ఓవర్ టు ఉత్తరాంధ్ర.. ఆ ఇద్దరిపై గురి?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ కేసుల్లో వైసీపీ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 7 April 2025 4:30 PMకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ కేసుల్లో వైసీపీ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సోషల్ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించిన వారిని ఉక్కుపాదంతో అణచివేస్తున్నట్లు ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ నేత పోసాని క్రిష్ణమురళి, వైసీపీ సానుభూతిపరుడు డోరుగడ్డ అనిల్ తోపాటు వైసీపీకి చెందిన పలువురు కార్యకర్తలను అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ మంత్రులు పేర్ని నాని, జోగి రమేశ్, కొడాలి నానిపైనా వివిధ కేసులు నమోదు చేశారు. వల్లభనేనిని ఇప్పటికే అరెస్టు చేయగా, మిగిలిన నేతలు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు.
అయితే ప్రస్తుతం అరెస్టు అయిన వారు, బెయిల్ తెచ్చుకున్నవారంతా ఉమ్మడి క్రిష్ణ, గుంటూరు జిల్లాల వారు కాగా, ప్రభుత్వం ఇప్పుడు రూటు మార్చినట్లు ప్రచారం జరగుతోంది. ఈ రెండు జిల్లాల్లో సక్సెస్ ఫుల్ గా రాజకీయ వ్యూహం అమలు చేసిన ప్రభుత్వం ఇకపై ఉత్తరాంధ్రపై ఫోకస్ చేయాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. దీంతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు, సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు టార్గెటుగా పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. తాను పొరపాటున నోరెత్తితే అరెస్టు చేసి లోపలేస్తారంటూ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు భయపడుతుండగా, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై నోరుపారేసేకున్నారని ఎమ్మెల్సీ దువ్వాడపై ఇటీవల వరకు కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ ఇద్దరిపై ప్రభుత్వం ఫోకస్ పెంచినట్లు చెబుతున్నారు.
ఇప్పటివరకు అరెస్టులు, కేసులతో సెంట్రల్ ఆంధ్రాలో దుమారం రేగింది. ఈ ప్రాంతంలో కూటమి కార్యకర్తలు కూడా కాస్త చల్లబడ్డారంటున్నారు. ఇదే సమయంలో తమ ప్రాంతంలో వైసీపీ నేతలపై ఫోకస్ చేయాలని ఉత్తరాంధ్ర నేతలు ఒత్తిడి చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రధానంగా సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడుకి రాజకీయ ప్రత్యర్థిగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు. గత ప్రభుత్వంలో అచ్చెన్నను అరెస్టు చేయిండమే కాకుండా, స్థానిక ఎన్నికల్లో అచ్చెన్న సొంత గ్రామం నిమ్మాడలో దువ్వాడ దూకుడు చూపించారు. అప్పటి నుంచి సమయం కోసం ఎదురుచూస్తున్న కింజరాపు కుటుంబం దువ్వాడపై చర్యలకు పట్టు బడుతున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం కుటుంబ వివాదంలో చిక్కుకున్న దువ్వాడను అదుపులోకి తీసుకుంటే స్థానికంగా సానుభూతి కూడా వచ్చే అవకాశం లేదని మంత్రి అచ్చెన్నాయుడు ప్రభుత్వానికి సూచిస్తున్నట్లు చెబుతున్నారు.
అదేవిధంగా మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు అరెస్టు కోసం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నట్లు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అప్పలరాజు ప్రస్తుత ఎమ్మెల్యే శిరీష టార్గెట్ గా రాజకీయ వేధింపులకు దిగినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా గతంలో శిరీషను దుర్భాషలాడిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని ఆమె స్వయంగా విశాఖలో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రిపై ప్రస్తుతానికి మూడు కేసులు ఉన్నట్లు చెబుతున్నారు. ఉత్తరాంధ్ర వైసీపీ నేతల్లో ఈ ఇద్దరు తీరే వివాదాస్పదంగా ఉండటంతో వీలైనంత తొందరగా వీరిపై నమోదైన కేసులను క్లోజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.