోంది. వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా అంబటి రాంబాబుని ఇటీవల జగన్ నియమించారు. అలా అంబటిని తగ్గించేశారు అని అంటున్న వారూ ఉన్నారు
అయితే కోస్తాలో బలమైన ఒక సామాజిక వర్గంతో ఆయనకు ఉన్న బంధాలు అందరినీ కలుపుకుని పోయే పెద్దరికం ఉండడం వల్లనే ఆయనకు ఏరి కోరి తెచ్చి ఆ పదవిలో పెట్టారని అంటున్నారు. ఇవే ప్రశ్నలు అంబటి రాంబాబు ముందు వచ్చినా ఆయన పార్టీ కోసం తనను ఎంచుకున్నారని చెబుతున్నారుట.
పార్టీ ఇపుడు కష్టాలలో ఉంది. అధినాయకత్వం చెప్పిన మేరకు ఒక సైనికుడిగా ఇచ్చిన బాధ్యతలను చేస్తాను అని అంటున్నారుట. ఇదిలా ఉంటే పార్టీని మళ్లీ గెలిపించాలని పటిష్టం చేయాలని అంబటి అధ్యక్షుడిగా శ్రేణులకు పిలుపు ఇస్తున్నారు. ఆయన అపుడే రంగంలోకి దిగిపోయారు.
మరో వైపు చూస్తే ఆరున్నర పదుల వయసులో ఉన్న అంబటికి 2024 ఎన్నికలే చివరివి అని అంటున్నారు. ఆయన మళ్లీ 2029లో పోటీ చేసే ఉద్దేశ్యంలో లేరు అని అంటున్నారు. పార్టీ 2029లో గెలిస్తే చాలు అని అనుకుంటున్నారుట. సరిగ్గా ఇక్కడే పేర్ని నాని కూడా గుర్తుకు వస్తున్నారు. ఆయన కూడా ఎన్నికల రాజకీయాలకు 2024లోనే గుడ్ బై కొట్టేసి తన కుమారుడుని రాజకీయ వారసుడిగా ముందుకు తెచ్చారు.
అంబటి విషయం తీసుకుంటే పార్టీ మళ్ళీ గెలిస్తే ఏదినా నామినేటెడ్ పదవిలో కుదురుకుంటారు అని అంటున్నారు. ఏది ఏమైనా అంబటిని దించేశారు అని అంటున్న వారికి మాత్రం ఆయన వర్గం నుంచి వస్తున్న జవాబు పార్టీ కోసం ఎందాకైనా మేము అని వస్తోందిట.
వచ్చే ఎన్నికల్లో గుంటూరు జిల్లాలోని ఏడు అసెంబ్లీ సీట్లలో పార్టీని గెలిపించడమే లక్ష్యంగా అంబటి యాక్షన్ ప్లాన్ ని రూపొందిస్తున్నారు అని అంటున్నారు. సో అంబటి వంటి వారికి ప్రమోషన్లు డిమోషన్లు ఏమీ ఉండవని ఆయన అన్నిటికీ అతీతుడని ఆయన అనుచరులు చెబుతున్నారు.