వాలంటీర్ల కధ కంచికేనా...వైసీపీ స్టాండ్ చేంజ్ ?
ఆ మాటకు వస్తే దేశంలోనే తొలిసారి ఇలాంటి పౌర వ్యవస్థకు శ్రీకారం చుట్టింది కూడా వైసీపీ అంటే కూడా తప్పులేదు.
By: Tupaki Desk | 30 Dec 2024 6:30 AM GMTవాలంటీర్ల వ్యవస్థ అన్నది ఏపీకి పరిచయం చేసిందే వైసీపీ అన్నది తెలిసిందే. ఆ మాటకు వస్తే దేశంలోనే తొలిసారి ఇలాంటి పౌర వ్యవస్థకు శ్రీకారం చుట్టింది కూడా వైసీపీ అంటే కూడా తప్పులేదు. వైసీపీ తెచ్చిన ఈ వ్యవస్థ ఒకనాడు మన్ననలు పొందింది. ఇతర రాష్ట్రాల వారు ఆసక్తిగా చూసేలా చేసింది
ఎపుడైతే రాజకీయం ఇందులో ప్రవేశించిందో వైసీపీ నేతలు మంత్రులు పెద్దలు వాలంటీర్లు మావారే అని జబ్బలు చరచుకోవడం వల్లనే మొత్తం చెడిపోయింది. అక్కడ నుంచి వారిని వైసీపీ క్యాడర్ గా విపక్షం కూడా స్పష్టం చేస్తూ వచ్చింది. అదే నిజం అన్నట్లుగా అనంతర పరిణామాలూ జరిగాయి. చివరికి సొంత కార్యకర్తలను సైతం పక్కన పెట్టి వాలంటీర్లను నెత్తికి ఎక్కించుకున్న పాపానికి తగిన భారీ మూల్యాన్ని వైసీపీ పెద్దలు 2024 ఎన్నికల్లో చెల్లించారు.
మరో వైపు చూస్తే ఎన్నికల్లో వాలంటీర్లను ఉపయోగించుకోరాదు అన్న ఈసీ ఆదేశాల నేపథ్యంలో వారి చేత రాజీనామాలు చాలా మంది చేయించారు. అలా వారి సేవలను ఉపయోగించుకున్నారు. కానీ ఫలితం భారీగానే తేడా కొట్టింది.
ఈ నేపథ్యంలో ఎన్నికల అనంతరం వైసీపీ పెద్దల నుంచి మొదలెడితే చాలా మంది నోటి వెంట వాలంటీర్ల ప్రస్తావనే రావడంలేదు. దానికి కారణం వాలంటీర్లు అత్యధిక శాతం ఎన్నికల్లో కూటమికి అనుకూలంగా పనిచేశారు అన్న చర్చ రావడమే. దానిని బలమైన ఆధారాలు ఉన్నాయని అంటున్నారు.
కూటమి పెద్దలు ఎన్నికల్లో వాలంటీర్లకు ఇచ్చిన ఒక బ్రహ్మాండమైన హామీ బాగా గట్టిగా పనిచేసింది అని అంటున్నారు ఏకంగా పది వేల దాకా గౌరవ వేతనాన్ని పెంచుతామని కూటమి ఇచ్చిన హామీతో అత్యధిక శాతం వాలంటీర్లు ఆ వైపుగా టర్న్ అయ్యారని అంటున్నారు.
అలా కూటమి విజయంలో వాలంటీర్ల పాత్ర కూడా చాలా ఉందని అంటున్నారు. తామేదో తలిస్తే వేరేగా జరిగింది అన్నట్లుగా వాలంటీర్ల వల్ల చివరికి ఎంతో కొంత లాభం అయితే కూటమి పొందింది అన్న భావన వైసీపీ వర్గాలలో ఉంది.
దాంతో ఎన్నికలు పూర్తి అయిన తరువాత కూటమి ప్రభుత్వం అనేక హామీలను అమలు చేయడంలో తడబాటు పడుతున్నా వైసీపీ వాటిని ప్రస్తావిస్తోంది తప్ప వాలంటీర్ల విషయం వారి హామీల గురించి ఎక్కడా మాట్లాడటం లేదని గుర్తు చేస్తున్నారు. సూపర్ సిక్స్ హామీలు ఉచిత పధకాలు అంటూ కూటమి ఇచ్చిన హామీలను వల్లె వేస్తున్న వైసీపీ నేతలు వాలంటీర్లకు పది వేల రూపాయలు ఇస్తామని ఇచ్చిన హామీని ఎందుకు చెప్పడం లేదని చర్చ కూడా సాగుతోంది.
వాలంటీర్ల వ్యవస్థను పెంచి పోషించినా లాభం జరగలేదు అన్నది వైసీపీకి భావన ఉంది. అంతే కాకుండా వాలంటీర్లను మళ్లీ దగ్గరకు తీయాలని చూస్తే వైసీపీ క్యాడర్ దూరం అవుతుంది అన్న ఆలోచన కూడా ఉంది అంటున్నారు. వాలంటీర్ల వల్లనే పార్టీ తమను పక్కన పెట్టింది అని భావిస్తున్న కార్యకర్తలను ఇపుడిపుడే వైసీపీ పెద్దలు మంచి చేసుకుంటున్నారు. తాము గతంలో చేసిన తప్పులు చేయమని ఈసారి అధికారంలోకి వస్తే కనుక కార్యకర్తలకు పెద్ద పీట వేస్తామని ఒకటికి పదిసార్లు హామీ ఇస్తున్నారు.
మరి ఆ రకంగా వైసీపీ పెద్దలు చెబుతున్నపుడు వాలంటీర్లకు మద్దతుగా మాట్లాడితే అసలుకే ఎసరు వస్తుందని కూడా అంటునారు. దాంతోనే ఎందుకొచ్చిన వ్యవహారం అన్నట్లుగానే వైసీపీ వ్యూహాత్మకంగానే వాలంటీర్లని పక్కన పెట్టేసిందని అంటున్నారు
ఇదిలా ఉంటే వాలంటీర్లకు హామీ ఇచ్చినట్లుగా గౌరవ వేతనం పదివేల రూపాయలు ఇవ్వాలని వారిని విధులలోకి తీసుకోవాలని వామపక్షాలు అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తునాయి. వారితో యూనియన్ కట్టించి మరీ నిరసనలకు మద్దతుగా నిలుస్తున్నాయి. అయితే ప్రధాన పార్టీలు అయిన టీడీపీ జనసేన వైసీపీ వాలంటీర్ల విషయంలో అంతగా ఫోకస్ పెట్టకపోవడంతో ఇక వారి కధ కంచికేనా అన్న చర్చ అయితే సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.