వైసీపీ ట్రంప్ కార్డు... గట్టిగానే టార్గెట్ !
రాజకీయాల్లో ఒక బలమైన సామాజిక వర్గం ఎపుడూ కీలకమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది.
By: Tupaki Desk | 14 Feb 2025 3:44 AMరాజకీయాల్లో ఒక బలమైన సామాజిక వర్గం ఎపుడూ కీలకమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. కాపులు ఏపీ రాజకీయాలను మలుపు తిప్పుతూ ఉంటారు. కాపులు మొదటి నుంచి కాంగ్రెస్ ని అట్టిపెట్టుకుని రాజకీయం చేస్తూ వచ్చారు. ఎపుడైతే టీడీపీ ఆవిర్భావం జరిగిందో నాటి నుంచి కాపులు రాజకీయంగా ఆప్షన్లు తీసుకుంటున్నారు.
ఒక ఎన్నికలో కాంగ్రెస్ ని సమర్ధిస్తే మరో ఎన్నికలో టీడీపీని గెలిపిస్తూ రావడం ఉమ్మడి ఏపీలో ఒక ఆనవాయితీగా మారింది. 1983, 1985లలో టీడీపీకి గట్టి మద్దతుగా నిలిచిన కాపులు 1989 నాటికి కాంగ్రెస్ వైపు నిలిచారు. దానికి కారణం 1988లో ప్రముఖ కాపు నాయకుడు వంగవీటి మోహనరంగా దారుణ హత్యకు గురి కావడం. దాంతో కాంగ్రెస్ ని గెలిపించి తమ రాజకీయాన్ని అలా చూపించారు.
ఇక 1994 నాటికి పరిస్థితి మళ్ళీ మారింది. టీడీపీని కాపులు తమ చాయిస్ గా ఎంచుకున్నారు. దాంతో చరిత్రలోనే అత్యధిక సీట్లు ఆనాటికి టీడీపీకి దక్కాయి. ఇక 1999లో చూస్తే టీడీపీకే జై కొట్టిన కాపులు 2004లో వైఎస్సార్ నాయకత్వంలోని కాంగ్రెస్ ని గద్దెనెక్కించారు. 2009లో కొత్త పార్టీ ప్రజారాజ్యం వైపు వారు మళ్ళారు. దాంతో 18 స్థానాలు ఆ పార్టీకి దక్కి కీలకమైన పక్షంగా అవతరించింది.
విభజన తరువాత ఏపీ బాగు కోసం టీడీపీని కాపులు ఎంచుకున్నారు. దాని వెనక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతు కూడా ఒక కారణంగా ఉంది. ఇక 2019లో జనసేన ఒంటరిగా పోటీ చేసినా కాపులు వైసీపీ వెంట నడచారు. కాపుల రిజర్వేషన్ విషయంలో టీడీపీ మాట తప్పింది అన్న ఆగ్రహం వారికి అలా నడిపించింది. 2024 ఎన్నికల్లో మళ్ళీ కాపులంతా గుత్తమొత్తంగా టీడీపీ కూటమికి జై కొట్టారు.
టీడీపీ కూటమిలో జనసేన కీలక పాత్ర పోషించడంతో గోదావరి జిల్లాలలో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. అంతే కాదు కోస్తాలో అనేక జిల్లాలలోనూ ఎన్నడూ లేని విధంగా కూటమి బంపర్ విక్టరీ కొట్టింది అంటే దాని వెనక కాపులు ఉన్నారని విశ్లేషిస్తున్నారు.
ఈ సామాజిక సమీకరణల మధ్య వైసీపీ దారుణంగా దెబ్బ తింది. అయితే ఎందుకు ఓటమి చెందామో ఆ పార్టీ సమీక్షించుకుంటోంది. ఈ నేపధ్యంలో ఉత్తరాంధ్రా గోదావరి జిల్లాలలో పట్టు కోసం కాపు కార్డుని ఆ పార్టీ బయటకు తీస్తోంది అని అంటున్నారు. పార్టీ పదవులలలో కాపులకు పెద్ద పీట వేయడం ద్వారా తిరిగి వారి మన్నన చూరగొనాలని వైసీపీ హైకమాండ్ ఆలోచన చేస్తోంది.
ఇదిలా ఉంటే ఉత్తరాంధ్రా జిల్లాలలో పదవులు అన్నీ కాపులకే కేటాయించడం విశేషం. రీజనల్ కో ఆర్డినేటర్ గా మాజీ మంత్రి కన్నబాబుని నియమించడం జరిగింది. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన వారు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగే బొత్స సత్యనారాయణకు స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అవకాశం ఇచ్చి శాసన మండలి చైర్మన్ గా కేబినెట్ ర్యాంక్ హోదాను కట్టబెట్టింది వైసీపీ. పైగా బొత్సకు గోదావరి జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ పదవిని కూడా ఇచ్చారు.
విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కాపు సామాజిక వర్గానికే చెందిన గుడివాడ అమర్నాధ్ ని నియమించారు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జిగా మరో కాపు నాయకుడు మాజీ ఎమ్మెల్యే అయిన కరణం ధర్మశ్రీని నియమించారు. కాకినాడ జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ గా మాజీ మంత్రి దాడిశెట్టి రాజాను నియమించడమూ కాపులను మచ్చిక చేసుకోవడంలో భాగమే అని అంటున్నారు.
ఇప్పటికే కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభాన్ని వైసీపీలోకి తెచ్చిన అధినాయకత్వం సరైన సమయం చూసి కాపుల తరఫున ఆయన గొంతు విప్పేలా చేస్తుందని అంటున్నారు. ప్రతీ ఎన్నికల్లోనూ ఒక్కో పార్టీని ఎంచుకుంటూ వస్తున్న కాపులు తమ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చే వారి వైపే మొగ్గు చూపుతున్నారు. వైసీపీ తన విధానాలను కాపులకు అనుకూలంగా చేసుకునే ప్రయత్నాలు కనుక ముందుకు సాగితే 2029లో బలమైన సామాజిక వర్గం కాపు కాస్తుందా అన్నదే ఒక ఆసక్తికరమైన విశ్లేషణ.