మళ్లీ జైలుకు మాజీ ఎంపీ నందిగం సురేశ్.. వైసీపీకి షాక్
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ మళ్లీ జైలుకు వెళ్లనున్నారు. ఓ కేసు విషయంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో కోర్టులో లొంగిపోయిన ఆయనకు న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు.
By: Tupaki Desk | 17 Feb 2025 11:53 AMవైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ మళ్లీ జైలుకు వెళ్లనున్నారు. ఓ కేసు విషయంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో కోర్టులో లొంగిపోయిన ఆయనకు న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. అమరావతిలో ఓ మహిళపై దౌర్జన్యం చేశారని నందిగం సురేశ్ పై కేసు నమోదైంది. అయితే ఈ కేసులో పోలీసుల చర్యలకు ముందుగానే మాజీ ఎంపీ సురేశ్ కోర్టులో లొంగిపోయారు. కోర్టులో లొంగిపోతే బెయిల్ వస్తుందన్న ఆలోచనతో ఆయన రాగా, న్యాయమూర్తి అనూహ్యంగా రిమాండ్ విధించినట్లు చెబుతున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాజీ ఎంపీ సురేశ్ పై వరుస కేసులు నమోదవుతున్నాయి. మంగళగిరిలో పార్టీ కార్యాలయంపై దాడి కేసులో తొలుత అరెస్టు అయిన సురేశ్ జైలుకు వెళ్లారు. ఆ కేసులో బెయిల్ వచ్చిన వెంటనే 2020లో వెలగపూడిలో చోటుచేసుకున్న ఓ హత్యకేసులో మాజీ ఎంపీని అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో బెయిల్ వచ్చేవరకు ఆయన 145 రోజులు రిమాండ్ ఖైదీగా జైలు జీవితం గడిపారు.
వెలగపూడికి చెందిన మరియమ్మ హత్యకేసులో బెయిల్ వచ్చిన నందిగం సురేశ్ జనవరి 30న విడుదలయ్యారు. దాదాపు 17 రోజులుగా బయటే ఉన్న ఆయనపై తాజాగా అమరావతికి చెందిన మహిళ ఫిర్యాదు చేయడంతో మళ్లీ జైలుకు వెళ్లాల్సివచ్చిందంటున్నారు. అయితే ఈ కేసులో పోలీసు చర్యలకు ముందే ఆయన కోర్టులో లొంగిపోవడం గమనార్హం.