Begin typing your search above and press return to search.

చేరికలకు బాబు గ్రీన్ సిగ్నల్... పోలోమంటూ నేతలు !

ఉత్తరాంధ్రాలో చూసుకుంటే భీమిలీ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు కొద్ది నెలల క్రితమే వైసీపీకి రాజీనామా చేశారు.

By:  Tupaki Desk   |   15 Feb 2025 3:40 AM GMT
చేరికలకు బాబు గ్రీన్ సిగ్నల్... పోలోమంటూ నేతలు !
X

టీడీపీలో చేరేందుకు చాలా మంది నాయకులు సిద్ధంగా ఉన్నారని టాక్ నడుస్తోంది. ఎలా కాదనుకున్నా మరో నాలుగేళ్ళకు పైగా అధికారంలో ఉంటామన్న ధీమా నేతలలో ఉంది. ఆ మీదట అదృష్టం కలసి వస్తే 2029 ఎన్నికల్లో టికెట్ దక్కి మరింతగా అధికారం పంచుకోవచ్చు అన్న ఆశలూ ఉన్నాయి. దాంతో టీడీపీ వైపుగా చూసే వారి సంఖ్య ఎక్కువ అవుతోంది. ఏవో రకాల కారణాలు చెప్పి వైసీపీ నుంచి బయటకు రావడానికి చూస్తున్న వారు ఉన్నారు. అలాగే ఈపాటికి బయటకు వచ్చి వెయిట్ చేస్తున్న వారూ ఉన్నారు.

ఉత్తరాంధ్రాలో చూసుకుంటే భీమిలీ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు కొద్ది నెలల క్రితమే వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన తాను ప్రస్తుతానికి ఏ పార్టీలో చేరేది లేదని మీడియాకు చెప్పారు కానీ ఆయన టీడీపీలో చేరాలని అనుకుంటున్నారు అని ప్రచారంలో ఉంది. ఆయన భీమిలీ టికెట్ ని ఆశిస్తున్నారు అని అంటున్నారు.

అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఒకనాటి అవంతి రాజకీయ గురువు అయిన గంటా శ్రీనివాసరావు ఉన్నారు. అవంతి రాకకు ఆయన అభ్యంతరం చెబుతారన్న చర్చ ఉంది. అందుకే ఆయన చేరిక జరగడం లేదని అంటున్నారు. అయితే అనూహ్యంగా గోదావరి జిల్లాలకు చెందిన మాజీ మంత్రి ఆళ్ళ నానికి చంద్రబాబు పిలిచి మెడలో పసుపు కండువా కప్పేశారు. దాంతో ఆయన టీడీపీ నాయకుడు అయ్యారు.

ఏలూరు జిల్లాలో ఆళ్ళ రాకను వ్యతిరేకిస్తున్న వర్గాలకు నాయకులకు సర్దిచెప్పి బాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా బాబు తలచుకుంటే మిగిలిన చోట్ల కూడా ఈ విధంగా చేసి వెయిటింగ్ లో ఉన్న అవంతి వంటి వారిని చేర్చుకుంటారు అన్న ప్రచారం సాగుతోంది. అంగబలం అర్ధ బలం కలిగిన అవంతి శ్రీనివాసరావు టీడీపీలో ఎంపీగా కూడా పనిచేసి ఉన్నారు. అంటే ఆయన పాత కాపు గానే చూడాలి. దాంతో ఆళ్ళ చేరిక తరువాత అవంతి మెడలోనే పసుపు కండువా పడుతుంది అని అంటున్నారు.

మరో వైపు చూస్తే ఇదే ఉత్తరాంధ్రలో ఒక సీనియర్ నేత మాజీ మంత్రి కూడా తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం టీడీపీ వైపు చూస్తున్నారు అని ప్రచారం చాన్నాళ్ళుగా ఉంది. ఆయన తాను ఉన్న పార్టీలో ఫుల్ సైలెంట్ గా ఉంటున్నారు. ఆయన అక్కడ ఉన్నట్లా లేనట్లా అంటే రెండవ మాటే నిజమని కూడా ఆ పార్టీ క్యాడర్ అంటోంది.

ఆయన తన వారసుడికి గట్టి రాజకీయ పునాది పడాలని కోరుకుంటున్నారు. దానికి కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే టీడీపీయే సరైన పార్టీ అని ఆయన భావిస్తున్నారుట. ఆయన మీద టీడీపీ అధినాయకత్వానికి కూడా మంచి అభిప్రాయమే ఉంది. కానీ జిల్లాలో ఉన్న టీడీపీ పెద్దల అభ్యంతరాలే ఆపాయని అంటున్నారు. మరి బాబు చేరికలకు పచ్చ జెండా ఊపుతున్న దశలో ఆయనకూ పిలుపు రావచ్చు అన్నది ప్రచారంలో ఉంది.

అదే విధంగా గత ప్రభుత్వంలో ఉన్నత పదవులు చేపట్టి ప్రస్తుతం మౌన ముద్రలో ఉన్న ఉత్తరాంధ్రాలోని మరో జిల్లాకు చెందిన నాయకుడి విషయం కూడా అలాగే ఉంది. ఆయన కూడా టీడీపీ పిలిస్తే పలకాలని అనుకుంటున్నారుట. విశాఖ జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు దాదాపుగా అరడజన్ మంది దాకా టీడీపీ తీర్ధం కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో టీడీపీలో కీలక పదవులు అనుభవించి వైసీపీలో చేరిన ఒక మైనారిటీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే టీడీపీలో చేరాలని చూస్తున్నారు. ఆయనకు గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది.

అలాగే కాంగ్రెస్ టీడీపీ వైసీపీ ఇలా అటూ ఇటూ తిరిగి ప్రస్తుతం వైసీపీలో మాజీలుగా ఉన్న కొందరు ఎమ్మెల్యేలకు కూడా సైకిలెక్కాలని ఉందని టాక్. మరి ఆళ్ళ నాని చేరికతో వారిలోనూ కొత్త ఆశలు రేకెత్తుతున్నాయని అంటున్నారు. టీడీపీ అధినాయకత్వం తలచుకుంటే ప్రస్తుతం ప్రచారంలో ఉన్న పేర్లతో పాటుగా ఎవరూ ఊహించని మరిన్ని కొత్త పేర్లు కూడా బయటపడవచ్చు అని అంటున్నారు.