వైసీపీ నేతలు... సైలెంట్.. అక్కడ జెండా ఎగరట్లేదుగా.. !
మరోవైపు.. ఆళ్లగడ్డలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. శ్రీశైలం నుంచి బరిలో నిలిచిన శిల్పా చక్రపాణి రెడ్డి కూడా.. పార్టీ వైపు కన్నెత్తి చూడడం లేదు.
By: Tupaki Desk | 23 Feb 2025 7:30 AM GMTవైసీపీ నాయకులు యాక్టివ్ కావాలని.. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ పదే పదే చెబుతున్నా.. నాయ కుల్లో చలనం కనిపించడం లేదు. చాలా మంది నాయకులు.. తమ తమ నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా విజయవాడ, పశ్చిమ, సెంట్రల్ సహా.. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం, పోలవరం నియోజకవర్గం సహా.. అనేక నియోజకవర్గాల్లో పార్టీ జెండా కనిపించడం లేదు. నాయకులు ముందుకు రావడం లేదు. ఒకటి రెండు నియోజకవర్గాల్లో మాత్రమే పరిస్థితి కొంత బాగుంది.
దీనికి కారణం.. నాయకుల మధ్య సఖ్యత కొరవడడమేనని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేలను టికెట్లు ఇవ్వకుండా.. వారిని మార్చడంతోపాటు.. నియోజకవర్గాలను వేరేవారికి అప్పగించారు. ఇలా వచ్చిన వారంతా ఓడిపోయారు. కనీసం.. ఓడిన తర్వాత.. వారు కనిపించడం కూడా లేదు. వీరిలో సీనియర్లు, మాజీ మంత్రులు కూడా ఉన్నారు. దీంతో ఉన్నది పోయి.. ఉంచుకున్నది పోయి.. అన్న సామెత మాదిరిగా నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు చేపడడం లేదు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పోటీ చేశారు. వాస్తవానికి ఈయనది.. పశ్చిమ నియోజకవర్గం. అయినా.. మార్పులో భాగంగా సెంట్రల్‌కు పంపించారు. ఈయన ఓడిపోయిన తర్వాత.. అటు పశ్చిమలోనూ.. కనిపించడం లేదు. ఇటు సెంట్రల్‌నూ ఆయన మాట వినిపించడం లేదు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లోనూ వైసీపీ కార్యక్రమాలకు బ్రేకులు పడ్డాయి. ఇక, సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు.. కొన్ని రోజులు హడావుడి చేసినా.. తనకు బాధ్యతలు అప్పగించకపోయే సరికి మౌనంగా ఉన్నారు.
మరోవైపు.. ఆళ్లగడ్డలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. శ్రీశైలం నుంచి బరిలో నిలిచిన శిల్పా చక్రపాణి రెడ్డి కూడా.. పార్టీ వైపు కన్నెత్తి చూడడం లేదు. ఇక, గుంటూరులోనూ.. ఇలాంటి నాయకులకు లెక్క లేకుండా పోయింది. కొందరు పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న చర్చ కూడా తెరమీదికి వస్తోంది. మొత్తంగా చూస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొనడంతో.. పార్టీ జెండా ఎగరడం లేదన్న చర్చ జోరుగా సాగుతుండడం గమనార్హం.