పరారీలో వైసీపీ కీలక నేతలు!
వైసీపీ కీలక నేతలు.. దేవినేని అవినాశ్, మాజీ మంత్రి జోగి రమేశ్ పరారీలో ఉన్నారని టాక్ నడుస్తోంది.
By: Tupaki Desk | 5 Sep 2024 7:55 AM GMTవైసీపీ కీలక నేతలు.. దేవినేని అవినాశ్, మాజీ మంత్రి జోగి రమేశ్ పరారీలో ఉన్నారని టాక్ నడుస్తోంది. గతంలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం విధ్వంసం ఘటనలో విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి దేవినేని అవినాశ్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ తదితర వైసీపీ నేతలపై ఫిర్యాదు దాఖలైంది. వీరి కనుసన్నుల్లో వీరి అనుచరులు టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారని టీడీపీ ఫిర్యాదు చేసింది.
అయితే గత ప్రభుత్వంలో వైసీపీ అధికారంలో ఉండటంతో టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసినవారిపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఎవరినీ అరెస్టు కూడా చేయలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఈ కేసు వేగం పుంజుకుంది. ఈ క్రమంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలు తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు వారికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను ఏపీ పోలీసులు బుధవారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. మిగతా వారిని అరెస్టు చేయడానికి ప్రయత్నించగా వారు పరారీలో ఉన్నట్టు చెబుతున్నారు. ఇళ్ల వద్ద దేవినేని అవినాశ్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం లేరని.. అజ్ఞాతంలో ఉన్నారని చెబుతున్నారు. పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారని అంటున్నారు.
అలాగే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటిపైకి నాడు ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ నేత జోగి రమేశ్ భారీ కాన్వాయ్ తో దాడికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలోనూ వైసీపీ నేతలనూ వదిలేసి టీడీపీవారిపైనే అప్పట్లో కేసులు పెట్టారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాజీ మంత్రి జోగి రమేశ్ పై ఫిర్యాదు దాఖలైంది. ఈ కేసులో జోగి రమేశ్ తనకు ముందస్తు బెయిల్ ను ఇవ్వాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆయన పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. అలాగే అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరినా సానుకూల ఉత్తర్వులు రాలేదు. ఈ నేపథ్యంలో తనను అరెస్టు చేస్తారన్నా భయంతో జోగి రమేశ్ సైతం పరారీలో ఉన్నట్టు చెబుతున్నారు.
అజ్ఞాతం/పరారీలో ఉన్న దేవినేని అవినాశ్, జోగి రమేశ్ తదితర నేతల కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చే శారు. ఏడు ప్రత్యేక పోలీసు బృందాలు వైసీపీ నేతల కోసం అన్వేషణ సాగిస్తున్నాయి. ఏ క్షణం అయినా వారిని అరెస్టు చేయొచ్చని అంటున్నారు.