Begin typing your search above and press return to search.

వైసీపీకి షాకుల మీద షాకులు.. ఇంకో ఇద్దరు!

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాక వైసీపీకి దెబ్బలు దెబ్బలు తగులుతున్నాయి.

By:  Tupaki Desk   |   30 Aug 2024 11:26 AM GMT
వైసీపీకి షాకుల మీద షాకులు.. ఇంకో ఇద్దరు!
X

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాక వైసీపీకి దెబ్బలు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎంపీలు, మేయర్లు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు, బీద మస్తాన్‌ రావు రాజీనామాలు చేసి 24 గంటలు గడవక ముందే ఇద్దరు ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా ప్రకటించారు.

ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్‌ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ తమ పదవులకు రాజీనామా చేశారు. వారు తమ రాజీనామాలను శాసనమండలి చైర్మన్‌ కొయ్య మోషేన్‌ రాజుకు అందజేశారు. ఎమ్మెల్సీ పదవులకే కాకుండా వైసీపీకి కూడా రాజీనామా సమర్పించారు. బల్లి కళ్యాణ్‌ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ ఇద్దరూ టీడీపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.

నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన మాజీ మంత్రి బల్లి దుర్గాప్రసాదరావు కుమారుడే బల్లి కళ్యాణ్‌ చక్రవర్తి. 2019లో తిరుపతి నుంచి వైసీపీ ఎంపీగా విజయం సాధించిన బల్లి దుర్గా ప్రసాదరావు మృతి చెందడంతో ఆయన కుమారుడు కళ్యాణ్‌ చక్రవర్తికి వైఎస్‌ జగన్‌ ఎమ్మెల్సీగా చాన్సు ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీగా ఉన్నారు.

బల్లి కళ్యాణ్‌ చక్రవర్తి తండ్రి బల్లి దుర్గాప్రసాదరావు నెల్లూరు జిల్లా గూడూరు నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 1996–98 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో ప్రాథమిక విద్యా శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 2020లో కోవిడ్‌ తో మృత్యువాత పడ్డారు.

తన తండ్రి మరణించడంతో తిరుపతి ఎంపీ సీటును బల్లి కళ్యాణ్‌ చక్రవర్తి ఆశించారు. అయితే జగన్‌ ఆ సీటును మద్దిల గురుమూర్తికి ఇచ్చారు. బల్లి కళ్యాణ్‌ చక్రవర్తికి ఎమ్మెల్సీ ఆఫర్‌ చేశారు. దీంతో బల్లి కళ్యాణ్‌ దాంతో సర్దుకుపోయారు. 2027 వరకు ఎమ్మెల్సీగా ఆయనకు పదవీకాలం ఉన్నా వైసీపీకి రాజీనామా చేయడం విశేషం.

ఇక కర్రి పద్మశ్రీ.. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీగా ఉన్నారు. జాతీయ మత్య్సకార మహిళా అధ్యక్షురాలుగా, రాష్ట్ర మత్స్యకార సంక్షేమ సమితి మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు. ఈ క్రమంలో వైసీపీలో చేరిన ఆమె మార్చి 2023లో గవర్నర్‌ కోటా నుంచి వైసీపీ ఎమ్మెల్సీగా నామినేట్‌ అయ్యారు. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.