సత్తెనపల్లి టు రేపల్లె వయా మంగళగిరి... వైసీపీ హాట్ పాలిటిక్స్ ..!
తన నియోజకవర్గం చుట్టుకొలతలు కూడా తెలియని వారు ఇక్కడ రాజకీయం ఎలా చేస్తారని కూడా ప్రశ్నించారు.
By: Tupaki Desk | 13 Dec 2024 12:30 AM GMTప్రతిపక్ష వైసీపీలో పాలిటిక్స్ హాట్ హాట్‌గా మారాయి. నాయకులను మారుస్తూ.. నియోజకవర్గం ఇంచార్జ్‌లను మారుస్తూ.. తాజాగా మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం.. పార్టీలో చర్చకు దారి తీసింది. సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఈ ఏడాది ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అంబటి రాంబాబును.. అక్కడ నుంచి తప్పించడం.. ఆ నియోజకవర్గాన్ని మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి అప్పగించడం.. వైసీపీలో వివాదాలకు దారితీసింది. తన నియోజకవర్గంలోకి ఎవరూ రావాల్సిన అవసరం లేదని.. రాంబాబు.. వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గం చుట్టుకొలతలు కూడా తెలియని వారు ఇక్కడ రాజకీయం ఎలా చేస్తారని కూడా ప్రశ్నించారు.
అంటే.. అంబటి రాంబాబు.. రాజకీయంగా సత్తెనపల్లిలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కానీ, వైసీపీ వ్యూహం వేరేగా ఉంది.ఆయనను తిరిగి రేపల్లెకు పంపించడం ద్వారా.. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన మోపిదేవి వెంకటరమణ వర్గానికి షాకివ్వాలనేది పార్టీ వ్యూహం. వాస్తవానికి ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో మోపిదేవికి టికెట్ ఇవ్వాలేదు. ఈవూరు గణేష్‌ను జగన్ ఇక్కడ నుంచి నిలిపారు. అయితే.. ఆయన కేవలం 71 వేల ఓట్లకే పరిమితమయ్యారు. ఈ పరిణామాలతో గణేష్ బలమైన పోటీ ఇవ్వలేక పోయారన్న చర్చ ఉంది. ఇక, మార్పులో భాగంగా అంబటిని ఇక్కడకు తీసుకురావాలని భావిస్తున్నారు.
ఇక, ఆళ్ల రామకృష్నారెడ్డి మంగళగిరి నియోజకవర్గంలో టికెట్ కోల్పోయారు. ఈయన తిరిగి ఇక్కడే పుంజుకోవాలని భావిస్తున్నారు. తనకు ఇంచార్జ్ పోస్టు ఇచ్చేలా సోదరు అయోధ్య రామిరెడ్డి ద్వారా మంత్రాంగం నడుపుతున్నట్టుకొన్ని రోజులుగా చర్చ సాగుతోంది. బీసీలకు అవకాశం ఇచ్చిన జగన్.. చేతులు కాల్చుకున్నారు. కాబట్టి.. ఆ సూత్రం పనిచేయలేదన్నది ఆళ్ల వాదన. ఇంతలోనే ఆయనను సత్తెనపల్లికి వెళ్లి పార్టీ కార్యక్రమాలు చూడాలని పార్టీ అధిష్టానం నుంచి సమాచారం అందింది. కానీ, ఆళ్ల ఇప్పటి వరకు స్పందించలేదు. అంటే.. ఆయన సత్తెనపల్లికి వెళ్లేందుకు ఇష్టపడడం లేదని తెలిసింది.
ఇక, తన పదవికి ఎసరు వస్తోందని గ్రహించిన రేపల్లె వైసీపీ ఇంచార్జ్ గణేష్.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. తనకు ఇబ్బంది కలిగించేలా చర్యలు తీసుకుంటే.. తన దారి తాను చూసుకుంటానని ఆయన చెప్పేస్తున్నారు. ఈ క్రమంలో గత రెండు రోజులుగా ఆయన జనసేన అధినేత పవన్‌కు అనుకూలంగా కామెంట్లు చేస్తున్నవారికి లైకులు కొడుతుండడం గమనార్హం. అంటే.. ఒకరకంగా వైసీపీకి గణేష్ సంకేతాలు ఇస్తున్నారు. మొత్తంగా చూస్తే.. వైసీపీలో రాజకీయం సత్తెనపల్లి టు రేపల్లె వయా మంగళగిరి అన్నట్టుగా సాగుతున్నాయి. మరి ఇవి సక్సెస్ అవుతాయా? ముసలం పుట్టిస్తాయా? అనేది చూడాలి.