Begin typing your search above and press return to search.

పవన్ కల్యాణ్ కు 2017 నుంచి గుర్తు చేస్తోన్న వైసీపీ!

కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభ "జయకేతనం"లో పవన్ కల్యాణ్ ప్రసంగం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   15 March 2025 12:28 PM IST
పవన్  కల్యాణ్ కు 2017 నుంచి గుర్తు చేస్తోన్న వైసీపీ!
X

కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభ "జయకేతనం"లో పవన్ కల్యాణ్ ప్రసంగం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రధానంగా హిందీ భాష పేరు చెప్పి తమిళనాడుపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు రేపుతున్నాయని అంటున్నారు. ఈ సమయంలో వైసీపీ తనదైన శైలిలో తగులుకుంది.

అవును... జనసేన 12వ ఆవిర్భావ సభ అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలిసారి జరుపుకుంటున్న ఆవిర్భావ వేడుక కావడంతో అశేష జనవాహిని ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్షలాదిగా తరలివచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన పవన్.. మధ్యలో 'హిందీ భాష - తమిళనాడు' అనే అంశంపైనా స్పందించారు.

ఈ సందర్భంగా తనదైన లాజిక్కులు లాగిన పవన్ కల్యాణ్... దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారంటూ తమిళులు మాట్లాడుతున్నారు.. అలాంటప్పుడు తమిళ సినిమాల్ని హిందీలో డబ్బింగ్ చేయొద్దు.. మీకు డబ్బులేమో ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్ గడ్ నుంచి కావాలా? హిందీ మాత్రం వద్దా? అని గట్టిగా ప్రశ్నించారు!

ఇదే సమయంలో... రూపాయి సింబల్ మార్చేసి తమిళ భాషలో పెట్టుకోవడం ఏమిటి? వివేకం, ఆలోచన ఉండోద్దా? అంటూ నిలదీశారు. ఈ సమయంలో... సోషల్ మీడియా వేదికగా 2017 నుంచి హిందీ భాష, దక్షిణాది ప్రాంతం మొదలైన అంశాలపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు, పెట్టిన పోస్టులు, షేర్ చేసిన పేపర్ కటింగులు వైసీపీ బయటకు లాగుతుంది!

వాస్తవానికి 2017 ఏప్రిల్ లో పవన్ కల్యాణ్ రెండు పేపర్ కటింగ్ లను తన ‘ఎక్స్’ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఇందులో ఒక ఆర్టికల్ శీర్షిక "దక్షిణాదిపై వివక్ష వీడేదెన్నడు?" కాగా... మరో దినపత్రికలోని ఆర్టికల్ శీర్షిక "హిందీ గో బ్యాక్!" అని. ఈ రెండింటినీ పవన్ కల్యాణ్ తన ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో పోస్ట్ చేసి, తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఇందులో భాగంగా... ఉత్తరాది రాజకీయ నాయకులు మన దేశంలోని వివిధ ప్రాంతాల వైవిధ్యాన్ని గుర్తించాలని, అర్థం చేసుకోవాలని, గౌరవించాలని పవన్ కల్యాణ్ అభిప్రాయపడగా.. "దక్షిణాధిపై వివక్ష వీడేదెన్నడు?" అనే ఆర్టికల్ కు "ఉత్తరాది - దక్షిణాది మధ్య అంతరం చెప్పేందుకు దీన్ని ఫార్వర్డ్ చేస్తున్నాన్ను" అంటూ రాసుకొచ్చారు.

ఇప్పుడు ఈ రెండు ట్వీట్లతో పాటు.. పలు సందర్భాల్లో హిందీకి వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు, ఆవేశపూరిత ప్రసంగాలకు సంబంధించిన వీడియోలను బయటకు లాగి.. షేర్ చేస్తున్నారు! నాడు అలా మాట్లాడి.. ఇప్పుడు బీజేపీ చంకనెక్కగానే హిందీపై ప్రేమ పుట్టుకొచ్చేసిందా పవన్? అని నిలదీస్తూ ఎద్దేవా చేస్తున్నారు!