రామచంద్రాపురంలో బోసు చిచ్చు ?
తూర్పుగోదావరి జిల్లాలోని కీలకమైన నియోజకవర్గాల్లో రామచంద్రాపురం కూడా ఒకటి.
By: Tupaki Desk | 16 July 2023 5:35 AM GMTతూర్పుగోదావరి జిల్లాలోని కీలకమైన నియోజకవర్గాల్లో రామచంద్రాపురం కూడా ఒకటి. ఇక్కడ కీలకమైన నేత పిల్లి సుభాష్ చంద్రబోస్. బీసీల్లోని శెట్టి బలిజ సామాజికవర్గానికి చెందిన బోసు చాలా సీనియర్ అనే చెప్పాలి. అయితే సొంతంగా పోటీచేసి గెలిచేంత సీన్ బోసుకు ఎప్పుడూ లేదు. బోసుకు మొదటినుండి ఉన్నది ఏమిటంటే వైఎస్ కుటుంబంపై అభిమానమే. అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కు బలమైన మద్దతుదారుగా ఉండేవారు. ఇప్పుడు అంతేస్ధాయిలో జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారు. ఆ లాయల్టీయే బోసుకు పదవులను తెచ్చిపెడుతోంది.
ఇలాంటి బోసు ఇపుడు రాజ్యసభ ఎంపీ. 2019లో మండపేటలో పోటీచేసి ఓడిపోయారు. మొదటినుండి రామచంద్రాపురమే అయినా మొన్న మాత్రం సీట్ల సర్దుబాటు కుదరక మండపేట నుండి పోటీచేసి ఓడిపోయారు. ఓడిపోయినా మంత్రిని చేసి ఎంఎల్సీని చేశారు. వెంటనే రాజ్యసభ్య పదవిని ఇచ్చారు. జగన్ ఇంత ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ సొంత నియోజకవర్గం రామచంద్రాపురంలో చిచ్చుకు రెడీ అయిపోయారు. ఈమధ్యనే జరిగిన పార్టీ నేతల సమావేశంలో ఉభయగోదావరి జిల్లాల ఇన్చార్జి మిథున్ రెడ్డి మాట్లాడుతు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణే రాబోయే ఎన్నికల్లో పోటీచేయబోతున్నట్లు ప్రకటించారు.
ఇది జరిగిన రెండు రోజులకే బోసు తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో బోసు రెండో కొడుకు సూర్యప్రకాష్ పోటీలోకి దిగబోతున్నట్లు మద్దతుదారులు ప్రకటించారు. దాంతో పార్టీలో అయోమయం మొదలైపోయింది. పోటీలోకి దిగబోయేది మంత్రి చెల్లుబోయినా లేకపోతే బోసు కొడుకు ప్రకాషా అన్నది అర్ధంకావటంలేదు.
మద్దతుదారులు ప్రకటించినట్లుగానే నియోజకవర్గంలో ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. తాజా పరిణామాల్లో తన కొడుక్కి బోసు టికెట్ సాధించుకుంటారా లేదా అన్నది ఆసక్తిగా మారిపోయింది. చెల్లుబోయినే పోటీచేస్తారని ఎంపీ ప్రకటించారంటే అది జగన్మోహన్ రెడ్డి అనుమతితోనే జరిగుంటుంది. మరి ఎంపీ ప్రకటించిన తర్వాత కూడా బోసు మద్దతుదారులతో సమావేశం పెట్టడం, వాళ్ళతోనే కొడుక్కి టికెట్ అని డిమాండ్ చేయించటం ఏమిటో అర్ధంకావటంలేదు. బోసు నియోజకవర్గంలోచిచ్చు పెడుతున్నారా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. మరి దీనికి బోసే సమాధానం చెప్పాలి.