వైసీపీకి సెప్టెంబర్ గండం తప్పదా... స్కెచ్ గీసిందెవరు ?
వైసీపీలో సంక్షోభం బంగాళాఖాతంలో వాయుగుండం మాదిరిగా కొనసాగుతోంది. తుఫానుకు ముందు సంకేతాలు ఉంటాయి.
By: Tupaki Desk | 1 Sep 2024 8:54 AM GMTవైసీపీలో సంక్షోభం బంగాళాఖాతంలో వాయుగుండం మాదిరిగా కొనసాగుతోంది. తుఫానుకు ముందు సంకేతాలు ఉంటాయి. వైసీపీలో మాత్రం ఆ జాడలు అయితే కానరావడంలేదు. మొన్నటికి మొన్న ఇద్దరు రాజ్యసభ ఎంపీలు చాలా సైలెంట్ గా పార్టీకి రాం రాం అంటూ ఎంపీ పదవులకు రాజీనామాలు చేసి వచ్చారు.
ఇక ఎమ్మెల్సీల రాజీనామాల పర్వం సాగుతూనే ఉంది. పోతుల సునీత రాజీనామాతో మొదలైన ఈ పర్వంలో ఇప్పటికి స్కోర్ మూడుకు చేరింది. ఇది ఇప్పట్లో ఆగేది కాదు అని అంటున్నారు. అయితే దానికి ఒక మంచి ముహూర్తాన్ని సెట్ చేసి ఉంచారుట. జగన్ ఈ నెల 4న యూకే టూర్ కి వెళ్తున్నారు. ఆయన ఏకంగా ఇరవై రోజుల పాటు లండన్ లో ఉండబోతున్నారు.
ఈ సుదీర్ఘమైన సమయంలోనే వైసీపీలో పెను సంక్షోభాన్ని తీసుకుని వచ్చేందుకు భారీ స్కెచ్ అయితే డిజైన్ చేసి ఉంచారు అని అంటున్నారు ప్రస్తుతానికి రాజ్యసభ ఎంపీల నుంచి ఏ బెడదా లేకపోయినా శాసనమండలిలో మాత్రం భారీ కుదుపు తప్పదని అంటున్నారు. శాసన మండలిలో వైసీపీకి 39 మంది సభ్యుల బలం ఉంది. దాన్ని ఎంత వీలు అయితే అంతలా తగ్గించాలన్నది ఒక మాస్టర్ ప్లాన్ తో వైసీపీ ప్రత్యర్ధులు ముందుకు సాగుతున్నారు.
అలా చూసుకుంటే కనుక కనీసంగా ఇరవై మంది దాకా వైసీపీ ఎమ్మెల్సీలు గోడ దాటేసే అవకాశం ఉంది అని అంటున్నారు. వీరంతా తమ పదవులకు పార్టీకి రాజీనామా చేసి కూటమిలోని టీడీపీ జనసేనలలో చేరిపోతారు అని అంటున్నారు. అక్కడ అదే ఎమ్మెల్సీ పదవి తమకు దక్కుతుందని హామీ ఉన్న వారు వెంటనే రాజీనామాలు చేస్తున్నారు. అలా కాదని నామినేటెడ్ పదవులు ఇస్తామని చెబితే దానికి అంగీకరించిన వారూ వైసీపీకి గుడ్ బై కొడుతున్నారు
ఇక 2026 నాటికి ఏపీ అసెంబ్లీలో మరో యాభై సీట్లు పెరుగుతాయి కాబట్టి వాటిలో అడ్జస్ట్ చేస్తామని కూటమి పెద్దలు ఇచ్చే హామీలను కూడా తీసుకుని రాజీనామాలకు ముందుకు వచ్చే వారూ ఉన్నారని అంటున్నారు. మొత్తానికి వైసీపీని వీడిపోవడానికి కారణం ఘోరంగా ఓటమి పాలు కావడమే అంటున్నారు.
అంతే కాదు ఇంత ఓటమిలోనూ అధినాయకత్వం తీరులో ఏ మాత్రం మార్పు రాకపోవడం అని కూడా అంటున్నారు. ఇక అధికార పక్షంలో చేరితే వేధింపులు ఉండవని, తమ వ్యాపార వ్యవహారాలు హ్యాపీగా చేసుకోవచ్చు అని ఆలోచిస్తున్న వారూ ఉన్నారు. దాంతోనే వీరంతా గంపగుత్తగా చేరిపోవడానికి చూస్తున్నారు అని అంటున్నారు.
మరో విషయం ఏంటి అంటే ఎమ్మెల్సీల తరువాత వైసీపీలో బలమైన నాయకులను కూడా కూటమి వైపు లాగేయడం అని అంటున్నారు జిల్లాల వారీగా చూసి నోరున్న పేరున్న నేతలను తమ వైపు తిపుకోవాలని కూడా కూటమి పెద్దలు చూస్తున్నారు. ఆపరేషన్ వైసీపీని సెప్టెంబర్ లో పెద్ద ఎత్తున అమలు చేయడానికి చూస్తున్నారు. నిజానికి సెప్టెంబర్ మాసం శూన్య మాసం. కానీ రాజకీయాల్లో కాని పనులకు తమకు కావాల్సిన పనులకు ఇది ఎంతగానో అచ్చి వచ్చే మాసం అని సెటైర్లు పడుతున్నాయి.
జగన్ అలా ఫ్లైట్ ఎక్కుతారో లేదో ఇలా వైసీపీలో పెను రాజకీయ తుఫాను మొదలవుతుంది అని అంటున్నారు. ఈ మేరకు రాజకీయంగా ప్రచారం అయితే సాగుతోంది. మరి వైసీపీని జగన్ దేశంలోనూ ఏపీలోనూ లేని వేళ మోనిటరింగ్ చేసి సర్ది చెప్పే వారు ఎవరు అన్నదే కీలక ప్రశ్న. నిజానికి అనుకున్నది జరిగి ఆపరేషన్ వైసీపీ సక్సెస్ అయితే టీడీపీకి ఆగస్ట్ సంక్షోభం మాదిరిగా వైసీపీకి సెప్టెంబర్ సంక్షోభం చరిత్రలో మిగిలిపోయే అధ్యాయం అవుతుంది అని అంటున్నారు.