Begin typing your search above and press return to search.
వైసీపీలో విభీషణులు.. వీరి లెక్కేవేరు!
విభీషణుడు! రాక్షస కూటమిలో ఉండి కూడా.. న్యాయాన్ని, ధర్మాన్ని పాటించిన వాడిగా పేరొందాడు.
By: Tupaki Desk | 25 March 2025 7:38 AMవిభీషణుడు! రాక్షస కూటమిలో ఉండి కూడా.. న్యాయాన్ని, ధర్మాన్ని పాటించిన వాడిగా పేరొందాడు. రామాయణంలో పెద్ద ప్రత్యేక పాత్ర లేకపోయినా.. సీతమ్మను చెరబట్టిన రావణాసురుడి సోదరుడిగా ఉండలేనన్న ఒకే ఒక్క మాటతో బయటకు వచ్చి.. అంతకుమించిన గుర్తింపు పొందాడు విభీషణుడు. ఇలాంటి విభీషణులు రాజకీయాల్లోనూ ఉన్నారు. అయితే.. వారు... నాటి విభీషణుడి మాదిరిగా ధైర్యం చేయలేరు.. పార్టీని వదల్లేరు అంతే తేడా. కానీ, ఫక్తు.. సొంత పార్టీలోనే ఉన్నా.. తప్పును తప్పని చెప్పడంలో మాత్రం విభీషణుడికి ఏమాత్రం తక్కువ కాదు.
ఇలాంటివారు వైసీపీలో పదుల సంఖ్యలో ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. టీడీపీ నాయకులు ఆరోపిస్తు న్నట్టు వైసీపీ అరాచక పార్టీ అయితే.. ఆ పార్టీలో ఉన్న కొందరు నాయకులు నిజంగానే విభీషణులు. వీరిపై అవినీతి మరకలు లేవు. అక్రమాల మచ్చలు కూడా లేవు. ఆశ్చర్యం కాదు నిజమే! అంతేకాదు.. వైసీపీ అధినేత జగన్, ఆయన సోదరికి మధ్య ఏర్పడిన ఆస్తుల వివాదంపైనా వీరు సమయస్ఫూర్తిని ప్రదర్శించి తమ అధినేత ఇష్టానికి వ్యతిరేకమే అయినా.. `ఆడపడుచు కన్నీరు ఇంటికి మంచిది కాద`ని వ్యాఖ్యానిం చారు. చంద్రబాబు సతీమణిని అసెంబ్లీలో వివాదస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు.. కూడా వీరు.. తప్పని ముక్తకంఠంతో చెప్పారు.(అయితే.. ఇది అంతర్గత సమావేశంలోనే).
అంతేకాదు.. కూటమి సర్కారుపై విమర్శలు చేయాలని.. చంద్రబాబును తిట్టాలని అన్నప్పుడు కూడా.. వైసీపీలో ఉన్న కొద్ది మంది విభీషణుల వంటి నాయకులు.. ఆ పని చేయలేదు. సమయం-సందర్భం చూసుకుని ప్రజాస్వామ్య యుతంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు. ఇక, ఒకానొక దశలో సోషల్ మీడియాలో టీడీపీపై విమర్శలు వెల్లువెత్తేలా చేసిన సమయంలోనూ ఈ నాయకులు పెదవి విప్పలేదు.. పరుషంగా ఒక్క మాట కూడా సోషల్ మీడియాలో పెట్టలేదు. పైగా అంతర్గత సమావేశాల్లో వైసీపీ సోషల్ మీడియా విభాగం చేస్తున్న `అల్లరి` సరికాదని సూచించిన వారే ఉన్నారు.
ఇలాంటి వైసీపీ విభీషణులు చాలా మంది ఉన్నా.. ఎన్నడూ పార్టీ మారాలని కానీ.. పార్టీ అధినేతను వదిలేయాలని కానీ ప్రయత్నించకపోవడం గమనార్హం. అలాంటి వారే.. అనంతపురం జిల్లా కు చెందిన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, కడప జిల్లాకు చెందిన రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, గుంటూరు జిల్లా బాపట్ల మాజీ ఎమ్మెల్యే కోన శశిధర్, గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి మేరుగ నాగార్జున, విశాఖ జిల్లాకు చెందిన గాజువాక మాజీ ఎమ్మెల్యే .. తిప్పల నాగిరెడ్డి.. ఇలా చాలా మంది ఉన్నారు. వీరిపై ఎలాంటి మచ్చలు, మరకలు లేకపోవడం గమనార్హం.
కొసమెరుపు: ఇంత మంచి వారే అయినా.. వైసీపీలో విభీషణ పాత్ర పోషిస్తున్నా.. అధినేత మాత్రం వీరిని పట్టించుకోకపోవడం.. గమనార్హం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బూతుల నాయకులను ప్రోత్సహించే బదులు ఈ విభీషణుల వంటి నాయకులకు కీలక బాధ్యతలు అప్పగిస్తే.. పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందని కూడా సూచన చేస్తున్నారు.