Begin typing your search above and press return to search.

వైసీపీకి కొరుకుడు పడని సీట్లో కొత్త ప్లాన్

అయితే ఈ నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉంది. ఆ విధంగా టీడీపీకి బలమైన పునాది వేసిన వారు ఎన్ టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు.

By:  Tupaki Desk   |   15 Jan 2025 8:30 PM GMT
వైసీపీకి కొరుకుడు పడని సీట్లో కొత్త ప్లాన్
X

వైసీపీకి రాయలసీమ తరువాత నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో పట్టు ఉంది. 2014, 2019లలో కూడా ఆ పార్టీ తన ప్రభావాన్ని నెల్లూరులో ఎక్కువగా ప్రకాశంలో చాలా వరకూ చూపించింది. ఇదిలా ఉంటే 2024 ఎన్నికల్లో మాత్రం వైసీపీ చతికిలపడిపోయింది. వైసీపీకి రాజకీయ ప్రకాశం లేని జిల్లాగా మిగిలింది

ఇక ఓటమి నుంచి వైసీపీ అధినాయకత్వం మెల్లగా తేరుకుంటోంది. ఈ నేపథ్యంలో పార్టీ వివిధ నియోజకవర్గాల విషయంలో రిపేర్లకు రెడీ అవుతోంది. ఎక్కడ ఏమి చేయాలి అన్న చర్చ కూడా తీవ్రంగా ఉంది. వైసీపీ ఈ జిల్లాలో బోణీ కొట్టని సీటుగా టీడీపీకి కంచుకోటగా ఉన్నది పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం.

ఈ సీటులో వైసీపీ 2014 నుంచి పోటీ చేస్తే మూడు సార్లూ పరాభవం పొందింది. ఆ పార్టీని ఒంటి చేత్తో ఓడిస్తున్న గెలుపు వీరుడుగా ఏలూరు సాంబశివరావు ఉన్నారు. ఆయన వైసీపీని ఓడించడంలో హ్యాట్రిక్ కొట్టారు. ఇక వైసీపీకి 2019 ఎన్నికలు ఒక ప్రభంజనంగా మారినా కూడా పర్చూరు లో ఓటమి పాలు అయింది.

ఈ నేపధ్యంలో గతంలో చేసిన అనేక ప్రయోగాలను ఇపుడు పక్కన పెట్టి వాస్తవిక ధోరణిలో వైసీపీ ఇక్కడ ఆలోచన చేస్తోంది అని అంటున్నారు. వైసీపీ పర్చూరు కి ఎంతో మందిని మార్చింది. అలా వైసీపీలో 2014లో గొట్టిపాటి భరత్ కుమార్ కి టికెట్ ఇచ్చింది. అలాగే 2019లో ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు టికెట్ ఇచ్చింది. 2024లో ఎడం బాలాజీకి ఇచ్చింది.

ఇపుడు చూస్తే ఈ నియోజకవర్గం వరసగా వైసీపీ ఓటమిని మూటకట్టుకోవడంతో వీక్ అవుతోంది. దాంతో ఈ నియోజకవర్గం నుంచి అయిదు సార్లు గెలిచిన సీనియర్ మోస్ట్ లీడర్ గాదె వెంకటరెడ్డి కుమారుడు గాదె మధుసూదన్ రెడ్డికి ఇంచార్జి బాధ్యతలు అప్పగించాలని వైసీపీ హై కమాండ్ భావిస్తోంది అని అంటున్నారు.

గాదె కుటుంబానికి రాజకీయంగా పట్టు ఉందని, లోకల్ గా ఉన్న పొలిటికల్ ఫ్యామిలీ కావడంతో పాటు గాదె రాజకీయ వారసుడుని ముందు పెడితే క్యాడర్ లో జోష్ వస్తుందని ఆ విధంగా కసితో లీడర్లు క్యాడర్ పనిచేస్తారు అని భావిస్తున్నారుట.

అయితే ఈ నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉంది. ఆ విధంగా టీడీపీకి బలమైన పునాది వేసిన వారు ఎన్ టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఆయన 1983, 1985, 1989లో వరసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఆ తరువాత తిరిగి 2004లో ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే అపుడు కూడా విజయం దక్కించుకున్నారు.

ఇలా ఆయన ప్రభావం తో పాటు టీడీపీకి గట్టి పట్టు ఉంది. టీడీపీ పుట్టాక ఒక ఉప ఎన్నికతో కలుపుకుని 11 సార్లు ఎన్నికలు జరిగితే ఏడు సార్లు టీడీపీ గెలవడం పసుపు పార్టీ ఎంతలా పదిలంగా ఉందో అర్ధం అవుతుంది. అయితే ఈసారి పర్చూరు నించి వైసీపీ గెలుపుని సొంతం చేసుకోవాలని ఆ పార్టీ అధినాయకత్వం చూస్తోంది. దీంతో భారీ మార్పులను చేస్తోంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.