Begin typing your search above and press return to search.

పోయిన వైసీపీ ఎంపీలు ఏమైనా మాస్ లీడర్స్ నా ?

మాస్ లీడర్లు ఎవరైనా పార్టీని వీడినపుడు అతి పెద్ద చర్చ అవుతుంది. వైసీపీలో చూస్తే కనుక వెళ్ళిన వారి గురించి వైసీపీ ఫ్యూచర్ గురించి చర్చ సాగుతోంది.

By:  Tupaki Desk   |   11 Feb 2025 6:21 AM GMT
పోయిన వైసీపీ ఎంపీలు ఏమైనా మాస్ లీడర్స్ నా ?
X

వైసీపీ నుంచి ఇప్పటికి నలుగురు ఎంపీలు బయటకు వెళ్ళారు. మరి కొందరు ఆ లిస్ట్ లో ఉన్నారు అని ప్రచారం సాగుతోంది. అయితే దీని వల్ల వైసీపీకి రాజకీయంగా దెబ్బ పడుతుందా అన్నది కూడా అంతా చర్చించుకుంటున్నారు. నిజానికి ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఇలాంటివి దెబ్బగానే చూస్తారు. కానీ అలా వెళ్తున్న వారు అంతా ఎవరు అన్నది కూడా చూస్తారు. మాస్ లీడర్లు ఎవరైనా పార్టీని వీడినపుడు అతి పెద్ద చర్చ అవుతుంది. వైసీపీలో చూస్తే కనుక వెళ్ళిన వారి గురించి వైసీపీ ఫ్యూచర్ గురించి చర్చ సాగుతోంది.

ఆర్ క్రిష్ణయ్య : ఇక ఒకసారి చూసుకుంటే వైసీపీ దారుణమైన ఓటమిని మూటకట్టుకుని ఎనిమిది నెలలు అయింది. ఈ మధ్యలో వైసీపీ నుంచి ఏకంగా నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీని వీడారు. వీరిలో ఆర్ క్రిష్ణయ్యది అసలు ఆంధ్రప్రదేశ్ కానే కాదు ఆయన తెలంగాణాకు చెందిన వారు. ఆయనను తీసుకుని వచ్చి వైసీపీ అధినేత జగన్ రాజ్యసభ సీటు ఇచ్చారు. కనీ ఆయన మాత్రం పార్టీ ఓడిపోగానే రాజీనామా చేశారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని బీసీ ఉద్యమాన్ని తిరిగి నిర్మిస్తాను అని చెప్పారు. అయితే చిత్రంగా ఆయన బీజేపీలో చేరడం ఆ పార్టీ తరఫున ఎంపీ కావడం అన్నది జరిగిపోయింది. ఈయన రాజీనామా వల్ల వైసీపీకి ఒక ఎంపీ సీటు తగ్గింది కానీ పార్టీ పరంగా రాజకీయంగా పెద్దగా నష్టం జరిగింది లేదనే అంటున్నారు. పైగా ఈయనకు ఓటు బ్యాంకు ఏపీలో లేదు అన్నది చెబుతున్న మాట.

బీద మస్తాన్ రావు : మరో వైపు చూస్తే బీద మస్తాన్ రావు అన్నాయన పార్టీని వీడిపోయారు. ఈయన బేసికల్ గా తెలుగుదేశం పార్టీకి చెందిన వారు అక్కడ రాజ్యసభ సీటు కోసం ఎంతగానో ప్రయత్నం చేశారు. కానీ దక్కలేదు. ఆయన వైసీపీలోకి వచ్చి సీటు సాధించారు. ఇలా పార్టీ ఓడగానే అలా వైసీపీని వీడి మళ్ళీ టీడీపీలో చేరారు. ఆయన కూడా పార్టీ నుంచి మళ్ళీ అదే సీటు సాధించారు. ఈయన కు పెద్దగా అనుచర గణం లేదు. ఓటు బ్యాంక్ లేదు. పైగా బిజినెస్ మాన్. ఈయన వల్ల వైసీపీకి రాజకీయంగా ఇబ్బందులు ఉంటాయా అంటే సీటు పోవడం వేరేది ఉండదని అంటున్నారు.

మోపిదేవి వెంకటరమణ : అలాగే మోపిదేవి వెంకట రమణ వైసీపీ రాజ్యసభ సీటు ఇస్తే పార్టీని వీడి వెళ్ళారు. ఈయన 2014, 2019లలో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఓడినా మంత్రిని చేశారు. ఆ మీదట పెద్దల సభకు పంపించారు. అయితే ఎలాంటి విశ్వాసం లేకుండా ఆయన పార్టీని వీడి వెళ్ళిపోయారు. వరసగా రెండు సార్లు ఓడిన ఆయనకు ప్రత్యేకంగా ఓటు బ్యాంకు ఏమి ఉంటుంది అన్నది కూడా చర్చగా ఉంది.

విజయసాయిరెడ్డి : ఇక వి విజయసాయిరెడ్డి. ఈయన వైసీపీలో మొత్తం తానే అన్నట్లుగా వ్యవహరించారు. నిజానికి ఈయన పొలిటీషియన్ కానే కాదు. వైఎస్సార్ కుటుంబానికి ఆడిటర్ కాబట్టి జగన్ తో పాటుగా జైలుకు వెళ్ళారు కాబట్టి ఆయనకు ఎక్కువ విలువ ఇచ్చారు జగన్. ఈయన తాను పొలిటికల్ గా బిగ్ ఫిగర్ అనుకుని బయటకు వెళ్ళారని అంటున్నారు. తాను వెళ్తే తన వెంట చాలా మంది వస్తారని భావించారని చెబుతారు. అయితే ఏ ఒక్కరూ వెళ్ళలేదు. దాంతో ఆయన పప్పులో కాలు వేశారు అని అంటున్నారు. కొద్ది రోజుల పాటు విజయసాయిరెడ్డి రాజీనామా గురించి చర్చ సాగింది. కానీ ఇపుడు ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదు అన్నది చర్చగా ఉంది.

ఇంకా పాత రాజకీయాలు అనుకుని జంపింగులు చేస్తే వారి వెనక ఎవరూ ఉండరని అంటున్నారు. ఇప్పుడున్న వారిలో చాలా మందికి వ్యక్తిగతంగా ఓటు బ్యాంక్ లేదు అన్నది విశ్లేషణ. ఎవరికైనా పార్టీ గుర్తు మాత్రమే గుర్తింపు ఇస్తోంది. వైసీపీకి చూస్తే 40 శాతం ఓటు బ్యాంక్ ఉంది. మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్లు కనుక పార్టీకి జత అయితే మరో అయిదారు శాతం ఓటింగ్ పెరుగుతుంది.

ఇక రాజకీయాల్లో నాయకులు వస్తూంటారు పోతూంటారు. అది చాలా సాధారణం అయిన విషయంగా మారిన నేపథ్యంలో ఈ జంపింగులను చూసి వైసీపీ జడుసుకునేది లేదనే అంటున్నారు. ఆ పార్టీ ప్రజా పోరాటాలు జనాలతో ఉన్న కనెక్షన్ ఇవే ఎపుడూ చూడాల్సి ఉంటుంది అన్నది ఒక విశ్లేషణగా ఉంది.