2009లో ఏం జరిగింది.. చరిత్ర లోతుల్లోకి వైసీపీ..!
YSRCP In Andhrapradesh
By: Tupaki Desk | 19 July 2023 12:51 PM GMTదీపం ఉండగానే ఇల్లు సర్దుకోమన్నట్టుగా వైసీపీ కూడా చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. చేతు లు కాలిపోయాక ఆకులు పట్టుకోవడం కన్నా.. ముందుగానే మేల్కొని ఎదురొచ్చే యుద్ధాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో వైసీపీ చాలా పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. తాజాగా ఎన్డీయే భేటీకి జనసేనను ఆహ్వానించడం.. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హాజరు కావడం దరిమిలా వైసీపీ మరింత అలెర్ట్ అయింది.
వచ్చే 2024లో ఎట్టి పరిస్థితిలోనూ విజయం దకకించుకుని.. మూడో సారి ముచ్చటగా అధికారం చేపట్టాల ని సీఎం జగన్ నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన పని ఆయన చేస్తున్నారు. అయితే.. మరోవైపు విపక్షాలు చేతులు కలిపేందుకు, వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చకుండా చేసేందుకు జనసేన అధినేత ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని పవన్ తాజాగా కూడా వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీలు చేతులు కలిపే ఛాన్స్ ఉందని చూచాయగా చెప్పారు.
దీంతో.. వైసీపీ వెంటనే అలెర్ట్ అయినట్టు తాడేపల్లి వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఈ క్రమం లోనే 2009లో ఏం జరిగిందనే విషయాన్ని చరిత్రలోతుల్లోకి వెళ్లి తెలుసుకుంటోంది. అప్పట్లోనూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని(వైఎస్ సీఎం) అధికారం నుంచి గద్దెదింపేందుకు మహా కూటమి పేరుతో టీడీపీ-టీఆర్ ఎస్-కమ్యూనిస్టు పార్టీలు చేతులు కలిపాయి. మరోవైపు.. ప్రజారాజ్యం ఒంటరిగా బరిలో దిగింది. ఇక కాంగ్రెస్ కూడా ఒంటరిగానే పోటీ చేసింది.
నిజానికి ఆ ఎన్నికల్లో ఒకవైపు తెలంగాణ సెంటిమెంటు.. మరోవైపు చంద్రబాబు ఇమేజ్.. ఇంకో వైపు కాంగ్రెస్ అవినీతి అంటూ.. హోరా హోరీ ప్రచారం.. పోరు అంతా ఇంతా హడావుడి కాదు. మొత్తానికి ఎన్నికలు ముగిశాయి. కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చింది. అయితే.. ఈ సారి మాత్రం కొంత మెజారిటీ, ఓటు బ్యాంకు కూడా తగ్గింది. అయితే.. ఈ విజయం వెనుక అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చాలానే కృషి చేశారు.
ఇప్పుడు సీఎం జగన్ కూడా.. నాడు ఏం జరిగింది? కూటమిని తన తండ్రి ఎలా ఎదుర్కొన్నారు.? అనే విషయాలపై ఆరా తీస్తున్నారని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. ఆ వ్యూహాలను అధ్యయనం చేసి.. సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోందని అంటున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.