మూడు రాజధానుల మీద వైసీపీ లేటెస్ట్ స్టాండ్ ?
వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల కాన్సెప్ట్ ని తెర మీదకు తెచ్చింది.
By: Tupaki Desk | 7 Feb 2025 3:56 PM GMTవైసీపీ 2019లో అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల కాన్సెప్ట్ ని తెర మీదకు తెచ్చింది. అమరావతిని శాసన రాజధానిగా, విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా, కర్నూలుని న్యాయ రాజధానిగా చేస్తామని ప్రతిపాదించింది. అయితే అనేక న్యాయపరమైన అవాంతరాలు రావడంతో చట్టం చేసినా వెనక్కి తీసుకునే పరిస్థితి వచ్చింది.
ఇదిలా ఉంటే వైసీపీ 2024 లో భారీ ఓటమి మూటకట్టుకోవడం వెనక మూడు రాజధానుల అంశం కూడా ముఖ్య పాత్ర పోషించింది అని ప్రచారంలో ఉంది. వైసీపీ ఓటమి చెంది ఎనిమిది నెలలు గడచాయి. విధాన పరమైన అంశాల విషయంలో ఆ పార్టీ ఏమీ మాట్లాడటం లేదు.
చాలా కీలక అంశాల మీద వైసీపీ తన స్టాండ్ ఏంటి అన్నది చెప్పలేదు. అయితే ఇంకా తొలి ఏడాది కాబట్టి ఎన్నికలకు చాలా సమయం ఉంది కాబట్టి ముందు ముందు వైసీపీ వీటి అన్నింటి మీద తమ వైఖరి చెబుతుంది అని అంటున్నారు. ఇపుడు ఏపీలో చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతిని ఏకైక రాజధానిగా చేసుకుని అభివృద్ధి చేస్తోంది. వేల కోట్ల నిధులను కూడా తెచ్చి అమరావతిని ఒక రూపునకు తేవడానికి చూస్తోంది.
ఏపీ ప్రజలు కూడా తమకంటూ ఒక రాజధాని ఉండాలని భావిస్తున్నారు. ఈ విషయంలో ఇపుడు ఎవరు ఏమి చెప్పినా కొత్త నినాదం తీసుకున్నా అది బూమరాంగ్ అవుతుంది. మరి వైసీపీకి ఈ విషయాలు అన్నీ తెలియకుండా ఉంటాయా అని అంటున్నారు. పైగా రాజధాని అన్నది సెంటిమెంట్ కి సంబంధించినది కాబట్టి ఆలోచించి మాట్లాడుతుంది అని అంటున్నారు.
దీని మీద మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు అయితే మూడు రాజధానుల విషయంలో వైసీపీ స్టాండ్ ఏమిటి అన్నది త్వరలో చెబుతామని అంటున్నారు. ఆగండి తొందర ఎందుకు అని మీడియాతో ఆయన అంటున్నారు అంతే కాదు టీడీపీ కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని విషయంలో చేస్తున్న అతి ప్రచారాన్ని ఆయన తప్పు పడుతున్నారు.
అమరావతి రాజధాని కోసం 26 వేల కోట్ల రూపాయలు తెచ్చి అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. కానీ ప్రచారమే టాప్ లో ఉందని పనులు మాత్రం వేరేగా ఉన్నాయని విమర్శించారు. అంబటి వ్యాఖ్యలను బట్టి చూస్తూంటే అమరావతి రాజధాని నిర్మాణం సంబంధించి కూటమి నేతలు ప్రచారం చేసుకుంటున్నారు కానీ గ్రౌండ్ లెవెల్ లో చెప్పినట్లుగా జరగడం లేదని అంటున్నారు.
ఇక మూడు రాజధానుల విషయంలో వైసీపీ తన స్టాండ్ మార్చుకుంటుందా అన్న చర్చ కూడా సాగుతోంది. అందరూ కోరుకునే అమరావతి రాజధానికి జై కొడుతూనే ఇతర ప్రాంతాలలో అభివృద్ధి నినాదాన్ని అంచుకుంటుందా అన్న చర్చ సాగుతోంది. అంబటి త్వరలో అన్నారు కాబట్టి చూడాలి మరి వైసీపీ వైఖరి ఎలా ఉంటుందో.