Begin typing your search above and press return to search.

మామ ఇక్కడ...అల్లుడు అక్కడ!

ఇదేదో కొత్త సినిమా టైటిల్ కాదు వర్తమాన రాజకీయ వైచిత్రిగా చూడాల్సి ఉంది.

By:  Tupaki Desk   |   23 Sep 2024 3:30 AM GMT
మామ ఇక్కడ...అల్లుడు అక్కడ!
X
Cఇదేదో కొత్త సినిమా టైటిల్ కాదు వర్తమాన రాజకీయ వైచిత్రిగా చూడాల్సి ఉంది. అయినా ఇదేమంత వింతా విశేషమూ కాదు అన్న అక్కడ తమ్ముడు ఇక్కడ భార్య అక్కడ భర్త ఇక్కడ అన్న వేరే చోట చెల్లెలు మరో చోట ఇలా చాలా రాజకీయ విన్యాసాలు జరిగాయి. జరుగుతూనే ఉన్నాయి.

ఇంతకీ మ్యాటర్ ఏంటి అంటే గుంటూరు జిల్లాలో రాజకీయ శ్రేష్టుడు కేంద్ర మాజీ మంత్రి అయిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆయన అల్లుడు కిలారి రోశయ్య గురించే. మామ ఉమ్మారెడ్డి వైసీపీలో మొదటి నుంచి ఉంటున్నారు. ఆయన చలవతో వైసీపీలోకి అడుగుపెట్టి ఎమ్మెల్యేగా ఒకసారి గెలిచి ఎంపీగా గుంటూరు నుంచి పోటీ చేసి సొంత పొలిటికల్ ఐడెంటిటీని సాధించుకున్న రోశయ్య వైసీపీ ఓటమిపాలు అయ్యాక రూట్ మార్చారు.

ఆయన జనసేనలో చేరుతున్నారు. ఆయనకు వైసీపీ అన్యాయం ఏమి చేసింది అన్నదే తెలియడం లేదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఉమ్మారెడ్డి అల్లుడు అన్న కారణంగా ఆయనకు టికెట్ ఇచ్చామని ఒక కుటుంబానికి అలా రెండు టికెట్లు ఇచ్చామని చెబుతోంది. సరే కారణాలు ఏమైనా వైసీపీ ఓడి వాడిపోయింది కాబ్ట్టి రోశయ్య కొత్త దారి వెతుక్కున్నారు ఇదే అనుకోవాలి.

ఇక ఆయనతో పాటు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా పవన్ పార్టీలోకి వెళ్తారు అని టాక్ అయితే నడచింది. కానీ ఆయన మాత్రం జగన్ పక్కన మెరిసారు. బాపట్ల జిల్లా వైసీపీ నేతలతో జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. దానికి ఉమ్మారెడ్డి హాజరయ్యారు.

జగన్ తో కలసి ఆయన చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలలో కనిపించారు. దాంతో ఆయన వైసీపీని వీడరు అని అంటున్నారు. అయితే ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారని ఆ పదవీ కాలం ఇంకా ఉందని కూడా అంటున్నారు. మరో వైపు చూస్తే ఉమ్మారెడ్డి తన కుమారుడు వెంకటరమణకు రాజకీయ భవిష్యత్తు కోసం చూస్తున్నారు అని కూడా ప్రచారంలో ఉంది. రాజకీయంగా చూస్తే మొదట టీడీపీలో పనిచేసి వచ్చిన ఉమ్మారెడ్డి అందులోకి వెళ్లలేరు.

ఇక జనసేనలో అల్లుడు వెళ్ళారు. ఆయనకు అక్కడ ప్రాధాన్యత ఉంటుంది. సో కుమారుడికి సేఫ్ జోన్ అయితే ప్రస్తుతానికి వైసీపీ అని భావించి ఆయన ఫ్యాన్ నీడన ఉన్నారు అని అంటున్నారు. అయితే పాతకాలం రాజకీయ నేతగా విలువలకు కట్టుబడిన నాయకుడిగా ఉన్న ఉమ్మారెడ్డి ఈ లేట్ వయసులో పార్టీలు మారి చెడ్డ పేరు తెచ్చుకోరని ఆయన తన వారసుడిగా కుమారుడుని ముందు పెట్టి రాజకీయాల నుంచి తప్పుకుంటారు అని అంటున్నారు.

మొత్తానికి చూస్తే మామ వైసీపీలో అల్లుడు జనసేనలో ఇప్పటికి ఉన్నారు. రేపటికి ఏమి జరుగుతుంది అన్నది తెలియదు. జనసేనలోకి వరసగా నేతలు క్యూ కడుతూండడంతో జగన్ జిల్లాల వారీగా మీటింగ్స్ పెడుతున్నారు. పార్టీ బాధ్యులను నియమిస్తున్నారు. ఎవరు పార్టీతో ఉన్నారు ఎవరు ఉండలేరు అన్నది ఆయనకు అర్ధం అవుతోంది అని అంటున్నారు. చూడాలి ఈ ఫీడ్ బ్యాక్ తో వైసీపీ అధినేత ఏమి చేయబోతున్నారో.