అల్లు అర్జున్ ని పరామర్శించిన వైసీపీ ఎమ్మెల్సీ... కీలక వ్యాఖ్యలు!
సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 16 Dec 2024 4:19 AM GMTసంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఇక.. బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఒక రాత్రి జైల్లో ఉండాల్సి రావడం మరింత చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఇక గత శనివారం ఉదయం జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ ను తన నివాసంలో పలువురు ప్రముఖులు పరామర్శించారు.
ఇందులో ప్రధానంగా సినీ ప్రముఖులు ఉన్నారు. దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, బంధువులు, కుటుంబ సభ్యుల పరామర్శలతో శనివారం రోజంతా అల్లు అర్జున్ బిజీగా మారిపోయారు. ఈ నేపథ్యంలో ఆదివారం అల్లు అర్జున్ ను తన నివాసంలో కలిసి తన సంఘీభావం ప్రకటించారు వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు.
అవును... సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించిన కేసులో అరెస్టై విడుదలైన అల్లు అర్జున్ ని తన నివాసంలో పలువురు ప్రముఖులు కలిశారు. ఈ నేపథ్యంలో ఆదివారం.. అల్లు అర్జున్ ను వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కలిసి తన సంఘీభావం ప్రకటించారు. దీంతో... అల్లు అర్జున్ కు బహిరంగంగా సంఘీభావం ప్రకటించిన వైసీపీ నేతల జాబితాలో మరో పేరు యాడయ్యింది!
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన తోట త్రిమూర్తులు... జరిగిన ఘటన చాలా దురదృష్టకరమని అన్నారు. జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న నటుడి పట్ల ఇలాంటి ప్రవర్తన కరెక్ట్ కాదని త్రిమూర్తులు అభిప్రాయపడ్డారు.
కాగా... అల్లు అర్జున్ అరెస్టును మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఖండించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా... వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. అల్లు అర్జున్ అరెస్టును ఖండించారు. దీంతో... అల్లు అర్జున్ కు వైసీపీ నుంచి పూర్తిస్థాయిలో సంఘీభావం ప్రకటించారనే చర్చ తెరపైకి వచ్చింది.