అంతర్గత శత్రువులను కనిపెట్టలేక పోయావా జగన్..!
వైసీపీలో కొందరు నాయకులు జగన్ పై పగబెట్టినట్టు వ్యవహరిస్తున్నారు.
By: Tupaki Desk | 31 Aug 2024 3:51 AM GMTవైసీపీలో కొందరు నాయకులు జగన్ పై పగబెట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా రాజ్యసభకు రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ చెప్పుకొచ్చారు. తనకు సీటు ఇవ్వనప్పుడే తను పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసేసుకున్నానని ఆయన వ్యాఖ్యానించారు. అంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే చాలామంది నాయకులు పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు అనేది ఈయన మాటలను బట్టి తెలుస్తోంది. బహుశా ఇది కూడా ఎన్నికల్లో ఓటమికి దోహదపడి ఉంటుందనేది ఇప్పుడు వైసీపీ నాయకులు వేస్తున్న అంచనా.
ఎందుకంటే శత్రువును కనిపెట్టడం ఈజీనే. అయితే అది ప్రత్యర్థి పార్టీలో ఉంటే మాత్రమే సాధ్యమవు తుంది. కానీ స్వపక్షంలోనే ఉండి అంతర్గత శత్రువులుగా మారిన వ్యక్తులను గుర్తించ టం అనేది సాధ్యమ య్యే పని కాదు. ఈ విషయాన్ని రాజకీయ నాయకులే కాదు పార్టీలు కూడా గుర్తించటం చాలా కష్టంగా ఉంటుంది. పార్టీలో చాలా సౌమ్యంగా ఉంటూ పార్టీ అధినాయకులకు మేలు చేస్తున్నట్టుగా నటించే నాయకులు తమ కోరికలు తీరకపోవడంతో డిమాండ్లు నెరవేరకపోవడంతో అంతర్గత శత్రువులుగా మారడం అనేది ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామం.
ఇదే వైసీపీలో కూడా జరిగినట్టు తాజాగా పార్టీ అంచనా వేస్తోంది. టికెట్లు రాని లేదా మార్పులు జరిగిన 85 నియోజకవర్గాల్లో కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా గెలవకపోవడం ఇప్పుడు దీనికి దన్నుగా మారింది. ఎందుకంటే అనేక సమీకరణలు, అనేక లెక్కలు వేసుకుని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మార్పులకు శ్రీకారం చుట్టారు. అయితే ఈ మార్పులను కొందరు జీర్ణించుకోలేకపోయారు. ఇది సహజం. కానీ పార్టీ ఎందుకు ఇలా చేసింది అనేది ఆలోచించుకుంటే అది వారికి మేలు చేసి ఉండేది. పార్టీకి కూడా మేలు జరిగేది.
కానీ, అలా కాకుండా పగబట్టినట్టు వ్యవహరించి అంతర్గత శత్రువులుగా మారి తమ వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీని బలి చేశారు అనేది ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్క మోపిదేవి వెంకటరమణ ఈ విషయంలో బయటపడినా ఇప్పుడు మిగిలిన నియోజకవర్గాలపై పార్టీ అంతర్మథనం చేస్తోంది. ఉదాహరణకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మద్దాలి గిరి సైలెంట్ గా ఉండిపోవడం, చిలకలూరిపేటలో పార్టీ తరఫున ముందు టికెట్ తెచ్చుకుని తర్వాత టికెట్టు పోగొట్టుకున్న నాయకుడు శత్రువుగా మారడం, పత్తిపాడులోనూ అంతర్గత కుమ్ములాటలు ఇట్లా అనేక చోట్ల జరిగిన నాయకుల అంతర్గత శత్రుత్వంతో పార్టీ భారీగా దెబ్బతింది అనేది ఇప్పుడు వేస్తున్న ప్రధాన అంచనా. ఇప్పుడు దీన్ని సరిదిద్దే ప్రయత్నం చేసినా నాయకులు ఎంతవరకు మారతారు? ఎంతమంది జగన్‌తో నడిచి ముందుకు సాగుతారు అనేది చూడాలి.