రాజీనామాలు సరే.. ఓకే కావడమే బిగ్ టెస్ట్ ..!
తమ తమ పదవులకు రాజీనామాలు చేసి మరీ పార్టీలు మారాలని భావించిన వారికి వారి కోరిక ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు.
By: Tupaki Desk | 27 Nov 2024 10:30 AM GMTప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయం ఓ రకంగా మారింది. తమ తమ పదవులకు రాజీనామాలు చేసి మరీ పార్టీలు మారాలని భావించిన వారికి వారి కోరిక ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. చాలా మంది నాయకులు వైసీపీ నుంచి బయటకు వచ్చారు. తమకు ఉన్న పదవులను కూడా వదులుకున్నారు. అయితే.. వీరిలో రాజ్యసభ సభ్యులకు వచ్చినంత ఊరట.. శాసన మండలి సభ్యులకు మాత్రం రావడం లేదు. రాజ్యసభ సభ్యులుగా ఉన్న వైసీపీ నాయకులు ముగ్గురు తమ పదవులు వదులుకున్నారు.
వీరిలో మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్య ఉన్నారు. వీరు తమ పదవులకు రాజీనామాలు చేయడమే ఆలస్యం అన్నట్టుగా రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ వీటిని ఆమోదించారు. ఆ వెంటనే తాగాజా ఆయా పదవులకు ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేసింది. నిజానికి రాజ్యసభ చైర్మన్ కనుక ఈ రాజీనామాలను తొక్కిపెట్టి ఉంటే.. షెడ్యూల్ వచ్చేది కాదు. కానీ, ఇది కేంద్రంతో ముడిపడిన వ్యవహారం కావడంతో జగదీప్ ధన్‌ఖడ్ నిర్ణయం చాలా వేగంగా తీసుకున్నారు.
ఇక రాష్ట్రం విషయానికి వస్తే.. శాసన మండలి సభ్యులుగా ఉన్న పోతుల సునీత... బల్లి కల్యాణ్ చక్రవర్తి, జయమంగళ వెంకట రమణ వంటివారు.. కూడా తమ పదవులకు రాజీనామా లు చేశారు. వీరు త్వరలోనే టీడీపీ లేదా.. జనసేనలోకి చేరాలని అనుకుంటున్నారు. కానీ, వీరు చేసిన రాజీనామాలకు ఇప్పటి వరకు మోక్షం లభించలేదు. ఈ రాజీనామాలను శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు ఆమోదించాల్సి ఉంటుంది. కానీ, ఆయన మాత్రం వీటిని పట్టించుకోవడం లేదు.
కనీసం.. రాజీనామా పత్రాలను కూడా ఆయన పరిశీలించలేదని తెలిసింది. దీంతో రాజీనామాలు చేసిన వారు వెయిటింగ్‌లో ఉన్నారు. అందరికన్నా ముందు రాజీనామా చేసిన పోతుల సునీత, బల్లి కల్యాణ్ చక్రవర్తి రాజీనామాలనే ఇప్పటి వరకు ఆమోదించలేదు. ఇక, ఇటీవల రాజీనామా చేసిన జయమంగళ వ్యవహారం మరింత సంక్లిష్టంగా మారింది. వీరి రాజీనామాలను ఇంత సమయంలోగా అనుమతించాలని ఎలాంటి నిబంధన లేకపోవడం.. చైర్మన్ స్వేచ్ఛ ప్రకారం వ్యవహరించే వెసులు బాటు ఉన్ననేపథ్యంలో వీరంతా వెయిటింగులోనే ఉండడం గమనార్హం.