వైసీపీలో వీరిని పక్కన పెట్టాల్సిందే... ఇదే ఇప్పుడు పెద్ద గళం...!
వైసీపీలో ఒక్కొక్కరుగా అసంతృప్త నాయకులు కూటమి కడుతున్నారు.
By: Tupaki Desk | 18 Nov 2024 10:30 AM GMTవైసీపీలో ఒక్కొక్కరుగా అసంతృప్త నాయకులు కూటమి కడుతున్నారు. వన భోజనాల ఏర్పాటు పేరుతో పలు జిల్లాల్లో ఈ ఆదివారం నిర్వహించిన కార్యక్రమాల్లో వైసీపీ నాయకులు పోగయ్యారు. ఈ సందర్భంగా కర్నూలు, అనంతపురం, కడప, రాజమండ్రి సహా పలు ప్రాంతాలకు చెందిన నాయకులు తమ గళం వినిపిస్తున్నారు. వీరి డిమాండ్ ఒక్కటే.. వైసీపీలో కొందరు నాయకులను పక్కన పెట్టాలనే. నేరుగా జగన్ బాధ్యతలు చూడాలనికోరుతున్నారు.
``క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో జగన్ ఇప్పటికీ పట్టించుకోవడం లేదు. ఎవరో ఒకరికి బాధ్యతలు అప్పగించి తప్పుకొంటున్నారు. ఇది సరికాదు. ఇలా ఉంటే.. మా కేడర్ ఇబ్బంది పడుతోంది`` అని తూర్పుగోదావరికి చెందిన సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. అదేవిధంగా అనంతపురానికి చెందిన మరో కీలక రెడ్డి నాయకుడు కూడా ఇదే అభిప్రాయంవ్యక్త పరిచారు. పార్టీలో ఇప్పుడున్న వారిని మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. మెజారిటీ నాయకుల మాట ఇలానే ఉంది.
సీనియర్ నాయకుల నుంచి జూనియర్ల వరకు కూడా.. అందరూ మార్పు దిశగానే అడుగులు వేస్తున్నా రు. ఇంతకీ వీరు కోరుతున్నది ఏంటంటే.. ఇటీవల జిల్లాల కో ఆర్డినేటర్లుగా.. ఆరుగురికి జగన్ బాధ్యతలు అప్పగించారు. మొత్తం ఉమ్మడి 13 జిల్లాలకు ఆరుగురిని కో ఆర్డినేటర్లుగా నియమించారు. వీరిలో కొందరి విషయంలో మార్పు కావాలనేది వారి డిమాండ్‌గా ఉంది. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బా రెడ్డి, మిధున్‌రెడ్డి వంటివారిని మార్చాలని కోరుతున్నారు.
అంతేకాదు.. బొత్స సత్యనారాయణ వంటివారిపై కూడా సొంత నేతల నుంచే అసంతృప్తి రగిలిపోతోంది. ఆయన వ్యవహారంతో పార్టీ మెరుగు పడబోదని మెజారిటీ నాయకులు చెబుతున్నారు. అనేక మంది నాయకులు ఉన్నారని, వారికి ప్రాధాన్యం ఇవ్వాలని కూడా కోరుతున్నవారు కనిపిస్తున్నారు. ప్రతి విషయంలోనూ ఆచి తూచి అడుగులు వేయకపోతే.. ఇబ్బందులు తప్పవని కూడా చెప్పేస్తున్నారు.మ రి జగన్ ఏం చేస్తారో చూడాలి.