Begin typing your search above and press return to search.

వైసీపీలో సభ్యత్వ నమోదు ఎపుడు ?

ప్రతీ రాజకీయ పార్టీ ఒక నిర్దిష్ట కాల పరిమితిలోగా సభ్యత్వ నమోదు చేపడుతుంది. అంతే కాదు కొత్త వారిని ఆకర్షించి సభ్యత్వం ఇస్తుంది.

By:  Tupaki Desk   |   3 March 2025 6:00 AM IST
వైసీపీలో సభ్యత్వ నమోదు ఎపుడు ?
X

ప్రతీ రాజకీయ పార్టీ ఒక నిర్దిష్ట కాల పరిమితిలోగా సభ్యత్వ నమోదు చేపడుతుంది. అంతే కాదు కొత్త వారిని ఆకర్షించి సభ్యత్వం ఇస్తుంది. అలా గ్రాస్ రూట్ లెవెల్ వరకూ ప్రతీ వర్గంతో మమేకం అవుతుంది. పార్టీ ఎక్కడికక్కడ బలోపేతం కావాలంటే ఇది తప్పనిసరి అని అంటారు.

అయితే ఏపీలో చూస్తే టీడీపీ జనసేన బీజేపీ సభ్యత్వ నమోదు పేరుతో ఆయా పార్టీల పండుగలను పెద్ద ఎత్తున నిర్వహించాయి. టీడీపీ అయితే కోటికి పైగా సభ్యత్వాలు నమోదు చేయించి ఒక ప్రాంతీయ పార్టీకి ఇంతటి సభ్యత్వం దేశంలో ఎక్కడా లేదని చాటింది. ఏపీలో దాదాపుగా నాలుగు కోట్ల మంది ఓటర్లు ఉంటే ప్రతీ నలుగురిలో ఒకరిని టీడీపీ తన సభ్యుడిగా చేసుకుంది.

అలాగే జనసేన కూడా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహపూరితంగా నిర్వహించింది. దానిని పొడిగించుకుంటూ వెళ్ళింది అంటే క్యాడర్ నుంచి వచ్చిన అభ్యర్ధనలే అని వేరేగా చెప్పాల్సింది లేదు. అదే విధంగా బీజేపీ సైతం ఒక టార్గెట్ పెట్టుకుని సభ్యత్వాలను చేర్పించింది. కాంగ్రెస్ కమ్యూనిస్టులు కూడా ఈ విషయంలో ముందున్నాయి.

కానీ వైసీపీలో మాత్రం సభ్యత్వ నమోదు అన్న దాని మీద ఫోకస్ పెట్టడం లేదని క్యాడర్ నుంచి వస్తోంది. ఏ పార్టీ అయినా ముందుగా సభ్యత్వ నమోదు చేపట్టాలి. ఆ తరువాత బూత్ లెవెల్ నుంచి పార్టీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుంటూ వెళ్ళాలి. ఆఖరుకు రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక లేదా జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది.

వైసీపీలో అయితే అధినాయకత్వం తానే నియామకాలను చేపడుతోంది. నామినేట్ చేస్తోంది. పార్టీ పదవులకు నామినేట్ కాబడిన వారే కీలక స్థానాల్లో ఉండి పనిచేస్తున్నారు. దాని వల్ల క్యాడర్ కి భాగస్వామ్యం లేకుండా పోతోంది అని అంటున్నారు.

పార్టీ క్యాడర్ ని కూడా కలుపుకుంటేనే పార్టీ ముందుకు సాగుతుందని సూచిస్తున్నారు. మరో వైపు చూస్తే మార్చి 12న వైసీపీ ఆవిర్భావ దినోత్సవం ఉంది. 2011 మార్చి 12న ఆ పార్టీ ఏర్పాటు అయింది. ఈ ఏడాదితో వైసీపీకి 14 ఏళ్ళు పూర్తి అయి 15వ ఏట అడుగుపెడుతుంది.

మరి పార్టీ ఆవిర్భావ దినోత్సవం అన్నది ఈసారి మామూలుగా జరుపుతారా లేక ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అన్నది తెలియడంలేదు. మరో వైపు చూస్తే జనసేన ఈ నెల 14న ప్లీనరీని ఆవిర్భావ వేడుకల సందర్భంగా నిర్వహిస్తోంది. దాని కోసం రెండు నెలల క్రితమే కమిటీలని వేసి సన్నాహాలు చేసింది.

దీనిని బట్టి చూస్తే వైసీపీ ఆవిర్భావ వేడుకలు సింపుల్ గా నిర్వహిస్తారనే అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీ ఉమ్మడి ఏపీలో విభజన ఏపీలో తనదైన రాజకీయం చేస్తూ ముందుకు సాగింది. మరి ఆ పార్టీ ఇపుడు భారీ ఓటమి చెందింది. దాంతో పార్టీని పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలి అంటే కనుక కచ్చితంగా సభ్యత్వ నమోదు చేపట్టాలని అపుడే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కదలిక వస్తుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.