Begin typing your search above and press return to search.

పేటలో వారంతా అవుట్... వైసీపీ చేస్తున్నది కరెక్టేనా ?

రాజకీయ పార్టీ నిర్ణయాలు ఎపుడూ మార్చుకుంటూ ఉండాలి. ఇదులో తప్పు ఏమీ లేదు. ఎందుకంటే రాజకీయం అంటే జనాలతో కలసి చేస్తున్నది.

By:  Tupaki Desk   |   22 March 2025 5:00 AM IST
YSRCP Leadership Issues
X

రాజకీయ పార్టీ నిర్ణయాలు ఎపుడూ మార్చుకుంటూ ఉండాలి. ఇదులో తప్పు ఏమీ లేదు. ఎందుకంటే రాజకీయం అంటే జనాలతో కలసి చేస్తున్నది. వారే కేంద్ర బిందువుగా సాగుతుంది. అందువల్ల రాజకీయాల్లో అందరికీ కలుపుకుని పోవాలంటే నిర్ణయాలు మార్చుకోవచ్చు. అధినాయకత్వాలు ఈ విషయంలో ఉదారంగా ఉండాలి.

లేకపోతే ఇబ్బందులు వస్తాయి. వైసీపీ మాత్రం ఈ విషయంలో తీరే వేరు అన్నట్లుగా వ్యవహరిస్తోంది అని అంటున్నారు. పల్నాడు జిల్లాలో కీలకమైన నియోజకవర్గం చిలకలూరిపేట. ఇక్కడ ఆది నుంచి టీడీపీ బలంగా ఉంది. టీడీపీ పుట్టాక మొత్తం 10 సార్లు ఎన్నికలు జరిగితే అందులో అయిదు సార్లు టీడీపీ గెలిచింది. ఈ అయిదింటా మూడు సార్లు ప్రత్తిపాటి పుల్లారావే విజేత.

మరి అంత బలంగా ఉన్న చోట వైసీపీ ఎంతలా వ్యవహరించాలి అన్నది చర్చగా ఉంది. ఇక మర్రి రాజశేఖర్ 2004లో సొంతంగా పోటీ చేసి ఇండిపెండెంట్ గా గెలిచి వచ్చిన వారు. ఆనక కాంగ్రెస్ లో చేరి 2009లో పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. అయినా ఆయనకంటూ ఓటు బ్యాంకు ఉంది.

అయితే 2019లో ఆయనను పక్కన పెట్టి టీడీపీ నుంచి వచ్చిన విడదల రజనీకి వైసీపీ టికెట్ ఇచ్చింది. బీసీ కార్డుతో వైసీపీలో ఆమె టికెట్ సాధించారు. వైసీపీ వేవ్ లో ఆమె గెలిచారు. నిజానికి 2019లో మర్రి రాజశేఖర్ కి టికెట్ ఇచ్చినా గెలుస్తారు అని అంటారు.

అయితే మర్రికి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి మంత్రిని చేస్తామని చెప్పి వదిలేశారు అని ఆయన వర్గం అంటోంది. దాంతో ఆయనకు ఎమ్మెల్సీ దక్కినా వైసీపీలో చిలకలూరిపేట ఎప్పటికీ దక్కదని భావించే పార్టీని వీడారు. ఇక లావు శ్రీకృష్ణదేవరాయలు అనే యువ నేత 2019లో వైసీపీ నుంచి నరసరావుపేట ఎంపీగా నెగ్గారు. రాజకీయంగా పరపతి కలిగిన వారు మంచి నేత అయిన ఆయనను కూడా పార్టీ దూరం చేసుకుంది.

గత ఐదేళ్లలో మంత్రిగా ఎమ్మెల్యేగా విడదల రజనీ సాగించిన వర్గ పోరు రాజకీయాల వల్లనే కీలక నేతలు ఇలా పార్టీని వీడిపోయారు అని అంటున్నారు. నిజానికి లావు వైసీపీ తరఫున నరసరావుపేట నుంచి 2024లో పోటీ చేసి ఉంటే వైసీపీకి మరిన్ని అసెంబ్లీ సీట్లు వచ్చేవి అన్న చర్చ ఉంది.

ఏది ఏమైనా వైసీపీ మాత్రం రజనీని టికెట్ ఇచ్చింది ఆమెను గుంటూరు వెస్ట్ కి పంపించినా కూడా మర్రికి 2024లో టికెట్ ఇవ్వకుండా మేయర్ కావటి మనోహర్ నాయుడుకు ఇచ్చింది. దీంతోనే మర్రికి పొమ్మనకుండా పొగ పెట్టినట్లు అయింది అని అంటున్నారు. బలమైన సామాజిక వర్గానిని చెందిన మర్రి వైఎస్సార్ ఫ్యామిలీకి సన్నిహితంగా ఉంటూ వచ్చారు.

చివరికి ఆయనను దూరం చేసుకోవడం అంటే వైసీపీ తీసుకుంటున్న నిర్ణయాలు చేస్తున్న రాజకీయం కరెక్టేనా అని అంటున్నారు. మంచి లీడర్స్ ని పార్టీ వదులుకుంటోందని అంటున్నారు. ఇలా ఆమె కోసం పార్టీలో ఎవరు లేకపోయినా ఫర్వాలేదు అన్న వైఖరిని ఎందుకు ఎంచుకుంది అని ప్రశ్నిస్తున్నారు.

పార్టీలో ముందు నుంచి ఉన్న వారిని కాదని ఆమెకు పెద్ద పీట వేయడం వల్ల పేటలో వైసీపీ ఇబ్బందుల పాలు అవుతోందని అంటున్నారు. ఇక ఇంతా చేసినా రేపటి రోజున వైసీపీలో నిఖార్సుగా నిలబడే వారు ఎవరు ఉంటారు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. నిబద్ధత కలిగిన నేతలను వదులుకుంటూ వైసీపీ స్వయంకృతాపరాధానికి పాల్పడుతోందని అని అంటున్నారు. మరి వైసీపీ వీటి నుంచి ఏమైనా తెలుసుకుని ముందు ముందు అయినా సరైన అడుగులు వేస్తుందా అన్న చర్చ సాగుతోంది.