మండలిలో మరో వైసీపీ వికెట్ ఔట్? టీడీపీలో చేరనున్న పల్నాడు ఎమ్మెల్సీ
పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన వైసీపీ సీనియర్ నేత, శాసనమండలి సభ్యుడు మర్రి రాజశేఖర్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
By: Tupaki Desk | 3 Jan 2025 10:49 AM GMTవైసీపీకి రాజీనామా చేస్తున్న నేతల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అధికారం పోయిన నుంచి రాజీనామాల పర్వం వైసీపీలో గుబులు రేపుతోంది. ఇప్పటికే ముగ్గురు రాజ్యసభ సభ్యులు, 8 మంది ఎమ్మెల్సీలు రాజీనామా చేయగా, తాజాగా మరో ఎమ్మెల్సీ రాజీనామా లేఖ పట్టుకుని తిరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన వైసీపీ సీనియర్ నేత, శాసనమండలి సభ్యుడు మర్రి రాజశేఖర్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్న రాజశేఖర్ చిలకలూరిపేట సమన్వయకర్తగా మాజీ మంత్రి విడదల రజనీని నియమించడం పట్ల గుర్రుగా ఉన్నారని చెబుతున్నారు. 2019లో తన సీటు త్యాగం చేసి విడదల రజనీకి ఇచ్చిన రాజశేఖర్ ను ఎమ్మెల్సీగా నియమించారు. అయితే 2024 ఎన్నికలకు ముందు రజనీని గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి పంపారు. ఎన్నికల్లో ఓడిన ఆమెను మళ్లీ చిలకలూరిపేటకు తేవడంపై ఎమ్మెల్సీ రాజశేఖర్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
2004లో స్వతంత్ర ఎమ్మెల్యేగా చిలకలూరిపేట నుంచి గెలిచిన మర్రి రాజశేఖర్ తొలి నుంచి వైఎస్ కుటుంబ విధేయుడిగా ముద్రపడ్డారు. 2009లో కాంగ్రెస్, 2014లో వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన 2019లో విడదల రజినీ కోసం తన సీటును త్యాగం చేశారు. 2024 ఎన్నికల్లో ఆమెకు వ్యతిరేకంగా సర్వేలు ఉన్నాయని సీటు మార్చారు. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన రజినీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాజశేఖర్.. ఇప్పుడు తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో జట్టు కట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఎన్నికలకు ముందు నలుగురు, ఎన్నికల అనంతరం నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేశారు. దీంతో శాసన మండలిలోనూ ఆ పార్టీకి బలం తగ్గిపోతోంది. త్వరలో మరికొద్ది మంది పార్టీకి గుడ్ బై చెప్పేస్తారన్న ప్రచారం నేపథ్యంలో అనూహ్యంగా మర్రి రాజశేఖర్ పేరు తెరపైకి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఆయనను బుజ్జగించేందుకు వైసీపీ అధిష్టానం సిద్ధమవుతుందా? లేక పోతే పోనీ అని వదిలేస్తుందా? అన్నది చూడాల్సివుంది.