వైసీపీకి కొత్త భయం.. సామూహిక అనర్హత వేటు?
వరుసగా అసెంబ్లీకి 60 రోజులు రాకపోతే అనర్హత వేటు పడుతుందని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు చేస్తున్న హెచ్చరికలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి.
By: Tupaki Desk | 5 Feb 2025 9:30 PM GMTవరుసగా అసెంబ్లీకి 60 రోజులు రాకపోతే అనర్హత వేటు పడుతుందని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు చేస్తున్న హెచ్చరికలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్ ను టార్గెట్ గా చేసుకుని రఘురామ ఈ వ్యాఖ్యలు చేసినా, అసెంబ్లీకి రాని మిగతా 10 మంది ఎమ్మెల్యేలపైనా అనర్హత వేటు పడటం ఖాయమని పొలిటికల్ ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. అయితే వచ్చే బడ్జెట్ సమావేశాలకు జగన్ వస్తారంటూ వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తుండటం కూడా ఈ అంశాన్ని మరో మలుపుతిప్పినట్లైందనే టాక్ వినిపిస్తోంది.
వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తే గాని తాను అసెంబ్లీకి రానని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. 2024 ఎన్నికల తర్వాత శాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం చేయడానికి సభలో అడుగుపెట్టిన జగన్, మళ్లీ అటువైపు చూడలేదు. ప్రతిపక్ష నేత హోదా ఇస్తే ప్రజా సమస్యలపై చర్చించడానికి సభానాయకుడితో సమానంగా తనకు సమయం వస్తుందని ఆయన వాదిస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే సాధారణ ఎమ్మెల్యేకు కేటాయించిన సమయమే ఇచ్చి తన గొంతు నొక్కుతారని ప్రచారం చేస్తున్నారు.
అయితే జగన్ అసెంబ్లీకి వస్తేనే కదా ఎంత సమయం కేటాయిస్తామనేది తెలుస్తుందని అధికార పక్షం ప్రశ్నిస్తోంది. అసెంబ్లీకి రాకుండా ఉంటే ఎలా అంటూ నిలదీస్తోంది. ఇదే సమయంలో వరుసగా 60 రోజులు సభకు డుమ్మా కొట్టే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయొచ్చని డిప్యూటీ స్పీకర్ రఘురామ ఇటీవల ప్రకటించారు. తన రాజకీయ విరోధి, వైసీపీ అధినేత జగన్ ను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ వ్యాఖ్య చేసినా ఆ పార్టీలోని మిగతా 10 మంది ఎమ్మెల్యేలకు ఇదే నిబంధన వర్తిస్తుందని టీడీపీ చెబుతోంది.
అయితే మాట తప్పను... మడమ తిప్పను అని నిత్యం డైలాగులు వేసే జగన్ అనర్హత వేటు వేస్తామంటే సభకు వచ్చేస్తారా? అనే చర్చ జరుగుతోంది. ఏదైనా కారణం చూపి తప్పుకుంటారా? లేక అనర్హత వేటు వేసినా సభకు వచ్చేది లేదని భీష్మించుకు కూర్చుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది. తనపై అనర్హత వేటు వేస్తే చూద్దామన్నట్లు ఆయన వ్యవహరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. జగన్ మొండివారని, ఆయన ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే మరి మారరని ఆయన గురించి బాగా తెలిసిన వారు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో ఆయన అసెంబ్లీకి వెళ్లే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయంటున్నారు. దీంతో డిప్యూటీ స్పీకర్ చెప్పినట్లు ప్రభుత్వం నిబంధనల ప్రకారం వ్యవహరిస్తే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టకుండానే మాజీలు అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
అయితే జగన్ ఒక్కరు అసెంబ్లీని బహిష్కరించి, మిగిలిన ఎమ్మెల్యేలు సభకు వెళ్లేలా అనుమతిస్తే ఈ గండం నుంచి తప్పించుకునే అవకాశాలు ఉన్నాయని సూచనలు వస్తున్నాయి. అయితే జగన్ తనతోపాటు ఎమ్మెల్యేలనూ అనర్హత బలి పీఠం ఎక్కిస్తారా? లేక తాను ఒంటరిగా ఎదుర్కొంటారా? అన్నది చర్చనీయాంశంగా మారుతోంది. ప్రస్తుతం వైసీపీ తరఫున 11 మంది ఎమ్మెల్యేలు గెలవగా, వీరిలో మాజీ సీఎం జగన్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఆయన సోదరుడు ద్వారకానాథరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధ, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, దర్శి ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గతంలో శాసనసభ్యులుగా పనిచేశారు. మిగతా ఐదుగురు తొలిసారి గెలిచిన వారే.. దీంతో ఎమ్మెల్యేల భవితవ్యం ఎలా ఉంటుందనేది ఉత్కంఠగా మారింది. ఎమ్మెల్యేలను చట్టం నుంచి రక్షించేలా జగన్ సడలింపునిస్తారా? లేక అందరూ ఒకే నిర్ణయంపై నిలబడాలని మొండికేస్తారా? అన్నది చూడాల్సివుందని అంటున్నారు.