వైసీపీలో మారాల్సింది ఎవరు.. ఏం జరుగుతోంది..!
పార్టీలో అంతా బాగుందని.. కూటమి వల్లేతమకు ఇబ్బందులు వస్తున్నాయని వైసీపీ అధినేత భావిస్తున్నారు.
By: Tupaki Desk | 4 March 2025 5:00 PM ISTవైసీపీలో మారాల్సింది ఎవరు? మార్చాల్సింది ఎవరు? ఇదీ.. ఇప్పుడు జరుగుతున్న చర్చ. పార్టీలో అంతా బాగుందని.. కూటమి వల్లే తమకు ఇబ్బందులు వస్తున్నాయని వైసీపీ అధినేత భావిస్తున్నారు. కానీ, జగన్ అనుకుంటున్నది తప్పని సీనియర్లే చెబుతున్నారు. అసలు మారాల్సింది.. మార్చాల్సింది.. పైస్థాయిలో ఉన్న నాయకులనే నని వారు అంటున్నారు. పార్టీ అధికారం కోల్పోయిన దరిమిలా.. అనేక నామినేటెడ్ పదవులను నియమించారు.
పేర్లు కూడా ప్రకటించారు. కానీ, వాటికి సంబంధించిన ఉత్తర్వులు ఇంకా రాలేదు. దీనికి కారణం.. సజ్జల రామకృష్ణారెడ్డి సహా.. మరో ఇద్దరివైపు.. నాయకులు వేళ్లు చూపిస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి కారణంగానే తాము నష్టపోయామని.. ఉత్తరాంధ్ర నాయకులు చెబుతున్నారు. మరోవైపు.. పెద్దిరెడ్డి ఉంటే.. తాము పార్టీలో మనుగడ సాధించలేమని సీమ నాయకులు అంటున్నారు. ఈ పరిణామాలు.. జగన్‌కు వినిపిస్తున్నాయో... లేదో కానీ... పార్టీలో మాత్రం చర్చకు వస్తున్నాయి.
``పార్టీ పరంగా బాగానే ఉందని మా నాయకుడు చెబుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో వారు చెప్పింది ఏమీ జరగడం లేదు. పార్టీ తరఫున పదవులు ఇచ్చారు. కానీ, ఇప్పటికీ వాటిని ప్రకటించలేదు. ఇది ఎవరు చేస్తున్నారో అందరికీ తెలిసిందే`` అని ఉత్తరాంధ్రకు చెందిన నాయకుడు వ్యాఖ్యానించారు. ఇక, సజ్జల చెబితేనే. తాను నోరు చేసుకున్నానని పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యల తర్వాత.. ఆయనపై అనేక విమర్శలు వస్తున్నాయి. సజ్జలను పార్టీ నుంచి తప్పించాలన్న డిమాండ్ కూడా ఉంది.
ఇక, పెద్దిరెడ్డి విజయం దక్కించుకున్నాక.. మరింతగా సీమలో వైసీపీ బలహీనపడింది. ఎక్కడా నాయకు లు బయటకు రావడం లేదు. దీనికి కారణం.. ఆయన చెప్పినట్టు నడుచుకోవాలన్న లక్ష్మణ రేఖలు వారికి అడ్డు వస్తున్నందునే. ఇక, వైవీ సుబ్బారెడ్డి చేయాల్సింది చేసేశారు. దీనిని సరిచేయడం ఇప్పుడు పార్టీ అధినేత జగన్ చేతిలోనే ఉందని నాయకులు చెబుతున్నారు. సో.. ఎలా చూసుకున్నా.. మార్చాల్సింది.. ఈ ముగ్గురు నాయకులనే. అప్పుడే పార్టీకి కొంత ఊపు వస్తుందని అంటున్నారు. మరి జగన్ ఆ సాహసం చేస్తారో లేదో చూడాలి.