వైసీపీ నేతల మెడలో జనసేన కండువా
రాజకీయం అంటే అదే మరి. ఒకనాడు జనసేనలో చేరడానికి ఆలోచించే పరిస్థితి ఉండేది.
By: Tupaki Desk | 26 Sep 2024 5:08 PM GMTరాజకీయం అంటే అదే మరి. ఒకనాడు జనసేనలో చేరడానికి ఆలోచించే పరిస్థితి ఉండేది. అంతే కాదు, వైసీపీలో దిగ్గజ నేతలుగా కొందరు చలాయిస్తూ ఉండేవారు. వైసీపీ నుంచి బయటకు తాము వెళ్తామని వారు కలలో కూడా ఊహించి ఉండరు.
కానీ వారికి అలాంటి అనివార్యత వచ్చింది అని భావించాలి. లేకపోతే వైఎస్సార్ కుటుంబానికి చెందిన బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి ఏమిటి వైసీపీని వీడడమేంటి అన్న చర్చ ఉంది. అలాగే వైఎస్సార్ ప్రోత్సాహంతో పాలిటిక్స్ లో ఎదిగిన మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా వైసీపీకి గుడ్ బై చెప్పడాన్ని కూడా ఏ విధంగా అర్ధం చేసుకోవాలి అన్న చర్చ ఉండనే ఉంది.
వీరంతా పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీసులో పవన్ సమక్షంలో వీరు పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. పవన్ వారిని సాదరంగా ఆహ్వానించారు. పవన్ తో కలసి గ్రూప్ ఫోటోలు దిగిన వీరంతా పూర్తి హ్యాపీగా కనిపించారు కొత్త పార్టీలో కొత్త నాయకత్వంలో కొత్త రకం రాజకీయం చేయవచ్చు అన్న ఉత్సాహం అయితే వారిలో కనిపిస్తోంది.
ఇక బాలినేని వైసీపీని ఎందుకు వీడానో చెప్పారు. అలాగే జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే ఉదయభాను కూడా తాను ఎందుకు వైసీపీని వద్దు అనుకున్నానో చెప్పారు. ఇపుడు జనసేన కండువా కప్పుకున్న సందర్భంగా ఉదయభాను అయితే ఒక్క మాట అన్నారు.
రాజకీయాలలో శాశ్వత శతృవులు ఎవరు ఉండరు అని. తాను ఎలాంటి కండిషన్లు పెట్టకుండా జనసేనలో చేరాను అని కూడా చెప్పారు. జనసేన పార్టీ అభివృద్ధి కోసం తన వంతుగా కృషి చేస్తాను అని ఆయన చెప్పారు. కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధిలో తాను భాగం అవుతాను అని కూడా అన్నారు.
టీడీపీ కూటమిలో మిగిలిన పార్టీ నేతలతో ఎలాంటి విభేదాలు లేకుండా పనిచేయడమే తన ఆలోచన అని కూడా అన్నారు. తాను మూడు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్నాను అని చెప్పారు. మరో వైపు బాలినేని శ్రీనివాసరెడ్డి చేరికతో ఒంగోలులో జనసేన బలపడింది అని అంటున్నారు. అయితే ఒంగోలులో టీడీపీ ఎమ్మెల్యేకు బాలినేనికి మధ్య వివాదం ఉంది. దానిని పరిష్కరించుకుంటేనే ముందుకు అన్నట్లుగా అక్కడ పాలిటిక్స్ ఉంది.
దానికి బాలినేని మాట్లాడుతూ తాను పార్టీలో చేరిక వల్ల కూటమికి బలమే అన్నారు. ఒంగోలులో జనసేన నిర్మాణానికి కృషి చేస్తాను అని ఆయన చెప్పారు. మొత్తానికి అందరూ వైసీపీ నేతలే. అందరూ ఒకనాడు వైసీపీలో పదవులు అందుకున్న వారే. ఇపుడు ఓడలు బళ్ళు అయ్యాయి. రాజకీయం తిరగబడింది. అందుకే అటు నుంచి ఇటు మారుతున్నారు అని అంటున్నారు.