Begin typing your search above and press return to search.

జమిలి జలుబు వైసీపీకే బాగా పట్టిందే !

అలా ప్రచారం చేయడం వెనక తమ పార్టీ క్యాడర్ లో వేడిని పుట్టించడం ముఖ్యంగా ఉంది.

By:  Tupaki Desk   |   16 Dec 2024 3:42 AM GMT
జమిలి జలుబు వైసీపీకే బాగా పట్టిందే !
X

వైసీపీ కూడా కొత్త వ్యూహాలను అనుసరిస్తోంది. తమ నేతలను కాపాడుకుంటూ క్యాడర్ లో జోష్ తెస్తూ ముందుకు పోయేందుకు వినూత్న మార్గాలను ఎంచుకుంటోంది. అలా అందివచ్చిన అవకాశమే జమిలి ఎన్నికలు. నిజానికి ఇది చంద్రబాబు వాడి వదిలేసిన ఓల్డ్ స్ట్రాటజీయే. 2019 నుంచి 2024 మధ్యలో చంద్రబాబు అండ్ కో రేపో మాపో ఎన్నికలు అంటూ ఎన్నిసార్లు ప్రచారం చేసారో కూడా లెక్కలేదు.

అలా ప్రచారం చేయడం వెనక తమ పార్టీ క్యాడర్ లో వేడిని పుట్టించడం ముఖ్యంగా ఉంది. అంతే కాదు ఇంట్లో ఉన్న నాయకులను బయటకు తీసుకుని వచ్చే మంత్రమూ దాగుంది. ఆ విధంగా చేసి బాబు సక్సెస్ అయ్యారు. ఎన్నికలు ముంగిటిలో ఉన్నాయని చంద్రబాబు చేసిన ప్రచారం వల్ల క్యాడర్ తో పాటు లీడర్లు కూడా ఒక దశలో అలెర్ట్ అయ్యారు.

ఆ మీదట వారు రోడ్ల మీదకు రావడంతో టీడీపీ వ్యూహాలు పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాయి. దాంతో 2024 ఎన్నికల నాటికి బాబు ఏకంగా వేసవి వేడినే పుట్టించి పార్టీని యుద్ధ భూమిలోకి దింపగలిగారు. కట్ చేస్తే ఇపుడు వైసీపీ విపక్షంలో ఉంది.

ఆ పార్టీ కూడా ఇబ్బందులు పడుతోంది. పూటకొక నాయకుడు బయటకు పోతున్నారు. అలా వెళ్ళిపోతూ వారంతా జగన్ మీద నిందలు వేస్తున్నారు. దీంతో వైసీపీకి ఫ్యూచర్ లేదన్న భావన కలిగించే ప్రయత్నమూ జరుగుతోంది. ఈ క్రమంలో వైసీపీకి ఏమీ పాలు పోని పరిస్థితి ఏర్పడింది.

సరిగ్గా ఈ టైం లో కేంద్రంలోని బీజేపీ జమిలి ఎన్నికల అస్త్రాన్ని అందించింది. బీజేపీ జమిలి ఎన్నికల మీద కొంత హడావుడి చేస్తోంది. దానిని ఆసరాగా తీసుకుని వైసీపీ ఏపీలో అయితే చాలా దూకుడు చేస్తోంది. జమిలి ఎన్నికలు కచ్చితంగా మరో రెండెళ్లలో వచ్చేస్తాయి అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు

అయిదేళ్ళ వరకూ ఎవరూ వెయిట్ చేయాల్సిన అవసరం లేదని కాస్తా ఓపిక పడితే ఇట్టే 2027 వస్తుందని ఎన్నికలు ఖాయంగా వస్తాయని చెబుతున్నారు. వైసీపీ కీలక నాయకుడు విజయసాయిరెడ్డి అయితే జమిలి ఎన్నికలు కచ్చితంగా వస్తాయని జోస్యం చెబుతున్నారు. ఆరు నూరు అయినా కేంద్ర ప్రభుత్వం మరో రెండేళ్ళలో ఎన్నికలకు వెళ్తుందని అందువల్ల పార్టీ క్యాడర్ అంతా సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపు ఇస్తున్నారు

దాంతో పాటు ఆయన మరో మాట కూడా అంటున్నారు. ఈసారి నియోజకవర్గాల పునర్ విభజన జరుగుతుందని దాంతో ఎక్కువ సీట్లు వస్తాయని ఆశావహులు అందరికీ చాన్స్ ఉంటుందని ఊరిస్తున్నారు. అంతే కాదు మహిళా బిల్లు తో 33 శాతం రిజర్వేషన్లు కూడా అమలు అవుతాయని ప్రతీ మూడు సీట్లలో ఒక సీటు మహిళకు దక్కుతుందని మహిళా నేతలు కూడా ఆ దిశగా తమ నాయకత్వాన్ని నిరూపించుకునేందుకు ఇప్పటి నుంచే ఫీల్డ్ లో ఉండాలని కోరుతున్నారు. ఇవన్నీ చూస్తూంటే నిజంగా జమిలి పేరుతో రెండేళ్లలో ఎన్నికలు వస్తాయో రావో తెలియదు కానీ వైసీపీ మాత్రం దానిని తెగ వాడుకుంటోంది.

ఈ విధంగా 2027 దాకా వైసీపీ బండిని లాగగలిగితే అపుడు ఒకవేళ జమిలి ఎన్నికలు జరగకపోయినా అక్కడికి 2029 సార్వత్రిక ఎన్నికలకు మిగిలేది మరో రెండేళ్లే కాబట్టి వైసీపీ గేర్ మార్చి స్పీడ్ అందుకుంటుందని లెక్కలేస్తోంది. మొత్తానికి చూస్తే ఈ జమిలి మంత్రం మాత్రం బీజేపీ కంటే వైసీపీయే ఎక్కువగా పఠిస్తోంది.