Begin typing your search above and press return to search.

అమరావతిలో వాటర్ రాలేదా... పచ్చ మీడియా మిత్రులారా ?

అమరావతి మునిగిపోయింది అని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో టీడీపీ పెద్దలు తెగ బాధపడుతున్నారు.

By:  Tupaki Desk   |   4 Sep 2024 4:30 PM GMT
అమరావతిలో వాటర్ రాలేదా... పచ్చ మీడియా మిత్రులారా ?
X

అమరావతి మునిగిపోయింది అని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో టీడీపీ పెద్దలు తెగ బాధపడుతున్నారు. లబలబలాడుతున్నారు. నిజానికి టీడీపీ నాయకుల కంటే కూడా ఆ పార్టీని భుజాలకెత్తుకొని మోసే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అయితే ఇంకా ఎక్కువగా బాధపడుతోంది. అమరావతి మునిగింది అని చెబుతారా అని అంటూ ఏకంగా డిబేట్ లు పెట్టి విమర్శలు చేస్తున్నారు.

అమరావతి నేల మీదనే కదా ఉంది. వరద వచ్చినపుడు అమరావతి మునగకుండా ఎలా ఉంటుంది. అక్కడ భవనాలు కూడా ఏవీ పెద్దగా లేవు కదా, అంతా ఖాళీ భూములే కదా. భారీ వర్షాలు జోరున కురిసిన నేపధ్యంలో అమరావతి మునగడంలో ఆశ్చర్యం ఏమి ఉంది. ఆ మాటకు వస్తే హైదరాబాద్ నాలుగు వందల ఏళ్ల నగరం కూడా ఎన్నో సార్లు మునిగింది. మరి అక్కడ ఎవరూ నోచుకోలేదే.

ఇంకా అమరావతి రాజధాని అన్నది ఒక రూపూ షేపూ రాకుండానే మునిగింది అంటే ఎందుకు బాధ అన్నదే మేధావుల నుంచి నెటిజన్ల నుంచి వస్తున్న పెద్ద ప్రశ్న. ఇక పచ్చ మీడియాగా పేరు పొందిన వారు తమ టీవీ డిబేట్లలో ఇదే అంశాన్ని పెట్టి మరీ చర్చకు తెర తీస్తున్నారు. అమరావతిలోకి నీరు రాలేదు అని వారు తాము చూసిన కళ్లతో చెబుతున్నారు.

నిజానికి అమరావతి ఏమిటి ఏదైనా మునిగేలా భారీ ఎత్తున వరదలు వచ్చిపడ్డాయి. టీడీపీ ప్రభుత్వమే చెబుతున్నట్టుగా గత యాభై ఏళ్లలో ఎరగని వానలు వరదలు అని అంటున్నారు. అలాంటప్పుడు విజయవాడ గుంటూరు మునిగినాక అమరావతి కూడా మునగకుండా ఎలా ఉంటుంది అన్నది లాజిక్ తో కూడిన ప్రశ్నగా ఉంది. ఇక పోతే అమరావతి రాజధాని పరిధిలోకి వచ్చే అన్ని విద్యా సంస్థలు వ్యాపార సంస్థలు కాలేజీలకు వరదలు వానల పేరుతో ఎందుకు సెలవులు ఇచ్చారు అని కూడా నెటిజన్ల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి.

అమరావతిలో వరదలు వచ్చాయి. అయితే వైసీపీ ఫాలోవర్స్ వాటిని సోషల్ మీడియాలో కాస్తా ఎక్కువ చూపించే ప్రయత్నం చేయవచ్చు కానీ అసలు వానలే లేవని వరదలే రాలేదని చెప్పడం ఎంతవరకూ కరెక్ట్ అని అంటున్నారు. అమరావతిలోకి చుక్క నీరు కూడా రాలేదు అంటూ కళ్లకు గంతలు కట్టుకుని మరీ పచ్చ మీడియా మిత్రులు తన చానళ్ళలో డిబేట్లు పెడితే ఎలా అన్నదే ఇక్కడ ప్రశ్న.

అమరావతిలో ఏ స్థాయిలో నీరు వచ్చింది. ఏ స్థాయిలో నీరు వస్తే మునిగింది అని అంటారు అసలు అమరావతికి వరద నీరు ఎంత వచ్చినా ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది ఇలాంటి విషయాల మీద డిబేట్ పెడితే బాగుంటుంది జనాలను కూడా ఎడ్యుకేట్ చేసినట్లు అవుతుంది. అంతే తప్ప లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా మసి పూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు జనాలు ఎలా హర్షిస్తారు అన్నదే చూడాలని అంటున్నారు.

కొన్ని నిజాలు అయినా చెప్పి డిబేట్లు పెడితే జనాలు నమ్మేలా ఉంటాయి. కానీ మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలూ వానలో తడిసి ముద్ద అయిన నేపథ్యంలో ఒక్క అమరావతిలో మాత్రం వాన నీరే లేదని చెప్పాలనుకోవడం మాత్రం నిజంగా ఆలోచించాల్సిన విషయమే అని అంటున్నారు.

ఇక వాస్తవాలు ఈ రోజులలో మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రమే చూపిస్తే చూసే పరిస్థితుల్లో జనాలు లేరు అన్నది కూడా గ్రహించాలని అంటున్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ వారూ జర్నలిస్టులుగా మారిపోతున్న నేపథ్యం ఉంది. ఎవరికి వారుగా తమ చుట్టు పక్కల ఏమి జరుగుతోందో ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

అన్నింటికీ మించి అమరావతి దాని పరిధిలో ఉంటున్న వారికి ఏమి జరిగిందే తెలియదా అని కూడా అంటున్నారు. అమరావతి మునిగింది అని వైసీపీ అనుచరులు చేసే దాంట్లో రాజకీయ విమర్శలు ఉండొచ్చేమో కానీ వాస్తవంగా మాత్రం అమరావతి కూడా వరద తాకిడికి ఇబ్బంది పడింది. అంతవరకూ ఎందుకు అమరావతి అంతా కృష్ణా నదీ పరివాహిక ప్రాంతం. పక్కనే కొండవీటి వాగు పొంచి ఉంది. అది వరదల జోన్ అని కూడా వెదర్ ఎక్స్పర్ట్స్ చెబుతూ ఉంటారు.

దానికి ఎలా చేయాలో ఏమి చేయాలో రాజధాని నిర్మాణ సమయంలో తగిన చర్యలు తీసుకోవచ్చేమో కానీ ప్రస్తుతం ఉన్న దాన్ని మాత్రం లేనట్లుగా చూపించే ప్రయత్నంలో పచ్చ మీడియా బోల్తా కొట్టిందనే అంతా అంటున్నారు. ఒక పార్టీని ఒక వెర్షన్ ని నెత్తిన పెట్టుకునే ప్రయత్నంలో తమ క్రెడిబిలిటీ మునుగుతోంది అన్న అసలైన సత్యాన్ని కూడా విస్మరిస్తున్నారు అని అంటున్నారు.