జగన్ కి ముఖం చాటేసిన డియరెస్ట్ ఎమ్మెల్సీ...రూట్ టీడీపీయే ?
వైసీపీ నుంచి వలసలు కూటమి వైపుగా కొనసాగుతున్నాయి. ఓడిన వారు ఎటూ సైలెంట్ అవుతున్నారు.
By: Tupaki Desk | 13 Feb 2025 3:40 AM GMTవైసీపీ నుంచి వలసలు కూటమి వైపుగా కొనసాగుతున్నాయి. ఓడిన వారు ఎటూ సైలెంట్ అవుతున్నారు. చాన్స్ దొరికితే జెండా మార్చేస్తున్నారు. మరి కొందరు వైసీపీకి రాజీనామా చేసి న్యూట్రల్ గా ఉంటున్నారు. మరో వైపు చూస్తే అటు రాజ్యసభ ఇటు శాసనమండలి రెండింటిలోనూ జంపింగ్స్ కొనసాగుతున్నాయి.
ఈ క్రమంలో వినిపిస్తున్న కొత్త పేరు మర్రి రాజశేఖర్. ఈయన గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు. జగన్ కి డియరెస్ట్ లీడర్ గా గుర్తింపు పొందారు. జగన్ ఆయనకు 2014లో చిలకలూరిపేట టికెట్ ని ఇచ్చారు. అయితే ఆయన ఓటమి పాలు అయ్యాక 2019 ముందు పార్టీలో చేరిన విడదల రజనీకి చిలకలూరిపేట టికెట్ ని ఇచ్చి మర్రి రాజశేఖర్ ని పక్కన పెట్టారు.
అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే రాజశేఖర్ కి మంత్రి పదవి ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. కానీ అది జరగలేదు. కానీ విడదల రజనీకి మాత్రం మంత్రి పదవి ఇచ్చారు.ఇక ఆయనకు 2024 ఎన్నికల ముందు ఎమ్మెల్సీ పదవి మాత్రమే దక్కింది. మరో వైపు చూస్తే 2024 ఎన్నికలలో అప్పటి మంత్రి విడదల రజనీని గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి బదిలీ చేసినా చిలకలూరిపేట టికెట్ ని మర్రికి ఇవ్వలేదు. దాంతో ఆయన ఆనాడే తీవ్ర అసంతృప్తికి లోను అయ్యారు.
ఇక 2024 ఎన్నికలు ముగిసాక రజనీకి మళ్ళీ చిలకూరిపేట ఇంచార్జిగా బాధ్యతలు కట్టబెట్టారు. ఈ నియామకం జరిగినపుడు పార్టీలో సీనియర్ నేతగా, ఆ నియోజకవర్గానికి చెందిన వారుగా ఉన్న మర్రి రాజశేఖర్ ని కనీసంగా సంప్రదించలేదని ఆయన వర్గీయులు బాధపడ్డారు. రాజశేఖర్ కూడా అదే విధమైన ఆవేదనతో ఉన్నారు.
ఇక పార్టీలో తనకు ఎలాంటి ప్రోత్సాహం దక్కదని భావించిన ఆయన టీడీపీ వైపుగా అడుగులు వేస్తున్నారు అని గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. నరసరావుపేట టీడీపీ ఎంపీ లావు శ్రీ క్రిష్ణ దేవరాయలు ద్వారా ఆయన టీడీపీ పెద్దలకు టచ్ లోకి వచ్చారని ఆయన వైసీపీని వీడడం టీడీపీలో చేరడం తధ్యమని కూడా చర్చ సాగుతోంది.
ఈ క్రమంలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. జగన్ తాడేపల్లిలో నిర్వహించిన ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ నేతల సమీక్షా సమావేశానికి మర్రి రాజశేఖర్ డుమ్మా కొట్టారు. ఆ జిల్లా నుంచి మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున విడదల రజనీ రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డి మాజీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేష్ రెడ్డి వంటి వారు వచ్చినా మర్రి గైర్ హాజర్ కావడం చర్చనీయాంశం అయింది. జగన్ కి అత్యంత సన్నిహితుడిగా ఒకనాడు ముద్రపడిన మర్రి ఇలా ముఖం చాటేయడం అంటే ఆయన వైసీపీని వీడనున్నారు అన్న గట్టి సంకేతాలు ఇస్తున్నారు అని అంటున్నారు.
ఆయన ఈ నెలాఖరులోగా వైసీపీని వీడి టీడీపీ గూటికి చేరుకుంటారు అని అంటున్నారు. టీడీపీలో తనకు సముచితమైన గౌరవం స్థానం దక్కుతాయన్న భరోసాతోనే ఆయన సైకిలెక్కబోతున్నారు అని అంటున్నారు. మర్రి కనుక వైసీపీని వీడితే పార్టీ ఆరంభం నుంచి ఉన్న వారిలో మరో వికెట్ డౌన్ అయినట్లే అని అంటున్నారు.