Begin typing your search above and press return to search.

కార్య‌క‌ర్త‌ల భుజాల‌పై వైసీపీ తుపాకులు.. !

వైసీపీ అధినేత జ‌గ‌న్ వైఖ‌రిపై సొంత పార్టీలోనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. వాస్త‌వానికి పార్టీ ఓట‌మి నుంచే ఇలాంటి విమ‌ర్శ‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే

By:  Tupaki Desk   |   12 Dec 2024 8:30 PM GMT
కార్య‌క‌ర్త‌ల భుజాల‌పై వైసీపీ తుపాకులు.. !
X

వైసీపీ అధినేత జ‌గ‌న్ వైఖ‌రిపై సొంత పార్టీలోనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. వాస్త‌వానికి పార్టీ ఓట‌మి నుంచే ఇలాంటి విమ‌ర్శ‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఇప్పుడు క్షేత్ర‌స్థాయిలో మ‌రింత ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి. దీనికి కార‌ణం.. కార్య‌క‌ర్త‌ల‌ను ముందు పెట్టి.. తాను మాత్రం సేఫ్ కావ‌డ‌మేన‌ని చెబుతు న్నారు. ఈ నెల 13(శుక్ర‌వారం) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌ల‌కు వైసీపీ పిలుపునిచ్చింది. రైతుల ఇన్ పుట్ స‌బ్జిడీ, విద్యార్థుల‌కు ఫీజుల రీయింబ‌ర్స్ మెంటుపై నిర‌స‌న తెల‌పాల‌ని నిర్ణ‌యించింది.

వీటికితోడు.. విద్యుత్ చార్జీల పెంపును కూడా.. నిర‌స‌న‌లో భాగం చేసుకోవాల‌ని జ‌గ‌న్ సూచించారు. దీనికి సంబంధించి క్షేత్ర‌స్థాయిలో కార్య‌క్ర‌మాల‌ను స‌క్సెస్ చేసే బాధ్య‌త‌ల‌ను జిల్లాల‌కు ఇంచార్జ్‌లుగా ఉన్న‌వారికి అప్ప‌గించారు. ఈ క్ర‌మంలో ఇంచార్జ్‌లు కొంద‌రు స్పందించారు. మ‌రికొంద‌రు మౌనంగా ఉన్నారు. బొత్స స‌త్య‌నారాయ‌ణ తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల నాయ‌కుల‌ను క‌దిలించే ప్ర‌య‌త్నం చేశారు. ఇక‌, సాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు.. ఢిల్లీ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీకి చేరుకోలేదు.

మ‌రోవైపు.. తాడేప‌ల్లి ప్యాల‌స్‌లో ఉండే.. ముఖ్య నాయ‌కులు కూడా నిర‌స‌న‌లపై ఆస‌క్తి చూప‌డం లేదు. ఏదో కేవ‌లం ప్ర‌క‌ట‌న‌ల‌కు మాత్ర‌మే ప‌రిమితం అవుతున్నారు. మొత్తంగా చూస్తే.. వైసీపీ ప్ర‌తిప‌క్షంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. చేప‌డుతున్న తొలి ప్ర‌జా స‌మ‌రంలో ముఖ్య నాయ‌కులు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. పైగా.. ఉన్న‌వారు కూడా పెద్ద‌గా స్పందించ‌డం లేదు. అంతేకాదు.. అధినేత జ‌గ‌న్ అసలు.. తాడేప‌ల్లి ప్యాలెస్‌ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే ఉద్దేశం కూడా లేదు.

ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న కార్య‌క‌ర్త‌లు.. మా భుజాల‌పై తుపాకులు పెట్టి కాల్చుతారా? అనే ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. ముఖ్య నేత‌లు క‌ద‌ల‌కుండా.. త‌మ‌ను రంగంలోకి దింపి.. నిర‌స‌న‌లు చేప‌ట్ట‌డం ద్వారా.. పార్టీ సాధించేది ఏమీ ఉండ‌ద‌న్న‌ది వారి అభిప్రాయంగా ఉంది. అంతేకాదు.. ఇప్పుడు కాలు క‌దిపితే.. కేసులు న‌మోదు కావ‌డం ఖాయ‌మ‌ని.. వ‌చ్చే నాలుగున్న‌రేళ్లు తాము ఇబ్బందులు ప‌డ‌తామ‌ని కూడా.. చెబుతున్నారు. ఈ క్ర‌మంలో అన్ని జిల్లాల నుంచి కార్య‌క‌ర్త‌ల‌ది ఒకే మాట‌గా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.