Begin typing your search above and press return to search.

వైసీపీ కీలకమైన రోజు నిరసనకే అంకితం !

ఆ పార్టీకి 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లు మాత్రమే దక్కాయి. దాంతో వైసీపీ మొత్తంగా డీలా పడిపోయింది.

By:  Tupaki Desk   |   10 March 2025 9:00 PM IST
వైసీపీ కీలకమైన రోజు నిరసనకే అంకితం !
X

వైసీపీ పుట్టిన రోజు అయిన మార్చి 12న ఆ పార్టీ నిరసలనకు పిలుపు ఇచ్చింది. ఏపీలో ఫీజ్ రీయింబర్స్ మెంట్ విద్యార్థులకు ఇవ్వడం లేదని యువతకు నిరుద్యోగ భృతి అందలేదని, ఉద్యోగాల కల్పనలో మోసం జరిగిందని చెబుతూ యువత పోరు పేరుతో ఈ నెల 12న వైసీపీ భారీ కార్యక్రమానికి పిలుపు ఇచ్చింది.

అయితే మార్చి 12వ తేదీతో వైసీపీకి ఎంతో అనుబంధం ఉంది. 2011 మార్చి 12న వైసీపీ ఏర్పాటు అయింది. ఆనాడు ఒక గర్జనగా ప్రారంభం అయిన వైసీపీ 2024 ఎన్నికల వరకూ ఎదుగుదలనే చూసింది. అకాశం అంత ఎత్తుగా ఎదిగిన వైసీపీ ఒక్కసారిగా పాతాళం అంచులను చూసింది.

ఆ పార్టీకి 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లు మాత్రమే దక్కాయి. దాంతో వైసీపీ మొత్తంగా డీలా పడిపోయింది. ఎంతలా అంటే ఆఖరుకు అధ్యక్షుడు అయిన జగన్ తో సహా అంతా కొన్ని నెలల పాటు అలాగే ఉండిపోయారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే కనుక వైసీపీ మళ్ళీ జనంలోకి రావాలి అన్నా క్యాడర్ కి నైతిక స్థైర్యం ఇవ్వాలన్నా కూడా పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహించాలి.

ముందు పార్టీ బాగుంటే ఆ మీదట ప్రజల మద్దతు కూడగట్టవచ్చు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి వెనక కారణాలు అనేక ఉన్నా ముఖ్యమైనవి పార్టీ క్యాడర్ సైతం నిరుత్సాహంగా ఉండడమే. ఆ సంగతిని వైసీపీ అధినాయకత్వం గ్రహించింది. కానీ వారిని పార్టీ వైపుగా తీసుకుని వచ్చి పునరుత్తేజం కలిగించడానికి మాత్రం తగిన కార్యక్రమాలు ప్రయత్నాలు చేయడం లేదు అని అంటున్నారు.

ఇదిలా ఉంటే వైసీపీ ఆవిర్భావ దినోత్సవం నుంచి అయినా ఫ్యాన్ గిర్రున తిరగాలని కోరుకుంటోంది. మరి అలా జరగాలీ అంటే వైసీపీ ఆవిర్భావం దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి కదా అని అంటున్నారు. వైసీపీ 2011లో పుడితే దాని కంటే మూడేళ్ల తరువాత అదే మార్చి 14న జనసేన పుట్టింది. అయితే జనసేన ప్రతీ ఏడాది ఠంచనుగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. దాని వల్లనే క్యాడర్ లో కొత్త జోష్ కనిపిస్తోంది.

అంతే కాదు జనసేన సభ్యత్వ నమోదు చేపట్టింది. బూత్ లెవెల్ వరకూ పార్టీని విస్తరిస్తోంది. మరి వైసీపీ సీనియర్ పార్టీగా అయి ఉండి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించకపోవడం పట్ల చర్చ సాగుతోంది. అధికారంలో ఉన్నపుడు సంగతి వేరు కానీ ఇపుడు పార్టీయే అన్నీ అని తెలుసుకోవాలి కదా అంటున్నారు.

వైసీపీ అధినేత హోదాలో జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించి క్యాడర్ కి దిశా నిర్దేశం చేస్తే ఆ కిక్కు వేరుగా ఉంటుంది అని అంటున్నారు. కానీ వైసీపీ అయితే ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించడం లేదు. పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం క్యాడర్ కి పిలుపు ఇచ్చారు. ఊరూ వాడా వైసీపీ ఆవిర్భాన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని కోరారు.

మరి రాష్ట్రస్థాయిలో పార్టీ పట్టించుకుని పార్టీ నేతలను అందరినీ ఒక చోట చేర్చి క్యాడర్ ని దగ్గరకు రప్పించి నిర్వహిస్తే పార్టీ పండుగ అవుతుంది అని అంటున్నారు. ఎవరికి వారుగా చేసుకోమ్మంటే మొక్కుబడి తంతు అవుతుంది కానీ అందులో స్పూర్తి ఏమి ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా దారుణంగా ఓటమిని అందుకున్న తరువాత వచ్చిన వైసీపీ తొలి ఆవిర్భావ దినోత్సవాన్ని నిరసనలకే అంకితం ఇస్తున్నారు అని అంటున్నారు. ఈ నిరసనలతో కూటమి ప్రభుత్వాన్ని కదిలించాలని చూస్తున్నారు.