Begin typing your search above and press return to search.

జగన్ వర్సెస్ షర్మిళ... వైసీపీ పప్పులో కాలు వేసిందా?

వైఎస్ కుటుంబంలో ఆస్తుల వివాదాలు ఇప్పుడు కోర్టుమెట్లెక్కాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్ - వైఎస్ షర్మిళ మధ్య ఆస్తుల పంచాయతీ కోర్టుకు చేరింది.

By:  Tupaki Desk   |   24 Oct 2024 4:13 AM GMT
జగన్  వర్సెస్  షర్మిళ... వైసీపీ పప్పులో కాలు వేసిందా?
X

వైఎస్ కుటుంబంలో ఆస్తుల వివాదాలు ఇప్పుడు కోర్టుమెట్లెక్కాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్ - వైఎస్ షర్మిళ మధ్య ఆస్తుల పంచాయతీ కోర్టుకు చేరింది. ఈ సమయంలో ఇద్దరి మధ్యా లేఖల యుద్ధం జరుగుతుంది. ఆ లేఖలు మరో వైపు నుంచి వైరల్ అవుతోన్న పరిస్థితి నెలకొంది! ఆ సంగతి అలా ఉంటే... ఈ వ్యవహారంలో వైసీపీ ఇస్తోన్న వివరణ జగన్ కు ఇబ్బందులు తెచ్చిపెట్టేలా ఉందా అనే చర్చకు తెరలేపింది.

అవును... ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అన్నా చెల్లెల్ల మధ్య నెలకొన్న ఆస్తి తగాదాల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇది పూర్తిగా వారి వ్యక్తిగత, కుటుంబ వ్యవహారం అని ఎవరైనా భావించినప్పటికీ... ఈ విషయంలో అన్న.. మాజీ సీఎం, చెల్లెలు.. పీసీసీ చీఫ్ కావడంతో ప్రజల్లో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సమయంలో... ఈ వ్యవహారంపై వైసీపీ ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.

ఇందులో భాగంగా... “వారసత్వపు ఆస్తులు కానప్పటికీ.. స్వార్జితం అయినప్పటికీ.. తన చెల్లెలి మీద ఉన్న ప్రేమాభిమానాలతో ఇస్తానని కమిట్మెంట్ చూపించి ఎంవోయూ రాసిచ్చారు జగన్.. ఇదే సమయంలో.. కేసులు తేలిన తర్వాత ఆస్తులు అప్పగిస్తారు.. కానీ.. ఈ లోపే చట్టవిరుద్ధంగా సరస్వతీ పవర్ లో జగన్ ఇచ్చిన గిఫ్ట్ డీడ్ ను ఆధారంగా చేసుకుని విజయమ్మ దగ్గర నుంచి షేర్లను బదిలీ చేయించుకున్నారు”.

“ఈ వ్యవహారం లీగల్ గా జగన్ కి ఇబ్బందులు తెచ్చే విషయమని న్యాయవాదులు చెప్పాడంతో.. గత్యంతర లేని పరిస్థితుల్లో లీగల్ స్టెప్ తీసుకున్నారు” అని వైసీపీ వెల్లడించింది. అసలు చెల్లెలిపై ప్రేమ చూపకూడదని అనుకుంటే.. జగన్ ఎంవోయూ రాసిచ్చేవారే కాదు కదా? అనేది వైసీపీ వేస్తోన్న ఎదురు ప్రశ్న!

దీనికి అనుబంధంగా... సరస్వతి పవర్ విషయంలో లీగల్ సమస్యలు కాబట్టి.. 2021లో జగన్ గిఫ్ట్ డీడ్ కు పరిమితం అయ్యారు. అసలు లీగల్ గా అవకాశం ఉండి ఉంటే.. ఆరోజే షేర్లలో బదిలీ చేసేవారు కాదా?.. అని ప్రశ్నించింది. కానీ, షేర్ల బదిలీ చట్టవిరుద్ధమని తెలిసి కూడా బదిలీ చేశారంటే.. ఇది జగన్ ను తీవ్రమైన ఇబ్బందులకు గురిచేయడం కాదా? ఇది ఆయన బెయిల్ రద్దుకు అనుకూలమైన పరిస్థితులు సృష్టించడమే కదా? అనేది వైసీపీ వేస్తోన్న మరో కీలక ప్రశ్న.

చెల్లెలిపై అభిమానంతో మంచి చేయబోయి తాను ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి జగన్ ది.. ఇంతటి పరిస్థితుల్లో పదేళ్లలో రూ.200 కోట్లు జగన్ తన చెల్లికి ఇచ్చారు.. అని వైసీపీ ఎక్స్ వేదికగా రాసుకొచ్చింది.

అయితే... ఇలా పూర్తిగా వ్యక్తిగతమైన ఈ వ్యవహారాన్ని తెరపైకి తేవడం.. జగన్ బెయిల్ రద్దుకు జరుగుతున్న ప్రయత్నాల్లో ఇదొక భాగం అంటూ స్పందించడం.. దీనికితోడు రూ.200 కోట్లు తన చెల్లికి జగన్ ఇచ్చారని చెప్పడం వంటి విషయాలు తెరపైకి రావడం అంటే అది వైసీపీ సెల్ఫ్ గోల్ వంటిదా అనే సందేహాన్ని వ్యక్తపరుస్తున్నారు జగన్ అభిమానులు.

ఈ సందర్భంగా... తనను బెదిరిస్తున్నారని షర్మిళ లేఖ తీసుకుని కోర్టుకు వెళ్తే మరో కొత్త సమస్య వచ్చే ఇబ్బంది లేదంటారా? అనేది జగన్ ఫ్యాన్స్ వేస్తోన్న మరో ప్రశ్న. ఈ విషయంలో పూర్తిగా అన్ని రకాలుగా ఆలోచించకుండా అత్యుత్సాహంతో స్పందిస్తే.. జగన్ కు సరికొత్త సమస్యలు తెచ్చిపెట్టినట్లవుతుందనే విషయం మరిచిపోకూడదని ఆయన అభిమానులు అంటున్నారు.